జమ్ముః వైష్ణోదేవి యాత్రికులకు శుభవార్త! భక్తులకు యాత్ర మరింత సౌకర్యవంతంగా ఉండేందుకు వీలుగా కత్రానుంచి అర్థకువారి వరకు నవరాత్రి నాటికి మరో కొత్త ప్రయాణ మార్గాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వైష్ణోదేవి ష్రైన్ బోర్డు వెల్లడించింది.
నవరాత్రి నాటికి వైష్ణోదేవి యాత్రకు సుమారు 7 కిలోమీటర్ల పొడవున మరో కొత్త మార్గాన్ని ప్రారంభించనున్నట్లు ఆలయ బోర్డు తెలిపింది. త్వరలో పనులు, షెడ్స్ నిర్మాణం పూర్తిచేసి మార్గాన్ని తెరిచేందుకు ముందు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అయితే కొత్త మార్గానికి వ్యతిరేకంగా పల్లకీలు, గుర్రాల యజమానులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ కొత్త మార్గం కేవలం నడచి వెళ్ళే భక్తులకోసం మాత్రమేనని, ఏ ఇతర ప్రయాణ సౌకర్యాలకు ఈ మార్గంలో అనుమతి లేదని దేవాలయ బోర్డు సీఈవో స్సష్టం చేశారు. ఈ నూతన మార్గం 500 మీటర్లే ఉన్నప్పటికీ విస్తృతంగా ఉంటుందని, అత్యవసర సమయాల్లో అంబులెన్స్ సులభంగా అక్కడకు చేరుకునే అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు.
అర్థకువారీ హతీమాతా ప్రాంతంలో ఈ రూటులో నిటారుగా అధిరోహించాల్సి ఉంటుందని, ఈ ప్రదేశంలో జారకుండా ఉండేట్లుగా టైల్స్ ఏర్పాటు చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వచ్చే యేడాది నాటికి వైష్ణోదేవి భక్తులకోసం రోప్ వే సేవలను కూడా అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు ష్రైన్ బోర్డ్ వెల్లడించింది. అత్యవసర సమయాల్లో భక్తులకు హెచ్చరికలు జారీచేసేందుకు ఆడియో సిస్టమ్ తో పాటు, మొత్తం మార్గమంతా చిన్న చిన్న రాళ్ళతో కూడిన పై కప్పును నిర్మిస్తున్నట్లు బోర్డు వెల్లడించింది. మరోవైపు వైష్ణోదేవి ఆలయానికి చేరుకునేందుకు అటు భక్తులు, ఇటు బోయీలకు సౌకర్యవంతంగా ఉండేందుకు వీలుగా ఐఐటీ ముంబై కొత్త చెక్క పల్లకీలను కూడా డిజైన్ చేసింది.
వైష్ణోదేవి భక్తులకు శుభవార్త..!
Published Tue, Aug 23 2016 2:05 PM | Last Updated on Mon, Sep 4 2017 10:33 AM
Advertisement