NN Vohra
-
కశ్మీర్లో ప్రభుత్వం ఏర్పాటు దిశగా బీజేపీ..
శ్రీనగర్ : జమ్ము కశ్మీర్లో ప్రభుత్వం ఏర్పాటు దిశగా బీజేపీ పావులు కదుపుతోంది. మాజీ సీఎం, పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ) అధినేత్రి మెహబూబా ముఫ్తీ తీరును జీర్ణించుకోలేని కొందరు ఎమ్మెల్యేలు పార్టీని వీడేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలు, స్వతంత్ర ఎమ్మెల్యేల సాయంతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అమర్నాథ్ యాత్ర ముగిసిన వెంటనే ప్రభుత్వం ఏర్పాటు చేసి, గవర్నర్ ఎన్ఎన్ వోహ్రా స్థానంలో మరొకరిని నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా కశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాలు పెరగటం, శాంతి భద్రతలు కాపాడటంలోముఫ్తీ సర్కార్ విఫలం కావడం వంటి అంశాలను సాకుగా చూపి సంకీర్ణ ప్రభుత్వం నుంచి బీజేపీ వైదొలగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మెహబూబా ముఫ్తీ సీఎం పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. మొత్తం 89 మంది సభ్యులున్న జమ్ము కశ్మీర్ అసెంబ్లీలో బీజేపీకి 25 మంది ఎమ్మెల్యేలు, పీడీపీకి 25 మంది ఎమ్మెల్యేలు ఉండగా, మ్యాజిక్ ఫిగర్‌కు కావాల్సిన సభ్యుల సంఖ్య 45. అనూహ్య రాజకీయ పరిణామాల మధ్య కశ్మీర్లో గవర్నర్ పాలన కొనసాగుతున్న నేపథ్యంలో.. గవర్నర్ ఎన్ఎన్ వోహ్రా అసెంబ్లీని పూర్తిగా రద్దు చేయకుండా సుప్తచేతనావస్థలో ఉంచారు. ఈ నేపథ్యంలో ఏ పార్టీ అయినా తగిన సంఖ్యా బలంతో ముందుకు వస్తే ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలున్నాయి. -
అమర్నాథ్ యాత్రకు ముమ్మరంగా ఏర్పాట్లు
-
ఎన్నికలకు తొందరేంటి?
శ్రీనగర్ : తాజా రాజకీయ పరిస్థితులపై జమ్ము కశ్మీర్ గవర్నర్ నిర్వహించిన అఖిలపక్ష భేటీ అసంపూర్తిగా, అస్పష్టంగా ముగిసింది. శుక్రవారం సాయంత్రం రాజ్‌భవన్‌లో గవర్నర్ ఎన్ఎన్ వోహ్రా ఆధ్వర్యంలో అన్ని పక్షాల ప్రతినిధులు హాజరయ్యారు. అయితే తక్షణమే అసెంబ్లీని రద్దు చేయాలని కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు డిమాండ్ చేయగా, పీడీపీ మాత్రం ఎన్నికలకు తొందరేంటని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఒకానోక దశలో భేటీలో గందరగోళం చెలరేగగా, నేతలు అసంతృప్తితోనే బయటకు వచ్చినట్లు స్థానిక ఛానెళ్లు కథనాలను ప్రచురించాయి. కశ్మీర్ లోయలో పరిస్థితులను ఎలా సాధారణ స్థితికి తీసుకురావటం, రాజకీయ పరస్పర సహకారం ప్రధాన ఎజెండాలుగా భేటీలో గవర్నర్ వోహ్రా ప్రతిపాదన చేశారు. అయితే బలగాల మోహరింపు ద్వారానే పరిస్థితి అదుపులోకి వచ్చే అవకాశం ఉంటుందని ప్రధాని పార్టీలన్నీ గవర్నర్‌తో స్పష్టం చేశాయి. మరోవైపు ప్రస్తుత పరిస్థితుల్లో అసెంబ్లీని రద్దు చేయటమే ఉత్తమమని కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు గవర్నర్‌తో తేల్చి చెప్పాయి. ‘ఇప్పటికే అన్ని పార్టీలు తమకు మెజార్టీ లేదన్న విషయం చెప్పేశాయి. పైగా ఎలాంటి పొత్తులు ఉండబోవని తేల్చాయి. ఇలాంటి సమయంలో ఇంకా అసెంబ్లీని కొనసాగించటం సబబు కాదు. ఇది గందరగోళాన్ని, రాజకీయ అస్థిరతను సృష్టించే అవకాశం ఉంటుంది. రాజ్యాంగాన్ని అనుసరించి గవర్నర్ అసెంబ్లీని తక్షణమే రద్దు చేయాలి. వెంటనే ఎన్నికలు నిర్వహించాలి’ అని కాంగ్రెస్ జమ్ము చీఫ్ గులాం అహ్మద్ మీర్ కోరారు. మరోవైపు ఎన్సీ అధినేత, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా కూడా ఇదే వాదనను వినిపించినట్లు సమాచారం. పీడీపీ, బీజేపీలు మాత్రం... అయితే పీడీపీ మాత్రం కాంగ్రెస్, ఎన్సీల డిమాండ్‌ను తోసిపుచ్చింది. పీడీపీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ అఖిలపక్ష భేటీకి హాజరుకాకపోవటంతో ఆమె తరపున ఆ పార్టీ కార్యదర్శి దిలావర్ మీర్ మీటింగ్‌కు హాజరయ్యారు. ‘ఇది సున్నితమైన అంశం. గవర్నర్ నిర్ణయం తీసుకునేందుకు చాలా సమయం ఉందనే అనుకుంటున్నాం. ఇలాంటి దశలో అసెంబ్లీని రద్దు చేయటం కన్నా కొనసాగించటమే మంచిది. ఆర్టికల్ 35-ఏ, ఆర్టికల్ 370 (ప్రత్యేక హోదా అంశం)లపై సుప్రీం కోర్టులో కేసు నడుస్తోంది. మరోవైపు కథువా కేసు కూడా విచారణ దశలో ఉంది. ఇలాంటి స్థితిలో రాజకీయ గందరగోళం ఆయా అంశాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. పరిస్థితులు మెరుగుపడ్డప్పుడే ఎన్నికలు కూడా నిర్వహించటం మంచిదని ముఫ్తీ భావిస్తున్నారు’ అని సమావేశం అనంతరం మీర్ మీడియాకు వివరించారు. ఇక బీజేపీ మాత్రం ఈ వ్యవహారంపై మౌనంగా ఉంది. ‘అమర్నాథ్ యాత్రకు సమయం దగ్గర పడుతోంది. ఇలాంటి తరుణంలో నేతలంతా క్షేత్ర స్థాయిలో పర్యటించి ప్రజలను అప్రమత్తం చేయాలి. ప్రశాంత వాతావరణంలో యాత్ర కొనసాగేలా చూడాలి. పంచాయితీ, స్థానిక సంస్థల ఎన్నికల అంశం ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉంది. ముందు ఆ ఎన్నికలు జరిగేలా చొరవ చూపాలి’ అని బీజేపీ నేత, మాజీ మంత్రి సత్ శర్మ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. మొత్తానికి సమావేశం అనంతరం బయటకు వచ్చిన నేతలు అసంతృప్తిగానే మీడియాతో మాట్లాడి వెళ్లిపోవటం గమనార్హం. -
పీడీపీలో చీలిక ఏర్పడే అవకాశం!!
