
రిషి
పణాజీ: గోవా ముఖ్యమంత్రిగా లక్ష్మీకాంత్ పర్సేకర్ ప్రమాణం చేసి ఒక్క రోజు కూడా పూర్తికాకముందే ఆయన కుమారుడు ఫేస్‌బుక్‌లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. కాంగ్రెస్ నేతను హెచ్చరించాడు. తనపై ఆరోపణలు చేసినందుకు కాంగ్రెస్ పార్టీ నేతకు ఫేస్‌బుక్‌లో 'లాస్ట్ వార్నింగ్' ఇచ్చాడు. గోవా సీఎం లక్ష్మీకాంత్ పర్సేకర్ కుమారుడు రిషి(21)పై కాంగ్రెస్ నేత దుర్గాదాస్ కామత్ ఫేస్‌బుక్‌లో ఆరోపణలు చేశారు. రిషి తన తండ్రి నియోజకవర్గమైన మండ్రేమ్‌లో అక్రమంగా నిర్వహించిన బుల్ ఫైట్స్‌లో పాల్గొన్నాడని రెండు ఫొటోలను ఫేస్‌బుక్‌లో పెట్టారు. దీనికి 'సీఎం కుమారుని సమక్షంలో బుల్‌ఫైట్' అని శీర్షిక పెట్టారు.
అయితే ఈ ఫొటోల్లో రిషి ఎక్కడా లేడు. దీనిపై మంగళవారం రాత్రి రిషి ఫేస్‌బుక్‌లో వివరణ ఇచ్చాడు. తాను అసలు అక్కడ లేనని, కావాలంటే అన్ని ఫొటోలను ఫేస్‌బుక్‌లో పెట్టాలని దుర్గాదాస్‌ను డిమాండ్ చేశారు. ఇటువంటి ఆరోపణలను సహించబోనని, సరైన సమాచారం తెలుసుకున్న తరువాతే ఫేస్‌బుక్‌లో పెట్టాలని సూచించాడు. 'ఇది అతనికి లాస్ట్ వార్నింగ్. ఇలాగే మళ్లీ చేస్తే, నేను సమయం వృధా చేసుకోను. అసలు నేనేంటో చూపిస్తా' అని హెచ్చరించాడు. చివరన సీఎం కుమారుడు అని కూడా పేర్కొన్నాడు.
**