రచ్చ కాదు.. చర్చ జరగాలి!
పార్లమెంటు ధర్నాలు, నిరసనలకు వేదిక కాదు: రాష్ట్రపతి
► సభలో అంతరాయం ఆమోదయోగ్యం కాదు
► ఎంపీలున్నది ప్రజా సమస్యలపై చర్చించేందుకే...
► సభను ఆటంకపర్చడమంటే మెజార్టీ సభ్యుల్ని అడ్డుకోవడమే
న్యూఢిల్లీ: పార్లమెంటు ప్రతిష్టంభనపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తీవ్రంగా స్పందించారు. పార్లమెంటులో ఎంపీల ప్రాథమిక విధి ప్రజా సమస్యలపై చర్చించడమేనని, ఆ బాధ్యతను సజావుగా నిర్వర్తించాలని సూచించారు. ధర్నాలు, నిరసనలకు పార్లమెంటు వేదిక కాదని, అందుకు వేరే వేదికలున్నాయని చురకలంటించారు. కొద్ది మంది సభ్యులు మెజారిటీ సభ్యులను అడ్డుకుంటూ సభాకార్యక్రమాలకు అంతరాయం కలిగిస్తున్నారని విమర్శించారు. తన వ్యాఖ్యలు ఏ ఒక్క వ్యక్తినో, పార్టీనో ఉద్దేశించి చేసినవి కావంటూ స్పష్టం చేశారు. రెండు వారాలుగా పార్లమెంటు స్తంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్రపతి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరిచుకున్నాయి.
‘అంతరాయం అనేది పార్లమెంటరీ వ్యవస్థలో ఆమోదయోగ్యం కాదు. సమస్యలపై చర్చించేందుకే ప్రజలు వారిని పార్లమెంట్‌కు పంపారు. అంతేకానీ ధర్నాలు చేయడం, సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగించేందుకు కాదు’ అని డిఫెన్‌స ఎస్టేట్స్ డే సందర్భంగా గురువారం ‘బలమైన ప్రజాస్వామ్యం కోసం ఎన్నికల సంస్కరణలు’ అంశంపై రాష్ట్రపతి మాట్లాడారు. ‘సభా కార్యక్రమాల్ని అడ్డుకోవడం అంటే మెజార్టీ సభ్యులకు అడ్డుపడడమే.. మెజార్టీ సభ్యులు ఈ ఆందోళనలో పాల్గొనడం లేదు. కేవలం కొద్దిమంది ఎంపీలు వెల్‌లోకి వచ్చి, నినాదాలు చేస్తూ సభా కార్యకలాపాల్ని అడ్డుకుంటున్నారు. సభాధ్యక్ష స్థానంలో ఉన్నవారికి సభను వారుుదా వేయడం మినహా వేరే ప్రత్యామ్నాయం లేని పరిస్థితి కల్పిస్తున్నారు. ఇది పూర్తిగా ఆమోదయోగ్యం కాదు’ అంటూ ప్రణబ్ స్పందించారు. ఏడాదిలో పార్లమెంట్ కేవలం కొన్ని వారాలే నడుస్తుందన్న విషయం సభ్యులు గుర్తుంచుకోవాలన్నారు.
చర్చ, విభేదించడం, నిర్ణయం...
ప్రజాస్వామ్యంలో ‘చర్చ’, ‘విభేదించడం’, ‘నిర్ణయం’ అనేవి మూడు ముఖ్యమైన అంశాలని... అందులో నాలుగో అంశమైన ‘అంతరాయం’ ఉండకూడదన్నారు. ‘పార్లమెంట్ ఆమోదం లేకుండా బడ్జెట్ నుంచి సొమ్ము ఖర్చుపెట్టడానికి వీల్లేదు. ఏటా రూ. 16-18 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెడుతుంటే... దానిపై పార్లమెంట్‌లో పూర్తి పరిశీలన లేకుండా, చర్చించకుండా ఉంటే పార్లమెంటరీ వ్యవస్థ సమర్థంగా పనిచేస్తున్నట్లు కాదు. ప్రజాస్వామ్యం విజయవంతంగా ముందుకు సాగదు’ అని రాష్ట్రపతి అన్నారు.
మహిళా బిల్లును ఆమోదించండి
మహిళా రిజర్వేషన్ బిల్లుపై మాట్లాడుతూ... 2014 ఎన్నికల్లో టికెట్లు ఇచ్చే సమయంలో ఏ పార్టీ ఉదారంగా వ్యవహరించలేదన్నారు. లోక్‌సభలో ప్రస్తుత ప్రభుత్వానికి మెజార్టీ ఉన్నందున మహిళాబిల్లు ఆమోదం పొందేలా చూడాలన్నారు. ఎన్నికల సంస్కరణలపై ఈసీ రూపొందించిన నివేదికపై బహిరంగ చర్చ అవసరమన్నారు. ప్రస్తుత రాజ్యాంగం ప్రకా రం లోక్‌సభ, రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు వివాదాస్పదమే కాకుండా కష్టతరమని అరుు తే ఒకేసారి నిర్వహించడం ఎలా సాధ్యమో మార్గాలు అన్వేషించాలని సూచించారు.
ఏ పార్టీనీ ఉద్దేశించి అనడం లేదు
'ధర్నా కోసం మీరు ఇతర ప్రాంతాల్ని ఎంచుకోవచ్చు. దయచేసి మీ కర్తవ్యాన్ని నిర్వర్తించండి. తమకున్న హక్కులు, అధికారాల్ని నిర్వర్తించేందుకు సభ్యులు సమయాన్ని వెచ్చించాలి’ అని రాష్ట్రపతి ఉద్బోధించారు. తాను ఏ ఒక్క పార్టీ, వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని మాట్లాడట్లేదని, ప్రతి ఒక్కరూ బాధ్యత నిర్వర్తించాలన్నారు. ‘పార్లమెంట్‌లో గందరగోళం ఒక అలవాటుగా మారింది. అది ఆమోదయోగ్యం కాదు. ఏ భేదాభిప్రాయాలున్నా మాట్లాడేందుకు అవకాశముంది. సభలో ఏం మాట్లాడినా కోర్టు కూడా జోక్యం చేసుకోలేదు. ఒక సభ్యుడు ఎవరిపై ఆరోపణలు చేసినా కోర్టు అతణ్ని విచారించలేదు’ అంటూ సభ్యుల హక్కుల్ని గుర్తుచేశారు.