శ్రీనగర్ : అనూహ్య రాజకీయ పరిణామాల మధ్య కశ్మీర్లో గవర్నర్ పాలన విధించిన విషయం తెలిసిందే. జమ్మూ కశ్మీర్ రాజ్యాంగంలోని సెక్షన్ 92 కింద గవర్నర్ పాలనను అమలు చేస్తున్నట్లు ప్రకటించిన ఎన్ఎన్ వోహ్రా.. అసెంబ్లీని సుప్తచేతనావస్థలో ఉంచుతున్నట్లు ప్రకటించారు. అయితే ప్రస్తుతం జమ్ము కశ్మీర్లో నెలకొన్న పరిస్థితులపై మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా ఓ జాతీయ మీడియాకు గురువారం ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. పీడీపీ(పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ)లో చీలిక ఏర్పడే అవకాశం ఉందన్న అబ్దుల్లా.. మళ్లీ అధికారం చేజిక్కించుకునేందుకు పీడీపీలోని ఓ వర్గం బీజేపీలో చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదని వ్యాఖ్యానించారు. అధికారమే పరమావధిగా భావించే బీజేపీ ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ఏమాత్రం వెనకాడబోదన్నారు. ‘మా పార్టీ ప్రయత్నాలు మొదలుపెట్టిందంటూ’ బీజేపీ నేత, కశ్మీర్ మాజీ ఉప ముఖ్యమంత్రి కవిందర్ గుప్తా చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమని అబ్దుల్లా వ్యాఖ్యానించారు. అసెంబ్లీని రద్దు చేయాలి.. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న క్లిష్ట పరిస్థితుల దృష్ట్యా గవర్నర్ వోహ్రా పదవీ కాలాన్ని పొడగించడం సరైన నిర్ణయమని అబ్దుల్లా పేర్కొన్నారు. అయితే జమ్ము కశ్మీర్ అసెంబ్లీని వెంటనే రద్దు చేయాలని.. లేనిపక్షంలో బీజేపీ ఇతర పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే అవకాశం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఏ పార్టీ ముందుకు రాని నేపథ్యంలో అసెంబ్లీని సుప్తచేతనావస్థలో ఉంచడం వల్ల ప్రజా ధనం దుర్వినియోగమవుతుందని వ్యాఖ్యానించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల దృష్ట్యానే బీజేపీ ఈ నిర్ణయం తీసుకుందని... అయితే బీజేపీ ఎత్తుగడలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నారు. కశ్మీర్లో ప్రస్తుతం నెలకొన్న అశాంతికి బీజేపీ, పీడీపీల అధికార దాహమే కారణమని ఆయన ఆరోపించారు. -
కశ్మీర్లో గవర్నర్ పాలన
న్యూఢిల్లీ/శ్రీనగర్: జమ్మూ కశ్మీర్లో ఎనిమిదోసారి గవర్నర్ పాలన మొదలైంది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ బుధవారం ఉదయమే జమ్మూ కశ్మీర్లో గవర్నర్ పాలనకు ఆమోదం తెలిపారు. ఆ వెంటనే గవర్నర్ ఎన్ఎన్ వోహ్రా విధుల్లోకి దిగారు. ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మరోవైపు గతంలో మాదిరిగానే కశ్మీర్లో ఉగ్రవాద వ్యతిరేక చర్యలు కొనసాగుతాయని ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ చెప్పారు. అలాగే కశ్మీర్లో ఉగ్రవాదం అంతమై శాంతి నెలకొనాలన్నదే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. మరోవైపు ఇటీవలే ఉగ్రవాదుల చేతిలో హత్యకు గురైన జవాను ఔరంగజేబు కుటుంబాన్ని రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పరామర్శించారు. ఔరంగజేబు లాంటి వాళ్లు మొత్తం దేశానికే ఆదర్శంగా నిలుస్తారని ఆమె శ్లాఘించారు. మూడేళ్లకుపైగా కొనసాగిన పీడీపీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం నుంచి మంగళవారం అనూహ్యంగా బీజేపీ బయటకు రావడంతో ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ తన పదవికి రాజీనామా చేయడం తెలిసిందే. దీంతో గవర్నర్ పాలనకు సిఫారసు చేస్తూ జమ్మూ కశ్మీర్ గవర్నర్ ఎన్ఎన్ వోహ్రా మంగళవారమే రాష్ట్రపతి భవన్‌కు నివేదిక పంపారు. అయితే ఆ సమయంలో కోవింద్ విమాన ప్రయాణంలో ఉండటంతో తెల్లవారు జామున 3 గంటలకు (భారత కాలమానం ప్రకారం) ఆయన సూరినామ్‌లో విమానం దిగగానే అధికారులు గవర్నర్ నివేదికను పరిశీలనకు పంపారు. జమ్మూ కశ్మీర్లో గవర్నర్ పాలనకు ఆమోదం తెలుపుతున్నట్లు ఉదయం 