
జమ్మూ కశ్మీర్‌లోని రియాసి జిల్లాలో ప్రమాదం చోటు చేసుకుంది. మాతా వైష్ణోదేవి ఆలయానికి వెళ్లే యాత్ర మార్గంలో సోమవారం కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఓ యాత్రికుడు మరణించగా.. మరో ఇద్దరు గాయపడ్డారు.
పంచి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. భారీ బండరాళ్లు ఒక్కసారిగా కిందపడటంతో ఓవర్ హెడ్ ఐరన్ స్ట్రక్చర్ దెబ్బతింది. సమాచారం అందుకున్న వైష్ణోదేవి ఆలయ బోర్డుకు చెందిన డిజాస్టర్ మేనేజ్‌మెంట్ బృందం వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టింది.
ప్రమాదంలో గాయపడిన యాత్రికులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటన నేపథ్యంలో వైష్ణో దేవి మార్గంలో రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. యాత్ర సమయంలో యాత్రికులు జాగ్రత్తగా ఉండాలని, పరిస్థితులను అంచనా వేస్తూ ముందుకు సాగాలని సూచించారు.