
4వ తేదీ నుంచి ఫ్లయింగ్ ఫెస్టివల్
సాక్షి, ముంబై: షోలాపూర్ అందాలను ఆకాశం నుంచి వీక్షించేందుకు అవకాశం కలిగించనున్నట్లు డాక్టర్ శిరీష్ వలుసంగ్‌కర్ తెలిపారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ పట్టణంలో ఈ నెల 4వ తేదీనుంచి ఆరు రోజుల పాటు రోటరీ క్లబ్ ఆఫ్ షోలాపూర్ నార్త్‌ఈస్ట్, అద్విప్ ఫ్లైడ్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో ప్యారాగ్లైడింగ్, ప్యారాసెయిలింగ్ ఫెస్టివల్ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. నాలుగో తేదీ ఉదయం 10 గంటలకు స్థానిక విమానాశ్రయంలో ఈ ఉత్సవం మొదలవుతుందని, అనంతరం మొదట సిద్ధేశ్వరాలయంపై చిన్న విమానాల ద్వారా పుష్పవర్షం కురిపించనున్నట్లు చెప్పారు.
ఈ ఉత్సవం కోసం రెండు ప్యారాసెయిలింగ్, నాలుగు ప్యారాగ్లైడింగ్, నాలుగు చిన్న విమానాలను తీసుకువస్తున్నట్లు వివరించారు. 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు చాలా తక్కువ ఖర్చుతో పవర్ ప్యారాగ్లైడింగ్ , ప్యారాసెయిలింగ్‌ల్లో ఆకాశంలోకి వేల ఫిట్ల వరకు విహరించవచ్చని చెప్పారు. ఇదేవిధంగా, విమానాలలో పైలట్ ఉజనీ డ్యాం బ్యాక్ వాటర్ వరకు విహరించవచ్చన్నారు.
విమానం తిరుగు ప్రయాణంలో తుల్జాపూర్, నలుదుర్గా, అక్కల్‌కోట్, స్వామి సమర్థ్ మందిరం మీదుగా ఎయిర్‌పోర్టుకు చేరుకుంటుందని తెలిపారు. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు విమానం నడుస్తుందన్నారు. సమావేశంలో పవన్ మోండే, సోమేశ్వర్ యబాజి, రాకేష్ ఉదగిరి తదితరులు పాల్గొన్నారు.