6 గంటలకల్లా రాష్ట్రపతి నుంచి హోం మంత్రిత్వ శాఖకు సమాచారం వచ్చింది. ఆ వెంటనే ఆదేశాలను శ్రీనగర్‌కు పంపగా, రాష్ట్రంలో గవర్నర్ పాలన విధిస్తున్నట్లు ప్రకటన వచ్చింది. అసెంబ్లీ సుప్తచేతనావస్థలో ఉంటుందని గవర్నర్ ప్రకటించారు. ‘రాష్ట్రపతి ఆమోదం వచ్చిన వెనువెంటనే.. జమ్మూ కశ్మీర్ రాజ్యాంగంలోని సెక్షన్ 92 కింద గవర్నర్ పాలనను అమలు చేస్తున్నట్లు ఎన్ఎన్ వోహ్రా ప్రకటించారు’ అని రాజ్‌భవన్ ప్రతినిధి తెలిపారు. ప్రధాన కార్యదర్శితో గవర్నర్ చర్చలు అనంతరం జమ్మూ కశ్మీర్ ప్రధాన కార్యదర్శి (సీఎస్) బీబీ వ్యాస్‌తో గవర్నర్ వోహ్రా చర్చలు జరిపారు. ఆ తర్వాత పౌర, పోలీసు, అటవీ తదితర విభాగాల అధికారులతోనూ వోహ్రా భేటీ అయ్యారు. ‘రాష్ట్ర పరిపాలనా యంత్రాంగం వేగంతో, సమర్థంగా, జవాబుదారీతనంతో పనిచేసేలా చూసేందుకు గవర్నర్ అధికారులతో మాట్లాడారు’ అని రాజ్‌భవన్ ప్రతినిధి చెప్పారు. జమ్మూ కశ్మీర్లో రాష్ట్రపతి పాలన విధించడం గత నాలుగు దశాబ్దాల్లో మొత్తంగా ఇది ఎనిమిదోసారి కాగా, వోహ్రా హయాంలోనే నాలుగోసారి. బేరసారాలకు అవకాశం: ఒమర్ సుప్తచేతనావస్థలో ఉన్న జమ్మూ కశ్మీర్ అసెంబ్లీని వెంటనే రద్దు చేసి మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ నేత ఒమర్ అబ్దుల్లా కోరారు. లేకపోతే ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను కొని బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశముందనీ, సంకీర్ణ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన కవీందర్ గుప్తా స్వయంగా ఈ విధమైన సంకేతాలిచ్చారని ఒమర్ ఆరోపించారు. గవర్నర్ పాలనపై మిశ్రమ స్పందన కాగా పీడీపీ–బీజేపీ ప్రభుత్వం కూలిపోయినందుకు కశ్మీర్‌లోని శ్రీనగర్, కుప్వారా, పహల్గామ్ తదితర ప్రాంతాల్లో ప్రజలు టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు. పీడీపీ–బీజేపీల కూటమి అపవిత్రమైనదనీ, బీజేపీతో పీడీపీ కలవకుండా ఉండాల్సిందని పలువురు పేర్కొన్నారు. అయితే గవర్నర్ పాలనలో పారదర్శకత కొరవడుతుందనీ, రాష్ట్ర పరిస్థితి మరింత దిగజారుతుందని మరికొందరు ఆందోళన వ్యక్తంచేశారు. గవర్నర్ పాలన కన్నా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమే ఎప్పటికైనా మెరుగైన పాలన అందిస్తుందన్నారు. అమర్నాథ్ యాత్రకు భద్రతా ఏర్పాట్లు అమర్నాథ్ యాత్ర ఈ నెల 28 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై చర్చించేందుకు జమ్మూ ఐజీ ఎస్డీ సింగ్ జమ్వాల్ నేతృత్వంలో పోలీసులు, పారామిలిటరీ దళాలు, కేంద్ర, రాష్ట్ర నిఘా సంస్థల అధికారులతో ఉన్నత స్థాయి భేటీ జరిగింది. అధికారులంతా అత్యంత అప్రమత్తంగా ఉండి, అన్ని విభాగాలూ సమన్వయంతో పనిచేయాలనీ, సంఘవిద్రోహ శక్తుల కుట్రలను నీరుగార్చాలని ఈ సమావేశంలో ఐజీ ఆదేశించారు. సరిహద్దుల్లోని పోలీస్ స్టేషన్లు, సైనిక శిబిరాలు, చెక్పాయింట్లలోని సిబ్బంది జాగ్రత్తగా పనిచేస్తూ నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దుల్లో ఉగ్రవాదులు చొరబాటుకు యత్నిస్తే వెంటనే వారిని అంతమొందించాలని సిబ్బందికి ఆదేశాలు వెళ్లాయి. షాక్‌లో మెహబూబా సంకీర్ణ ప్రభుత్వం నుంచి వైదొలగాలని బీజేపీ తీసుకున్న అనూహ్య నిర్ణయం.. ఆ నిర్ణయాన్ని తనకు తెలియజేసిన తీరుతో మంగళవారం మాజీ సీఎం (బీజేపీ నిర్ణయంతో మంగళవారం సీఎం పదవికి రాజీనామా చేశారు) మెహబూబా ముఫ్తీ షాక్‌కు గురయ్యారని పీపుల్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ) వర్గాలు తెలిపాయి. పలు అంశాల్లో బీజేపీ– పీడీపీల మధ్య విభేదాలున్నా, ఇంత అకస్మాత్తుగా ప్రభుత్వం నుంచి వైదొలగాలన్న నిర్ణయం బీజేపీ తీసుకుంటుందని ఆమె ఊహించలేదన్నాయి. ‘ఆమె బీజేపీ మోసం చేసిందన్న భావనలో ఉన్నారు. ప్రస్తుతం ఆమె ఎవరితోనూ మాట్లాడటం లేదు’ అని పీడీపీ నేత ఒకరు తెలిపారు. పార్టీని బలోపేతం