తమిళసభలో తన్నులాట
మొత్తానికి తమిళనాడు రాజకీయాల్లో ఒక కీలక ఘట్టం ముగిసింది. ముఖ్యమంత్రి పళనిస్వామి శనివారం అసెంబ్లీలో విశ్వాస పరీక్ష నెగ్గి మెజారిటీ ఎమ్మెల్యేలు తన పక్షానే ఉన్నారని నిరూపించుకున్నారు. కీలక సమయాల్లో బలంగా, దృఢంగా వ్యవహరించలేనివారు అనుకున్నది సాధించలేరని పన్నీర్‌సెల్వానికి తెలిసొచ్చింది. అయితే ఈ విశ్వాస పరీక్ష సందర్భంగా అసెంబ్లీలో చోటుచేసుకున్న పరిణామాలు దురదృష్టకరమైనవి.
స్పీకర్‌పై దాడిచేసి ఆయన చొక్కా చించి, దౌర్జన్యం చేస్తుంటే మార్షల్స్ ఆయనను అతి కష్టం మీద అక్కడినుంచి తరలించాల్సివచ్చింది. తనపైనే దౌర్జన్యం జరిగిందని ప్రధాన ప్రతిపక్షం నాయకుడు స్టాలిన్ అంటున్నారు. డీఎంకే సభ్యుల్ని సభ నుంచి సస్పెండ్ చేశాక తీర్మానంపై ఓటింగ్ సాధ్యమైంది. అధికారం కోసం ఈ మాదిరి కాట్లాటలు మన దేశంలో సర్వసాధారణంగా మారాయి. ఇతర సమయాల్లో ఎంతో సంస్కారవంతంగా ఉన్నట్టు కనబడేవారు చట్టసభల్లో బలా బలాలు తేల్చుకోవాల్సివచ్చేసరికి ప్రత్యర్థులపైకి లంఘించడం, దూషణలకు దిగడం... గూండాయిజానికి కూడా సిద్ధపడటం తరచు కనబడుతుంది.
జయలలిత మరణానంతరం అన్నా డీఎంకే సంక్షోభంలో పడింది. దీనికితోడు శశికళ జైలుపాలుకావడంతో ఆమె ఆశీస్సులతో లెజిస్లేచర్ పార్టీ నేతగా ఎన్నికైన పళనిస్వామి బలనిరూపణ చేసుకోగలుగుతారా అన్న సందేహాలు చాలామందిలో ఏర్పడ్డాయి. శశికళ శిబిరంలోనివారు నిర్బంధంలో మగ్గుతున్నారన్న ప్రచారం జరి గింది. వారికి స్వేచ్ఛనిస్తే గెలుపు తనదేనని పన్నీర్ కూడా చెబుతూ వచ్చారు. తనకు మరో అవకాశం ఇవ్వాలని వేడుకున్నారు. ఒకసారి రాజీనామా చేశాక, దాన్ని ఆమో దించాక రాజ్యాంగపరంగా అది సాధ్యంకాని విషయం. రాజీనామా చేసిన రోజునే పన్నీర్ ఆమాట చెప్పి ఉంటే వేరుగా ఉండేది. అదే జరిగితే పన్నీర్ రాజీనామాపై గవర్నర్ సీహెచ్ విద్యాసాగరరావు నిర్ణయాన్ని వాయిదా వేసేవారేమో!
నిజానికి సుబ్రహ్మణ్యస్వామిని మినహాయిస్తే బీజేపీ నేతలంతా పన్నీర్‌సెల్వానికి మద్దతు పలికారు. కనుక కేంద్ర ప్రభుత్వ అండదండలు, గవర్నర్ సానుభూతి ఆయనకే ఉన్నాయని అందరికీ తెలుస్తూనే ఉంది. కానీ సారాంశంలో అధికారం అన్నది నంబర్ గేమ్! మెజారిటీ సభ్యులు ఎవరి పక్షాన ఉన్నారని తేలితే వారికి అది దక్కు తుంది. ఎవరికి ఇష్టం ఉన్నా, లేకున్నా తమిళనాడులో జరిగింది అదే.
ప్రజలంతా శశికళపై ఆగ్రహంతో ఉన్నారని, ఎమ్మెల్యేలను చెరవిడిపిస్తే వారు కూడా పన్నీర్ వైపు వస్తారన్న ప్రచారం జరిగింది. ప్రముఖ సినీ నటులు సైతం పన్నీర్‌నే సమర్ధించారు. నిజంగా అలాంటి పరిస్థితే ఉంటే విశ్వాసపరీక్షలో అది వ్యక్తమయ్యేది. పార్టీ నిలువునా చీలిపోకపోయినా కనీసం కొద్దిమందైనా మనసు మార్చుకునేవారు. బల నిరూపణ సమయంలో డీఎంకే వైఖరే అందరినీ ఆశ్చర్యపరి చింది. అధికారం కోసం అన్నా డీఎంకేలోని వైరి వర్గాలు ఘర్షణ పడటంలో అర్ధ ముంది. వారివల్ల సభా నిర్వహణకు ఆటంకాలెదురైతే వేరుగా ఉండేది. ఈ గొడ వతో సంబంధమే లేని ప్రతిపక్షం డీఎంకే దౌర్జన్యానికి పూనుకోవడం ఊహించని పరిణామం. సభలో తాము ఎవరినీ సమర్ధించబోమని ముందురోజు చెప్పిన మాటకే డీఎంకే నేత స్టాలిన్ కట్టుబడి ఉంటే ఆ పార్టీ పరువు నిలిచేది. కనీసం బలపరీక్షనాడు పన్నీర్‌కు మద్దతుగా ఓటేసి ఉన్నా ఎవరూ వేలెత్తిచూపరు.
