ఫ్రీడమ్ 251 తయారీదారులకు ఊరట!
అలహాబాద్: ఫ్రీడమ్ 251 మొబైల్ తయారీదారులకు శుక్రవారం అలహాబాద్ హై కోర్టులో ఊరట లభించింది. ఫ్రీడమ్ 251 మొబైల్ తయారీ సంస్థ.. రింగింగ్ బెల్స్ ప్రతినిధులపై నమోదైన ఎఫ్ఐఆర్ను సవాలు చేస్తూ వేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన డివిజన్ బెంచ్.. ఎఫ్ఐఆర్ నమోదు చేయడం అప్రస్తుతమని అని తెలిపింది.
రింగింగ్ బెల్స్ డైరెక్టర్ మోహిత్ గోయల్, కంపెనీ ప్రెసిడెంట్ అశోక్ చద్దాపై భారతీయ జనతా పార్టీకి చెందిన కిరిట్ సోమయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు మార్చిలో దాఖలైన ఎఫ్ఐఆర్లో 420 సెక్షన్ను నమోదు చేశారు. అయితే వీరిపై సెక్షన్ 420 నమోదు చేయడానికి గల కారణాలు తెలపాలని కోర్టు కోరింది. దీనిపై ప్రాసిక్యూషన్ వివరణతో సంతృప్తి చెందని కోర్టు.. రెండు వారాల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. పిటిషనర్లు తమ పాస్పోర్టులను తిరిగి పొందడానికి దరఖాస్తు చేసుకోవడానికి కోర్టు అవకాశం కల్పించింది.
కోర్టు తీర్పుతో సంతృప్తిగా ఉన్నామని రింగింగ్ బెల్స్ సంస్థకు చెందిన అభిషేక్ విక్రమ్ వెల్లడించారు. సంస్థ ఉత్పత్తులను ఆలస్యం చేయాలనే దురుద్దేశంతోనే ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. కంపెనీకి సంబంధించిన ఇతర ఉత్పత్తులను ఇప్పటికే 28,000 యూనిట్లను అమ్మినట్లు ఆయన తెలిపారు. 251 రూపాయలకే కస్టమర్లకు స్మార్ట్ ఫోన్ను అందించడానికి భిన్న వ్యూహాలతో కంపెనీ ముందుకు పోతుందని వెల్లడించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య ఉన్న డిజిటల్ వ్యత్యాసాన్ని తగ్గించడమే సంస్థ లక్ష్యమని విక్రమ్ తెలిపారు.