చేయడంలోనూ, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలుచుకోవడంలోనూ కీలకపాత్ర పోషించిన ఆమె అప్పుడు బీజేపీ వ్యతిరేక వైఖరిని బాహాటంగానే చూపేవారు. పీడీపీకి గట్టి పట్టున్న దక్షిణ కశ్మీర్ ప్రాంతం.. బీజేపీతో పొత్తు వల్ల ఇప్పుడు పట్టుకోల్పోయిందన్నారు. కశ్మీర్ కొత్త సీఎస్‌గా సుబ్రమణ్యం జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి కొత్త ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి బీవీఆర్ సుబ్రమణ్యం నియమితులయ్యారు. అలాగే ప్రస్తుత సీఎస్ బీబీ వ్యాస్‌తోపాటు ఐపీఎస్ అధికారి విజయ్‌కుమార్‌ను గవర్నర్ వోహ్రాకు సలహాదారులుగా కేంద్రం నియమించింది. 1987 బ్యాచ్ ఛత్తీస్‌గఢ్ కేడర్‌కు చెందిన సుబ్రమణ్యంను ఛత్తీస్‌గఢ్‌లో అదనపు ప్రధాన కార్యదర్శి (హోం శాఖ)గా పనిచేస్తుండగా.. ఆయనను జమ్మూ కశ్మీర్‌కు పంపేందుకు ప్రధాని మోదీ నేతృత్వంలోని నియామకాల మంత్రివర్గ కమిటీ మంగళవారం రాత్రే ఆమోదం తెలిపింది. అంతర్గత భద్రతా విషయాల్లో మంచి పట్టున్న వ్యక్తిగా సుబ్రమణ్యంకు పేరుంది. 2004–08లో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్‌కు వ్యక్తిగత కార్యదర్శిగా ఆయన పనిచేశారు. 2008 జూన్ నుంచి 2011 సెప్టెంబరు వరకు ప్రపంచ బ్యాంకులో పనిచేసిన అనంతరం మార్చి 2012లో ప్రధాని కార్యాలయంలో విధుల్లో చేరి 2015 మార్చి వరకు ఉన్నారు. ఆ తర్వాత ఛత్తీస్‌గఢ్‌కు బదిలీపై వెళ్లారు. మరోవైపు జమ్మూ కశ్మీర్ ప్రస్తుత సీఎస్ బీబీ వ్యాస్‌కు గతేడాది నవంబర్లోనే 60 ఏళ్లు నిండాయి. అప్పుడే ఆయన పదవీ విరమణ పొందాల్సి ఉండగా ముఫ్తీ విజ్ఞప్తి మేరకే ఇప్పటికే రెండుసార్లు వ్యాస్‌కు పొడిగింపునిచ్చారు. ఇప్పుడు ఆయన స్థానంలో సుబ్రమణ్యం నియమితులవ్వగా వ్యాస్ గవర్నర్‌కు సలహాదారునిగా ఉంటారు. నక్సల్ వ్యతిరేక నిపుణుడు విజయ్‌కుమార్ జమ్మూ కశ్మీర్లో గవర్నర్ పాలన మొదలైన వెంటనే కేంద్ర ప్రభుత్వం ఓ కీలక వ్యక్తిని గవర్నర్ వోహ్రాకు సలహాదారుగా నియమించింది. నక్సల్ వ్యతిరేక కార్యకలాపాల్లో పేరుగాంచిన, స్మగ్లర్ వీరప్పన్‌ను అంతం చేయడంలో ముఖ్య భూమిక పోషించిన అధికారి కె.విజయ్ కుమార్ వోహ్రాకు సలహాదారుగా నియమితులయ్యారు. 1975 బ్యాచ్ తమిళనాడు కేడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి విజయ్‌కుమార్ (65).. పేరుమోసిన ఎర్రచందనం స్మగ్లర్ వీరప్పన్‌ను 2004లో మట్టుబెట్టిన ప్రత్యేక కార్యదళానికి నేతృత్వం వహించారు. ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడలో 2010లో నక్సల్స్ 75 మంది సీఆర్పీఎఫ్ సిబ్బందిని హతమార్చిన అనంతరం ఆ దళానికి డీజీగా కూడా విజయ్‌కుమార్ పనిచేశారు. మోదీ కశ్మీర్ విధానం సరైనదే: రాజ్‌నాథ్ న్యూఢిల్లీ: ‘మోదీజీ కశ్మీర్ విధానం సరైనదే. దానిపై ఎలాంటి అనుమానం అక్కర్లేదు. కశ్మీర్ సమస్య ఇప్పటిది కాదు. అనేక ప్రభుత్వాలకు ప్రధాన సవాలుగా నిలిచిన దీన్ని పరిష్కరించేందుకు కొంత సమయం పడుతుంది’ అని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ చెప్పారు. అలాగే పీడీపీ వ్యవస్థాపకుడు ముఫ్తీ మహమ్మద్ సయీద్ గురించి మాట్లాడుతూ.. ‘ఆయన సీనియర్. పరిపక్వత ఉన్న రాజకీయవేత్త. కానీ మనం తండ్రీ, కుమార్తె(మెహబూబా)ల మధ్య పోలిక తీసుకురాకూడదు. మెహబూబా చేతనైనంత వరకూ చేశారు’ అని పేర్కొన్నారు. రంజాన్ సందర్భంగా సైనిక ఆపరేషన్లను నిలిపివేయడాన్ని పొరపాటుగా తాను భావించడం లేదన్నారు. సీమాంతర ఉగ్రవాదాన్ని పాక్ నిలివేస్తేనే చర్చలు సాధ్యమన్నారు. రంజాన్లోనూ ఉగ్ర కార్యకలాపాలు: రావత్ రంజాన్ సందర్భంగా సైనిక ఆపరేషన్లను నిలిపివేసినప్పటికీ ఉగ్రవాదులు తమ కార్యకలాపాలను కొనసాగించారని ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ తెలిపారు. గవర్నర్ పాలన ఉగ్రవాదుల ఏరివేతపై ఎలాంటి ప్రభావం చూపబోదన్నారు. -
కశ్మీర్ గవర్నర్ పదవీకాలం పొడిగింపు?
