టీటీవీ తప్పుకో..
♦ అమ్మ శిబిరంలో గళం
♦ త్వరలో ఒకే వేదికగా పళని, పన్నీరు
♦ చర్చల్లో సామరస్యం
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే నుంచి టీటీవీ దినకరన్‌ను సాగనంపేందుకు అమ్మ శిబిరంలో చక చకా ప్రయత్నాలు సాగుతున్నాయి. తప్పుకుంటావా...తప్పించమంటారా..? అన్న గళాన్ని సీఎం పళనిస్వామికి మద్దతుగా ఉన్న పలువురు మంత్రులు అందుకున్నట్టుగా సంకేతాలు వెలువడుతున్నాయి. అన్నాడీఎంకే, ప్రభుత్వ రక్షకులుగా పళనిస్వామి, పన్నీరుసెల్వం ఏకం కావడం
తథ్యం అని రెండు శిబిరాల్లోని సీనియర్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఐటీ దాడుల నేపథ్యంలో అన్నాడీఎంకే(అమ్మ) శిబిరంలో సాగుతున్న పరిణా మాలు ఆసక్తికరంగా మారిన విషయం తెలిసిందే. ఐటీ ఉచ్చులో పడ్డ మంత్రి విజయభాస్కర్‌ను తొలగించే వ్యవహరంలో అమ్మ శిబిరం ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్, సీఎం ఎడపాడి పళని స్వామిల మధ్య బయలుదేరిన విభేదాలు కొత్త అడుగులకు దారి తీస్తున్నాయి. టీటీవీని పక్కన పెట్టి, అన్నాడీఎంకేను, ప్రభుత్వాన్ని రక్షించుకునేందుకు తగ్గ ఎత్తుగడల్లో మాజీ సీఎం, ప్రస్తుత సీఎం ఏకం అయ్యేందుకు సాగుతున్న ప్రయత్నాలు ఫలితాల్ని ఇస్తున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఇరు శిబిరాలకు చెందిన సీనియర్ల మధ్య ఆదివారం కూడా చర్చలు సాగినట్టు తెలిసింది.
మంతనాల్లో: 90 శాతం మేరకు సంతృప్తికరంగానే మంతనాలు సాగినట్టు సీనియర్లు పేర్కొంటున్నారు. అదే సమయంలో పళని స్వామి వెంట నడిచేందుకు 60 మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నట్టు, టీటీవీకి మద్దతుగా వ్యవహరించే విధంగా మరో 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్టు గణాంకాల్లో తేలింది. ఇప్పటికే 12 మంది పన్నీరు వెంట ఉండగా, మరి కొందరు తటస్థంగా వ్యవహరిస్తుండటం తాజా చర్చల ద్వారా ఓ నిర్ధారణకు వచ్చినట్టు తెలిసింది.
ఈ లెక్కలు పళని స్వామి శిబిరాన్ని ఆలోచనలో పడేసినా, పన్నీరు సెల్వం నేతృత్వంలో అన్నాడిఎంకే పురట్చి తలైవీ శిబిరంలోని సీనియర్లు మాత్రం భరోసా ఇచ్చినట్టు తెలిసింది. కువత్తూరులో సాగిన వ్యవహారాల్ని పరిగణలోకి తీసుకుని ఇప్పటికే ఐటీ గురి పెట్టి ఉండటాన్ని తమకు అనుకూల అస్త్రం మలచుకుందామన్న సూచనను చేసినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఇప్పటికే ఎమ్మెల్యేల ఆస్తుల వివరాలను ఐటీ సేకరించినట్టుగా, దాడులు తథ్యమన్న భయాన్ని సృష్టించేందుకు తగ్గ కార్యచరణను రూపొందించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
టీటీవీ తప్పుకో: ఎమ్మెల్యేలను దారిలోకి తెచ్చుకునేందుకు ఐటీ దాడుల భయాన్ని అస్త్రంగా ప్రయోగించేందుకు తాము సిద్ధం అని, అదే సమయంలో టీటీవీని ఎలా తప్పించాలో అన్న విషయం మీద దృష్టి పెట్టాలని పళని స్వామి మద్దతు మంత్రులకు పన్నీరు శిబిరం సూచించినట్టు తెలిసిందే.దీంతో మంత్రులు తంగమణి, వేలుమణిలో ఒక అడుగు ముందుకు వేసి దూకుడు పెంచేందుకు సిద్ధం అయ్యారటా..!. టీటీవీ తప్పుకుంటావా..? , తప్పించ మంటారా..? అన్న నినాదాన్ని అందుకునే పనిలో పడ్డట్టు అన్నాడిఎంకే అమ్మ శిబిరంలో చర్చ సాగుతున్నది.
టీటీవీని అన్నాడిఎంకే నుంచి తప్పించడంతో పాటుగా, ఐటీ ఉచ్చులో పడ్డ మంత్రి విజయ భాస్కర్‌ను పదవి నుంచి సాగనంపేందుకు ఎడపాడి సిద్ధం అవుతున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా ఆ ఇద్దర్ని బయటకు పంపించి, ప్రజల వద్ద మార్కులు కొట్టేయడానికి తగ్గ వ్యూహంతో పళని స్వామి ముందుకు అడుగులు వేస్తున్నట్టు తెలిసింది. ఇక, తనను తప్పించి, ఆ ఇద్దరు ఏకం అయ్యేందుకు సాగుతున్న ప్రయత్నాల్ని అడ్డుకునేందుకు టీటీవీ కసరత్తుల్లో ఉన్నట్టు సమాచారం. పరప్పన అగ్రహార చెరలో ఉన్న చిన్నమ్మ శశికళను కలిసి, తదుపరి అడుగులు వేయడానికి నిర్ణయించినట్టు ఆయన మద్దతు ఎమ్మెల్యేల ఒకరు పేర్కొన్నారు.