ఆ రెండు ప్రత్యామ్నాయాలనూ విడిచిపెట్టి రహస్య ఓటింగ్ జరపాలని డిమాండ్ చేయడం, అందుకు స్పీకర్ అంగీకరించలేదని ఆగ్రహించి వీరంగం వేయడం ఎలా సమర్ధ నీయం? పన్నీర్ సైతం రహస్య ఓటింగ్ కోసం పట్టుబట్టలేదు. గైర్హాజర్ కాలేదు. ఆయన వర్గంలోని వారంతా బలపరీక్షలో పాల్గొన్నారు. వారికి లేని అభ్యంతరం డీఎంకేకు ఎందుకు? తాము రహస్య ఓటింగ్ ప్రతిపాదన తెస్తే పన్నీర్ వర్గం చెలరేగి పోతుందని, తాము కూడా తలదూర్చి సభా నిర్వహణను అడ్డుకుంటే తీర్మానం ప్రతిపాదన అసాధ్యమై, చివరకు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టకతప్పదని ఆ పార్టీ అనుకుని ఉండొచ్చు. బలనిరూపణ మరికొన్నాళ్లు వాయిదా పడితే అన్నాడీఎంకే బీటలు వారుతుందని కలగని ఉండొచ్చు. నిజానికి శశికళ వర్గానికి సైతం అలాంటి అనుమానాలున్నాయి. రోజులు గడుస్తున్నకొద్దీ ఎమ్మెల్యేలు చేజారతారేమోనన్న దిగులుంది. అందుకే గవర్నర్ ఇచ్చిన పక్షం రోజుల గడువును కాదని, వెనువెంటనే ఓటింగ్‌కు సిద్ధపడింది.
అయితే ఇప్పుడు గెలుపు సాధించినంతమాత్రాన పళనిస్వామి ప్రభుత్వం సుస్థిరంగా ఉంటుందని... రాష్ట్రంలో అనిశ్చితికి తెరపడుతుందని భావించడానికి లేదు. ఇప్పటికైతే తన వారసుణ్ణి శశికళ గెలిపించుకోగలిగారు. కానీ ఇంతమంది ఎమ్మెల్యేలను ఎల్లకాలమూ చెదిరిపోకుండా ఆమె కాపాడుకోగలరా? వారిలో అసం తృప్తి రగలకుండా చూసుకోగలరా? జైలుకెళ్తూ తన బంధువు దినకరన్‌కు శశికళ పార్టీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పజెప్పారు. ఆయన ద్వారా ప్రభు త్వాన్ని నియంత్రణలో పెట్టుకోవాలన్నది శశికళ ఎత్తుగడ కావొచ్చు. మరికొన్ని నెలల్లోనే తమిళనాడులో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. వివిధ అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు కూడా జరగాల్సి ఉంది. అప్పటికల్లా పళనిస్వామి నిల దొక్కుకోగలగాలి. సమర్థుడన్న పేరు తెచ్చుకోవాలి. ఇదంతా దినకరన్‌పై ఆధారపడి ఉంటుంది. పాలనలో శశికళ జోక్యం ఉన్నదన్న ముద్ర పడితే, పళనిస్వామి బల హీనుడన్న అభిప్రాయం ప్రజల్లో ఏర్పడుతుంది. వాస్తవానికి ఇప్పటికీ ప్రజాబలం పన్నీర్‌కే ఉన్నదని సినీ నటులు ప్రచారం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఉప ఎన్ని కలు, స్థానిక ఎన్నికలు కీలకమైనవి. అందులో ఫలితాలు ప్రతికూలంగా ఉంటే పళ నిస్వామి నుంచి వలసలు మొదలవుతాయి. ఎమ్మెల్యేలు అటు డీఎంకే వైపు... ఇటు పన్నీర్ వైపు చూడొచ్చు. అలాంటి పరిణామాలేమైనా జరిగితే వేరుగానీ ఈలోగానే పళనిస్వామికి శాపనార్థాలు పెట్టడం భావ్యం కాదు. అసెంబ్లీలో జరిగిన పరిణా మాలను సాకుగా చూపి పరిస్థితిని తిరగదోడటం మంచిది కాదు. బలపరీక్షలో ఆయన విజయం సాధించారు. దాన్ని గౌరవించి పాలన సజావుగా సాగేందుకు సహకరించడమే అందరి కర్తవ్యం.