కశ్మీర్‌లో గవర్నర్ పాలన
►గవర్నర్ వోహ్రా సిఫారసును ఆమోదించిన రాష్ర్టపతి
► రాష్ర్టంలో రాజ్యాంగ వ్యవస్థ విఫలమైందని పేర్కొన్న గవర్నర్
► తాజా పరిణామంపై దుమ్మెత్తిపోసుకున్న రాజకీయ పార్టీలు
► బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామన్న అమిత్ షా
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో గవర్నర్ పాలన తప్పలేదు. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మద్దతును ఏ పార్టీ కూడగట్టకపోవడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఆపద్ధర్మ సీఎంగా కొనసాగడానికి ఒమర్ అబ్దుల్లా నిరాకరించడంతో గవర్నర్ పాలనతో పాటు మరికొన్ని ప్రత్యామ్నాయాలను రాష్ర్ట గవర్నర్ ఎన్‌ఎన్ వోహ్రా రాష్ర్టపతికి సిఫారసు చేశారు. గురువారం రాత్రే నివేదిక పంపించారు. దీంతో గవర్నర్ పాలనకే ప్రణబ్ మొగ్గుచూపారు.ఈ సిఫారసును శుక్రవారం ఆమోదించారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి తగినన్ని సీట్లు రాకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ ఏర్పాటుకు వివిధ పార్టీల మధ్య జరుగుతున్న చర్చలు కొలిక్కిరాలేదు. మరోవైపు సరిహద్దుల్లో పాక్ ఘర్షణాత్మక వైఖరి నేపథ్యంలో రాష్ర్టంలో పూర్తిస్థాయి పాలన అవసరమంటూ కేంద్రానికి ఒమర్ సూచించారు.
రాష్ర్టంలో రాజ్యాంగ వ్యవస్థ విఫలమైనప్పుడు కశ్మీర్ రాజ్యాంగంలోని సెక్షన్ 92 ప్రకారం గవర్నర్ పాలనకు రాష్ర్ట గవర్నర్ సిఫారసు చేయొచ్చు. ఈ నేపథ్యంలో గవర్నర్ నివేదికను కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ముందుగా ప్రధాని కార్యాలయానికి పంపించారు. అక్కడి నుంచి అది రాష్ర్టపతి వద్దకు చేరింది. ఆయన ఆమోదం తర్వాత శుక్రవారం సాయంత్రం కేంద్రం ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వ ఏర్పాటుకు ఏ పార్టీ, కూటమి ముందుకురాకపోవడంతో గవర్నర్ సిఫారసు మేరకు గవర్నర్ పాలన విధిస్తున్నట్లు పేర్కొంది. గత డిసెంబర్ 23న వెల్లడైన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మొత్తం 87 స్థానాలకుగాను పీడీపీకి 28, బీజేపీకి 25, ఎన్సీకి 15, కాంగ్రెస్‌కు 12 సీట్లు వచ్చాయి. మెజారిటీ మార్కు సాధించాలంటే 44 సీట్లు ఉండాలి. ప్రస్తుత అసెంబ్లీ గడువు ఈ నెల 19న ముగుస్తోంది. ఆలోగా కొత్త ప్రభుత్వం ఏర్పడాలి. ఈలోగానే గవర్నర్ పాలన విధించాల్సి వచ్చింది. 12 ఏళ్ల క్రితం ఫరూఖ్ అబ్దుల్లా ఆపద్ధర్మ సీఎంగా ఉన్నప్పుడూ ఇలాంటి పరిస్థితే ఏర్పడింది.
విమర్శలు గుప్పించుకున్న పార్టీలు
కశ్మీర్‌లో గవర్నర్ పాలనకు కారణం మీరంటే మీరని పార్టీలు దుమ్మెత్తి పోసుకున్నాయి. ఓటర్ల తీర్పు మేరకు ప్రభుత్వం ఏర్పడకపోవడం అసంతృప్తికరమని కాంగ్రెస్, సీపీఎంలు వ్యాఖ్యానించాయి. అతిపెద్ద పార్టీగా నిలిచిన పీడీపీ.. ప్రభుత్వ ఏర్పాటులో పూర్తిగా విఫలమైందని విమర్శించాయి. గవర్నర్ పాలన కు పీడీపీనే కారణమని మాజీ సీఎం ఒమర్ ఆరోపించారు. మరోవైపు నేషనల్ కాన్ఫరెన్స్ తీరును పీడీపీ తప్పుబట్టింది.
ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా అయిన ఒమర్ చిన్నపిల్లాడిలా ప్రవర్తిస్తున్నారని, ఆయన వల్లే ఈ పాలన వచ్చిందని మండిపడింది. తగిన సమయం వచ్చినప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆ పార్టీ నేతలన్నారు. బీజేపీ సహా ఎవరితోనైనా కలిసి అధికారం చేపట్టే అవకాశముంద న్నారు. అయితే అతి పెద్ద పార్టీగా ఉన్న పీడీపీకి మద్దతిస్తామని తాము ముందే ప్రకటించామని ఎన్సీ నేతలు ప్రతిస్పందించారు. మరోవైపు ప్రభుత్వ ఏర్పాటు కోసం పీడీపీ, ఎన్సీలతో చర్చలు జరుపుతున్నట్లు బీజేపీ పేర్కొంది. కశ్మీర్‌లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా విజయవాడలో చెప్పారు.