శ్రీనగర్ : కశ్మీర్ గవర్నర్ నరీందర్‌నాథ్ వొహ్రా (82) పదవీ కాలం మరో ఆరు నెలలు పొడిగించేందుకు కేంద్రం యోచిస్తోందనీ విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. పీడీపీ, బీజేపీల మధ్య పొత్తు చెడిపోవడంతో కశ్మీర్లో మంగళవారం నుంచి గవర్నర్ పాలన మొదలైన సంగతి తెలిసిందే. అయితే వొహ్రా పదవీకాలం జూన్ 27న ముగియనుండగా.. జూలైలో అమర్నాథ్ యాత్ర ప్రారంభంకానుంది. దక్షిణ కశ్మీర్ మీదుగా అమర్నాథ్ యాత్ర సాగనుండగా.. అక్కడ ఇప్పటికే ఉగ్రవాద కార్యకాలాపాలు పెరిగిపోవడంతో భద్రతా సమస్యలు తలెత్తాయి. వొహ్రా అనంతరం కొత్త గవర్నర్‌ను నియమిస్తే కశ్మీర్ పాలనా, భద్రతా పరమైన వ్యవహారాలు తెలుసుకొనే సరికే నూతన గవర్నర్‌కు దాదాపు ఆరు నెలల సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో వొహ్రా పదవీ కాలం పెంపు తథ్యమని పలువురు భావిస్తున్నారు. 2016లో ముఖ్యమంత్రి ముఫ్తి మహ్మద్ సయ్యద్ మరణానంతరం కశ్మీర్లో ఆరు నెలలపాటు గవర్నర్ పాలన విధించారు. ఆ సమయంలో రాష్ట్రంలో పరిపాలన గాడి తప్పకుండా వొహ్రా చక్కదిద్దారు. మరోవైపు అమర్నాథ్ క్షేత్ర బోర్డులో వొహ్రా పరిపాలనా అధ్యక్షుడిగా సేవలందిస్తున్నారు. ఆగస్టు 26న యాత్ర ముగియనుంది. -
జమ్మూకశ్మీర్‌లో మళ్లీ గవర్నర్ పాలన..
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్‌లో మళ్లీ గవర్నర్ పాలన అమల్లోకి వచ్చింది. పీడీపీ సంకీర్ణ ప్రభుత్వం నుంచి బీజేపీ వైదొలగడంతో రాష్ట్రంలో మరోసారి గవర్నర్ పాలన విధించారు. రాష్ట్రంలో తాజా రాజకీయ సంక్షోభం నేపథ్యంలో గవర్నర్ పాలన విధించాలంటూ ఆ రాష్ట్ర గవర్నర్ వోహ్రా పంపిన ప్రతిపాదనకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు. పీడీపీ ప్రభుత్వం నుంచి బీజేపీ వైదొలగడం.. ఆ తర్వాత ముఖ్యమంత్రి పదవి మెహబూబా ముఫ్తీ రాజీనామా చేయడం తెలిసిందే. అనంతర పరిణామాల్లో ప్రభుత్వ ఏర్పాటుకు ఏ పార్టీ కూడా ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌లో గవర్నర్ పాలన విధించారు. గత నాలుగు దశాబ్దాల్లో ఇప్పటివరకు అక్కడ ఏడుసార్లు గవర్నర్ పాలన విధించారు. ప్రస్తుత గవర్నర్ ఎన్ఎన్ వోహ్రా హయాంలోనే ఇక్కడ గతంలో మూడుసార్లు గవర్నర్ పాలన అమల్లోకి వచ్చింది. తాజాగా కూడా గవర్నర్ పాలన విధించడంతో ఆయన హయాంలో నాలుగోసారి ఇది అమల్లోకి వచ్చినట్లవుతుంది. రాష్ట్రంలో తీవ్రవాదం, టెర్రరిజం పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వంలో కొనసాగడం అసాధ్యమైందని పేర్కొంటూ పీడీపీ ప్రభుత్వం నుంచి బీజేపీ వైదొలిగింది. మాజీ సీఎం ముఫ్తీ మహమ్మద్ సయీద్ ప్రత్యక్ష, పరోక్ష రాజకీయ నిర్ణయాల వల్లే అత్యధిక పర్యాయాలు జమ్మూలో గవర్నర్ పాలన అమల్లోకి రావడం విశేషం. ఇవీ గవర్నర్ పాలన తీరుతెన్నులు.. ♦ 1977 మార్చిలో తొలిసారి గవర్నర్ పాలన విధించారు. నేషనల్ కాన్ఫరెన్స్ ప్రభుత్వానికి అప్పటి జమ్మూ కాంగ్రెస్ అధ్యక్షుడు సయీద్ మద్దతు ఉపసంహరించుకోవడంతో గవర్నర్ పాలన వచ్చింది. ♦ 1986లో రెండోసారి గవర్నర్ పాలన విధిం చారు. గులాం మొహమ్మద్ షా ప్రభుత్వానికి సయీద్ మద్దతు ఉపసంహరించుకోవడంతో ప్రభుత్వం కుప్పకూలింది. ♦ 1990 జనవరిలో మూడోసారి గవర్నర్ పాలన అమల్లోకి వచ్చింది. ఈ సమయంలో సయీద్ కేంద్ర హోంమంత్రిగా ఉన్నారు. గవర్నర్‌గా జగ్మోహన్ నియామకంలో ఆయన కీలక పాత్ర పోషించారు. సీఎం ఫరూక్ వ్యతిరేకించినప్పటికీ జగ్మోహన్ను గవర్నర్‌గా నియమించారు. దీనికి నిరసనగా సీఎం ఫరూక్ అబ్దుల్లా రాజీనామా చేయడంతో ప్రభుత్వం పడిపోయింది. ఈసారి అత్యధికంగా 6 సంవత్సరాల 264 రోజులు జమ్మూకశ్మీర్ గవర్నర్ పాలన కిందే కొనసాగింది. ♦ 2002 అక్టోబర్‌లో నాలుగోసారి గవర్నర్ పాలన విధించారు. అప్పటి ఆపద్ధర్మ సీఎం ఫరూక్ అబ్దుల్లా సీఎంగా కొనసాగడానికి నిరాకరించడంతో గవర్నర్ పాలన అనివార్యమైంది. అయితే ఈసారి 15 రోజులే ఈ పాలన సాగింది. ♦ 2008లో ఐదోసారి గవర్నర్ పాలన అమల్లోకి వచ్చింది. గులాం నబీ ఆజాద్ నేతృత్వంలోని కాంగ్రెస్– పీడీపీ సంకీర్ణ ప్రభుత్వానికి పీడీపీ మద్దతు ఉపసంహరించుకోవడంతో మరోసారి విధించారు. ♦ 2014 డిసెంబర్ అసెంబ్లీ ఫలితాల్లో ఏ పార్టీకి మెజార్టీ రాలేదు. అప్పటి ఆపద్ధర్మ సీఎం ఒమర్ అబ్దుల్లా బాధ్యతల నుంచి తప్పుకోవడంతో 2015 జనవరి 7న ఆరోసారి గవర్నర్ పాలన అమల్లోకి వచ్చింది. ♦ మాజీ సీఎం ముఫ్తీ సయీద్ మరణానంతరం 2016 జనవరి 8న గవర్నర్ పాలన విధించారు. -
ఎనిమిదోసారి గవర్నర్ పాలన!
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో పీడీపీ ప్రభుత్వం నుంచి బీజేపీ వైదొలగడంతో అక్కడ గవర్నర్ పాలన అనివార్యం కానుంది. గత నాలుగు దశాబ్దాల్లో ఇప్పటివరకు అక్కడ ఏడుసార్లు గవర్నర్ పాలన విధించారు. ప్రస్తుత గవర్నర్ ఎన్ఎన్ వోహ్రా హయాంలోనే మూడుసార్లు అక్కడ గవర్నర్ పాలన అమల్లోకి వచ్చింది. ఈసారి కూడా విధిస్తే ఆయన హయాంలో నాలుగోసారి అమల్లోకి వచ్చినట్లవుతుంది. రాష్ట్రంలో తీవ్రవాదం, టెర్రరిజం పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వంలో కొనసాగడం అసాధ్యమైందని పేర్కొంటూ పీడీపీ ప్రభుత్వం నుంచి బీజేపీ వైదొలిగింది. మాజీ సీఎం ముఫ్తీ మహమ్మద్ సయీద్ ప్రత్యక్ష, పరోక్ష రాజకీయ నిర్ణయాల వల్లే అత్యధిక పర్యాయాలు జమ్మూలో గవర్నర్ పాలన అమల్లోకి రావడం విశేషం. ఇవీ గవర్నర్ పాలన తీరుతెన్నులు.. ♦ 1977 మార్చిలో తొలిసారి గవర్నర్ పాలన విధించారు. నేషనల్ కాన్ఫరెన్స్ ప్రభుత్వానికి అప్పటి జమ్మూ కాంగ్రెస్ అధ్యక్షుడు సయీద్ మద్దతు ఉపసంహరించుకోవడంతో గవర్నర్ పాలన వచ్చింది. ♦ 1986లో రెండోసారి గవర్నర్ పాలన విధిం చారు. గులాం మొహమ్మద్ షా ప్రభుత్వానికి సయీద్ మద్దతు ఉపసంహరించుకోవడంతో ప్రభుత్వం కుప్పకూలింది. ♦ 1990 జనవరిలో మూడోసారి గవర్నర్ పాలన అమల్లోకి వచ్చింది. ఈ సమయంలో సయీద్ కేంద్ర హోంమంత్రిగా ఉన్నారు. గవర్నర్‌గా జగ్మోహన్ నియామకంలో ఆయన కీలక పాత్ర పోషించారు. సీఎం ఫరూక్ వ్యతిరేకించినప్పటికీ జగ్మోహన్ను గవర్నర్‌గా నియమించారు. దీనికి నిరసనగా సీఎం ఫరూక్ అబ్దుల్లా రాజీనామా చేయడంతో ప్రభుత్వం పడిపోయింది. ఈసారి అత్యధికంగా 6 సంవత్సరాల 264 రోజులు జమ్మూకశ్మీర్ గవర్నర్ పాలన కిందే కొనసాగింది. ♦ 2002 అక్టోబర్‌లో నాలుగోసారి గవర్నర్ పాలన విధించారు. అప్పటి ఆపద్ధర్మ సీఎం ఫరూక్ అబ్దుల్లా సీఎంగా కొనసాగడానికి నిరాకరించడంతో గవర్నర్ పాలన అనివార్యమైంది. అయితే ఈసారి 15 రోజులే ఈ పాలన సాగింది. ♦ 2008లో ఐదోసారి గవర్నర్ పాలన అమల్లోకి వచ్చింది. గులాం నబీ ఆజాద్ నేతృత్వంలోని కాంగ్రెస్– పీడీపీ సంకీర్ణ ప్రభుత్వానికి పీడీపీ మద్దతు ఉపసంహరించుకోవడంతో మరోసారి విధించారు. ♦ 2014 డిసెంబర్ అసెంబ్లీ ఫలితాల్లో ఏ పార్టీకి మెజార్టీ రాలేదు. అప్పటి ఆపద్ధర్మ సీఎం ఒమర్ అబ్దుల్లా బాధ్యతల నుంచి తప్పుకోవడంతో 2015 జనవరి 7న ఆరోసారి గవర్నర్ పాలన అమల్లోకి వచ్చింది. ♦ మాజీ సీఎం ముఫ్తీ సయీద్ మరణానంతరం 2016 జనవరి 8న గవర్నర్ పాలన విధించారు. రాష్ట్రపతి పాలన కాదు.. గవర్నర్ రూల్! న్యూఢిల్లీ: సాధారణంగా రాష్ట్రాల్లో ఇలాంటి సంక్షోభం ఏర్పడినప్పుడు రాష్ట్రపతి పాలన విధిస్తారు. కానీ జమ్మూకశ్మీర్‌లో మాత్రం అలా కుదరదు. జమ్మూకశ్మీర్‌కే ప్రత్యేకమైన రాజ్యాంగం ప్రకారం ఇక్కడ సంక్షోభ సమయాల్లో విధించేది గవర్నర్ పాలన. జమ్మూకశ్మీర్ రాజ్యాంగంలోని సెక్షన్ 92 ప్రకారం.. రాష్ట్రపతి ఆమోదం అనంతరం