గురి మార్చిన సీఎం పళని.. కళ్లుచెదిరే ఎత్తుగడ
సాక్షి, చెన్నై : టీవీవీ దినకరన్ ఎమ్మెల్యేలను చీల్చడంతో మైనారిటీలో పడిపోయిన ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు సీఎం ఎడపాడి పళనిస్వామి కళ్లుచెదిరే ఎత్తుగడలు సిద్ధంచేశారు. ఇందులో భాగంగా ఆయన డీఎంకే ఎమ్మెల్యేలను గురి పెట్టారు.
దినకరన్ రూపంలో సీఎం పళని స్వామి ప్రభుత్వం సంక్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. సీఎంకు వ్యతిరేకంగా 21 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటుతో ముందుకు సాగుతున్నారు. వీరితో పాటుగా ప్రధాన ప్రతి పక్షం సైతం బల నిరూపణకు పట్టుబడుతుండటంతో పళని సర్కారు ఇరకాటంలో పడింది. బల నిరూపణ తప్పని సరిగా మారిన పక్షంలో గట్టెక్కేందుకు తగ్గ మార్గాల్ని పళని అన్వేషిస్తున్నారు. ఇప్పటికే తిరుగుబాటు ఎమ్మెల్యేలకు స్పీకర్ ధనపాల్ ద్వారా నోటీసులు ఇప్పించారు. పార్టీకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న వారిపై ఎందుకు అనర్హత వేటు వేయకూడదు అన్న ప్రశ్నతో ఈ నోటీసులు జారీ అయ్యాయి. ఇందుకు వారి నుంచి ఎలాంటి సమాధానం వస్తుందోనన్నది పక్కన పెడితే, సీఎం పళని కొత్త ఎత్తుగడతో బలపరీక్షలో నెగ్గేందుకు వ్యూహరచన చేసి ఉండటం వెలుగులోకి వచ్చింది.
కొత్త వ్యూహం : కేంద్రంలోని ఢిల్లీ పెద్దలు రచించిన వ్యూహమా? అన్నాడీఎంకే సీనియర్లు ఇచ్చిన సలహానా? అన్నది పక్కన బెడితే, డీఎంకే సభ్యుల్ని గురి పెట్టి ఈ వ్యహ రచన సాగడం గమనించాల్సిన విషయం. ఇది కూడా నెల రోజుల క్రితం సాగిన ఘటనను ఆసరాగా చేసుకుని కొత్త ఎత్తుగడకు సిద్ధం అవుతున్నారు. అసెంబ్లీ వేదికగా గత నెల నిషేధిత గుట్కాల వ్యవహారంపై తీవ్ర రగడ చోటు చేసుకున్న విషయం తెలిసిందే. నిషేధిత వస్తువులు యథేచ్ఛగా దొరుకుతున్నాయంటూ సభలో గుట్కా ప్యాకెట్లను డిఎంకే సభ్యులు ప్రదర్శించడం వివాదానికి దారి తీసింది. ఈ వ్యవహారాన్ని ఆ సమయంలో అధికార పక్షం పెద్దగా పట్టించుకోలేదు. అయితే, ఇప్పుడు దీనినే వాడుకుని క్రమ శిక్షణా సంఘం ముందు ఉంచేందుకు సిద్ధం కావడం ఆలోచించాల్సిందే.
ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై వేటుకు కసరత్తు : శాననసభలో 20 మంది డీఎంకే సభ్యులు గుట్కా ప్యాకెట్లను ప్రదర్శించినట్టుగా వీడియో ఆధారాల్ని ప్రస్తుతం సేకరించారు. గుట్కా వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించి, ఆ సభ్యులపై చర్యకు ప్రస్తుతం క్రమ శిక్షణా సంఘానికి సిఫారసు చేయడంతో డీఎంకే వర్గాలు అగ్గి మీద గుగ్గిలంలా మండి పడుతున్నారు. తిరుగుబాటు దారులపై అనర్హత వేటు, 20 మంది డీఎంకే సభ్యుల సస్పెండ్ వెరసి సభలో సభ్యుల సంఖ్య తగ్గించినట్టు అవుతుందన్న వ్యూహంతోనే పళని ఈ ఎత్తుగడ వేసినట్టు సంకేతాలు వెలువడుతున్నాయ. సంఖ్య తగ్గిన పక్షంలో మెజారిటీ వ్యవహారంలోనూ సంఖ్యా బలం తగ్గేందుకు ఆస్కారం ఉందని, ఆ సమయంలో తమకు ఉన్న ఎమ్మెల్యే బలంతో పరీక్షలో నెగ్గవచ్చన్న వ్యూహాన్ని రచించినట్టు అన్నాడిఎంకే వర్గాలు పేర్కొంటున్నాయి.
ఇది సాధ్యమా?: డీఎంకే సభ్యుల్ని గురి పెట్టి పళని కొత్త వ్యూహాన్ని రచించడం బాగానే ఉన్నా, ఆచరణలో సాధ్యమా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. 40 రోజుల క్రితం జరిగిన సంఘటనను ఇప్పుడు తెర మీదకు తీసుకురావడాన్ని డిఎంకే సభ్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈనెల 28వ(సోమవారం) తేదిన జరగనున్న క్రమ శిక్షణా సంఘం సమావేశంలో తేల్చుకునేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ క్రమ శిక్షణా సంఘంలో సీఎం, స్పీకర్‌తో పాటుగా 17 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో 10 మంది అన్నాడీఎంకే, ఆరుగురు డీఎంకే, ఒకరు కాంగ్రెస్‌కు చెందిన వాళ్లు ఉన్నారు. అన్నాడీఎంకేకు చెందిన పది మందిలో ముగ్గురు దినకరన్ మద్దతు ఎమ్మెల్యే ఉన్నారు. ఈ దృష్ట్యా, నిర్ణయంపై సంఖ్యా బలం సమానంగానే ఉందని చెప్పవచ్చు. అన్నాడీఎంకే తరపున ఏడుగురు, డీఎంకే కాంగ్రెస్ తరపున ఏడుగురు సమానంగా ఉన్న దృష్ట్యా, చర్యల విషయంగా ఎలాంటి వివాదం సాగనున్నదో అన్నది వేచి చూడాల్సిందే.
నేడు గవర్నర్‌తో భేటీ: నిన్నటి వరకు దినకరన్ వర్సెస్ పళని అన్నట్టుగా సాగిన బల పరీక్ష రచ్చ, ప్రస్తుతం స్టాలిన్ వర్సెస్ పళని అన్నట్టుగా మారి ఉంది. తమ ఎమ్మెల్యేను గురి పెట్టి సస్పెండ్ కార్యాచరణ సిద్ధం అవుతోండటాన్ని డీఎంకే కార్య నిర్వాహక అధ్యక్షుడు, ప్రధాన ప్రతి పక్ష నేత ఎంకే స్టాలిన్ తీవ్రంగా పరిగణించారు. ఆదివారం రాష్ట్రగవర్నర్(ఇన్) విద్యాసాగర్‌రావును కలిసేందుకు నిర్ణయించారు. పదిన్నర గంటలకు డిఎంకే ఎమ్మెల్యేలు అందరూ గవర్నర్‌ను కలవనున్నారు. ఈ విషయంగా తిరువారూర్‌లో స్టాలిన్‌మీడియాతో మాట్లాడుతూ,క్రమ శిక్షణా సంఘాన్ని సమావేశ పరచి, తమ సభ్యులకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే చట్టపరంగా ఎదుర్కొంటామన్నారు.