
రూ. 810 కోట్లను ఖర్చుచేస్తే వచ్చింది 2 పతకాలు
లండన్: రియో ఒలింపిక్స్‌లో రాణించి 67 పతకాలను గెలుచుకొని ప్రపంచంలో రెండో స్థానంలో నిలిచిన బ్రిటన్‌లో ఇప్పుడు పతకాల సాధన కోసం క్రీడాకారులపై ఖర్చు పెట్టిన సొమ్మెంత? అది పన్ను చెల్లింపుదారులపై ఎంత భారం పడిందన్న అంశంపై చర్చలు మొదలయ్యాయి. ప్రస్తుతానికి ఆ చర్చలను పక్కన పెడితే 67 పతకాలను సాధించడం కోసం బ్రిటన్ ఎంత ఖర్చు పెట్టింది, కేవలం రెండు పతకాలతోనే సంతృప్తి పడాల్సి వచ్చిన భారత్ ఎంత ఖర్చు పెట్టిందో బేరీజు వేసి చూద్దాం.
ఒక్కో మెడల్ కోసం సగటున 41 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టామని, అంటే మొత్తం 2,747 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టామని బ్రిటన్ స్పోర్ట్ అథారిటీ చెబుతుండగా, సగటున 46 కోట్లును, అంటే 3, 082 కోట్ల రూపాయలను బ్రిటన్ ఖర్చు పెట్టిందని భారత్ మాజీ మెడలిస్ట్ అభినవ్ బింద్రా ట్వీట్ చేశారు. బ్రిటన్ బడ్జెట్ కేటాయింపులను పరిశీలించగా ఈ నాలుగేళ్లలో ఒలింపిక్స్ ప్రిమరేషన్స్ కోసం క్రీడాకారుల శిక్షణ, శిక్షణా వసతుల కోసం మొత్తం 2,380 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది.
అలాంటప్పుడు భారత దేశం ఒలింపిక్స్ శిక్షణ కోసం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టిందన్న ప్రశ్న తలెత్తక మానదు. నాలుగేళ్ల కాలంలో శిక్షణా సెంటర్లు, కోచ్‌లు, ఇతర మౌలిక సౌకర్యాలపై భారత్ 750 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టగా, నేషనల్ స్పోర్ట్ డెవలప్‌మెంట్ ఫండ్ ద్వారా 22.7 కోట్ల రూపాయలు, టార్గెట్ ఒలింపిక్ పోడియం ప్రోగ్రామ్ కార్యక్రమం కింద 38 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. అంటే మొత్తం దాదాపు 810 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. బ్రిటన్ 2,380 కోట్ల రూపాయలను ఖర్చుచేసి 67 మెడళ్లను సాధించగా, అందులో మూడో వంతకుపైగా డబ్బును ఖర్చుపెట్టి రెండు పతకాలను భారత్ సాధించింది. బ్రిటన్ పెట్టిన ఖర్చునే మనం ప్రమాణంగా తీసుకున్నట్లయితే భారత్‌కు 23 పతకాలు రావల్సి ఉండింది.
67 పతకాలు సాధించి ప్రపంచంలోనే రెండో స్థానాన్ని ఆక్రమించినప్పటికీ బ్రిటన్ పౌరులు సంతృప్తి చెందడం లేదు. ఆ భారం పన్ను చెల్లింపుదారులపై ఎంత పడిందో తేల్చాలని వారు ప్రశ్నిస్తున్నారు. ఒక్కో పన్ను చెల్లింపుదారులపై ఏడాదికి 1,090 రూపాయలు పడిందని బ్రిటన్‌కు చెందిన స్పోర్ట్ ఇండస్ట్రీ రిసెర్చ్ సెంటర్ తేల్చింది. వచ్చిన మెడళ్లతో పోలిస్తే చేసిన ఖర్చుకు గిట్టుబాటు దక్కినట్లేనని యూకే స్పోర్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ నిజ్ నికోల్ వ్యాఖ్యానించారు. ఏడాదికి టాక్స్ పేయర్‌పై పడుతున్న పన్ను భారాన్ని ఒక్క రోజుకు లెక్కిస్తే లండన్‌లో ఓ ప్రయాణికుడు ఓ బస్సు టిక్కెట్‌కు చెల్లించే మొత్తం కాదని మాజీ వింటర్ ఒలింపిక్స్ అథ్లెట్ జేమీ ఫాక్స్ వ్యాఖ్యానించారు.