రాష్ట్రంలో ఆరు నెలల పాటు గవర్నర్ పాలన విధించవచ్చు. ఇతర రాష్ట్రాల్లో రాజకీయ సంక్షోభం ఏర్పడిన సందర్భాల్లో భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 కింద రాష్ట్రపతి పాలన విధిస్తారు. గవర్నర్ పాలన సమయంలో అసెంబ్లీని రద్దు చేయడం కానీ, సుప్త చేతనావస్థలో ఉంచడం కానీ చేస్తారు. ఆర్నెల్లలోపు ప్రభుత్వ ఏర్పాటు సాధ్యం కాని పక్షంలో మరో ఆర్నెల్ల పాటు గవర్నర్ పాలన పొడిగిస్తారు. త్వరలో కొత్త గవర్నర్! జమ్మూకశ్మీర్‌కు కేంద్రం త్వరలో కొత్త గవర్నర్‌ను నియమించనున్నట్లు సమాచారం. అమర్నాథ్ యాత్ర ముగిసిన అనంతరం కొత్త గవర్నర్ బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందని బీజేపీ సీనియర్ నేత ఒకరు వెల్లడించారు. అమర్నాథ్ యాత్ర జూన్ 28న ప్రారంభమై.. రెండు నెలల పాటు కొనసాగనుంది. ప్రస్తుత గవర్నర్ వోహ్రాకు ఉన్న అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని యాత్ర బాధ్యతలను కేంద్రం ఆయనకు అప్పగించింది. యూపీఏ హయాంలో నియమితులై.. ఎన్డీఏ హయాంలో పొడిగింపు పొందిన కొద్దిమంది గవర్నర్లలో వోహ్రా ఒకరు. -
కశ్మీర్లో గవర్నర్ పాలన
►గవర్నర్ వోహ్రా సిఫారసును ఆమోదించిన రాష్ర్టపతి ► రాష్ర్టంలో రాజ్యాంగ వ్యవస్థ విఫలమైందని పేర్కొన్న గవర్నర్ ► తాజా పరిణామంపై దుమ్మెత్తిపోసుకున్న రాజకీయ పార్టీలు ► బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామన్న అమిత్ షా న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో గవర్నర్ పాలన తప్పలేదు. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మద్దతును ఏ పార్టీ కూడగట్టకపోవడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఆపద్ధర్మ సీఎంగా కొనసాగడానికి ఒమర్ అబ్దుల్లా నిరాకరించడంతో గవర్నర్ పాలనతో పాటు మరికొన్ని ప్రత్యామ్నాయాలను రాష్ర్ట గవర్నర్ ఎన్ఎన్ వోహ్రా రాష్ర్టపతికి సిఫారసు చేశారు. గురువారం రాత్రే నివేదిక పంపించారు. దీంతో గవర్నర్ పాలనకే ప్రణబ్ మొగ్గుచూపారు.ఈ సిఫారసును శుక్రవారం ఆమోదించారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి తగినన్ని సీట్లు రాకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ ఏర్పాటుకు వివిధ పార్టీల మధ్య జరుగుతున్న చర్చలు కొలిక్కిరాలేదు. మరోవైపు సరిహద్దుల్లో పాక్ ఘర్షణాత్మక వైఖరి నేపథ్యంలో రాష్ర్టంలో పూర్తిస్థాయి పాలన అవసరమంటూ కేంద్రానికి ఒమర్ సూచించారు. రాష్ర్టంలో రాజ్యాంగ వ్యవస్థ విఫలమైనప్పుడు కశ్మీర్ రాజ్యాంగంలోని సెక్షన్ 92 ప్రకారం గవర్నర్ పాలనకు రాష్ర్ట గవర్నర్ సిఫారసు చేయొచ్చు. ఈ నేపథ్యంలో గవర్నర్ నివేదికను కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ముందుగా ప్రధాని కార్యాలయానికి పంపించారు. అక్కడి నుంచి అది రాష్ర్టపతి వద్దకు చేరింది. ఆయన ఆమోదం తర్వాత శుక్రవారం సాయంత్రం కేంద్రం ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వ ఏర్పాటుకు ఏ పార్టీ, కూటమి ముందుకురాకపోవడంతో గవర్నర్ సిఫారసు మేరకు గవర్నర్ పాలన విధిస్తున్నట్లు పేర్కొంది. గత డిసెంబర్ 23న వెల్లడైన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మొత్తం 87 స్థానాలకుగాను పీడీపీకి 28, బీజేపీకి 25, ఎన్సీకి 15, కాంగ్రెస్‌కు 12 సీట్లు వచ్చాయి. మెజారిటీ మార్కు సాధించాలంటే 44 సీట్లు ఉండాలి. ప్రస్తుత అసెంబ్లీ గడువు ఈ నెల 19న ముగుస్తోంది. ఆలోగా కొత్త ప్రభుత్వం ఏర్పడాలి. ఈలోగానే గవర్నర్ పాలన విధించాల్సి వచ్చింది. 