అర్వల్: ప్రముఖ పాత్రికేయురాలు గౌరీ లంకేశ్ హత్య జరిగి రెండు రోజులు గడిచేలోపే బిహార్‌లో గురువారం ఓ జర్నలిస్టుపై ఆగంతకులు కాల్పులు జరిపి లక్ష రూపాయలు దోచుకున్నారు. ‘రాష్ట్రీయ సహారా’ హిందీ పత్రికలో పంకజ్ మిశ్రా జర్నలిస్టుగా చేస్తున్నారు. అర్వల్‌లో ఓ బ్యాంకు నుంచి డబ్బు డ్రా చేసుకుని పంకజ్ ఇంటికి వెళ్తుండగా బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు తుపాకీతో ఆయన వెనుక నుంచి వీపుపై రెండు బుల్లెట్లు పేల్చి డబ్బు తీసుకుని ఉడాయించారు.
నిందితుల్లో ఒకరిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. స్థానిక జేడీయూ ఎమ్మెల్యే పీఏ కుమారుడిపై తాను అనేకసార్లు వ్యతిరేక వార్తలు రాశానని, ఆ కక్షతోనే తనపై కాల్పులు జరిగాయని పంకజ్ ఆరోపించారు. వ్యక్తిగత వైరం లేదా దోపిడి ఉద్దేశ్యంతో ఈ దాడి జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం పంకజ్ ఆరోగ్యపరిస్థితి నిలకడగా ఉంది.