12 ఏళ్ల క్రితం ఫరూఖ్ అబ్దుల్లా ఆపద్ధర్మ సీఎంగా ఉన్నప్పుడూ ఇలాంటి పరిస్థితే ఏర్పడింది. విమర్శలు గుప్పించుకున్న పార్టీలు కశ్మీర్లో గవర్నర్ పాలనకు కారణం మీరంటే మీరని పార్టీలు దుమ్మెత్తి పోసుకున్నాయి. ఓటర్ల తీర్పు మేరకు ప్రభుత్వం ఏర్పడకపోవడం అసంతృప్తికరమని కాంగ్రెస్, సీపీఎంలు వ్యాఖ్యానించాయి. అతిపెద్ద పార్టీగా నిలిచిన పీడీపీ.. ప్రభుత్వ ఏర్పాటులో పూర్తిగా విఫలమైందని విమర్శించాయి. గవర్నర్ పాలన కు పీడీపీనే కారణమని మాజీ సీఎం ఒమర్ ఆరోపించారు. మరోవైపు నేషనల్ కాన్ఫరెన్స్ తీరును పీడీపీ తప్పుబట్టింది. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా అయిన ఒమర్ చిన్నపిల్లాడిలా ప్రవర్తిస్తున్నారని, ఆయన వల్లే ఈ పాలన వచ్చిందని మండిపడింది. తగిన సమయం వచ్చినప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆ పార్టీ నేతలన్నారు. బీజేపీ సహా ఎవరితోనైనా కలిసి అధికారం చేపట్టే అవకాశముంద న్నారు. అయితే అతి పెద్ద పార్టీగా ఉన్న పీడీపీకి మద్దతిస్తామని తాము ముందే ప్రకటించామని ఎన్సీ నేతలు ప్రతిస్పందించారు. మరోవైపు ప్రభుత్వ ఏర్పాటు కోసం పీడీపీ, ఎన్సీలతో చర్చలు జరుపుతున్నట్లు బీజేపీ పేర్కొంది. కశ్మీర్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా విజయవాడలో చెప్పారు. -
కశ్మీర్లో ముదిరిన సంక్షోభం
ఆపద్ధర్మ సీఎంగా కొనసాగబోనని స్పష్టం చేసిన ఒమర్ కేంద్రానికి నివేదిక పంపిన గవర్నర్ న్యూఢిల్లీ/శ్రీనగర్: జమ్మూకశ్మీర్ రాజకీయాలు మరింత రసకందాయంలో పడ్డాయి. ఇప్పటికే ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన కొనసాగుతుండగా.. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగలేనంటూ ఒమర్ అబ్దుల్లా గవర్నర్ ఎన్ఎన్ వోహ్రాకు స్పష్టంచేశారు. దీంతో గవర్నర్ రాష్ట్రంలో తాజా పరిస్థితిని తెలియజేస్తూ గురువారం కేంద్రానికి నివేదిక పంపారు. దీన్ని హోం మంత్రి రాజ్‌నాథ్ ప్రధాన మంత్రి కార్యాలయానికి పంపారు. ఇప్పటిదాకా ఏ పార్టీ/కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రాకపోవడంతో రాష్ట్రపతి పాలన విధించాలని సిఫారసు చేశారు. 10 రోజులే అన్నారు.. ఒమర్: లండన్ నుంచి బుధవారమే తిరిగొచ్చిన ఒమర్ ఢిల్లీలో గవర్నర్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆపద్ధర్మ సీఎం పదవి నుంచి తప్పుకుంటానని గవర్నర్‌కు చెప్పారు. సరిహద్దులో తాజా పరిస్థితులతోపాటు వరద బాధితులకు సాయం అందించాల్సి ఉన్నందున రాష్ట్రానికి పూర్తిస్థాయి ముఖ్యమంత్రి ఉండాలని వివరించారు. ఇవే విషయాలను గురువారం ట్వీటర్లో వివరించారు. ‘‘పది రోజుల్లోగా ప్రభుత్వం ఏర్పడుతుందన్న హామీపై నేను ఆపద్ధర్మ సీఎంగా పగ్గాలు చేపట్టాను. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. ప్రభుత్వ ఏర్పాటుకు మరికొన్ని రోజులు పట్టే అవకాశాలున్నాయి. సరిహద్దుల్లో 10 వేల మంది నిరాశ్రయులయ్యారు. వరద బాధితులకు సాయం అందాల్సి ఉంది. పూర్తిస్థాయి సీఎం ఉంటేనే వీటన్నింటికీ పరిష్కారం చూపడం సాధ్యమవుతుంది’’ అని పేర్కొన్నారు. 28 సీట్లలో నెగ్గి, రెండు పార్టీలు(ఎన్సీ, కాంగ్రెస్) మద్దతిస్తామని చెబుతున్నా పీడీపీ ఎందుకు ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించారు. డిసెంబర్ 24న రాష్ట్ర ఆపద్ధర్మ సీఎంగా ఒమర్ అబ్దుల్లా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈనెల 19నాటికి రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడాల్సి ఉంది. లేదంటే రాష్ట్రపతి పాలన తప్పదు. -
గవర్నర్‌ను గడువు కోరిన బీజేపీ
జమ్మూలోని రాజ్భన్లో జమ్మూ కశ్మీర్ గవర్నర్ ఎన్ఎన్ వోహ్రాను కలసిన బీజేపీ నేతలు జమ్మూ: జమ్మూ కశ్మీర్లో ప్రభుత్వం ఏర్పాటుకు ముమ్మర యత్నాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం ఏర్పాటులో బీజేపీతో చేతులు కలిపేందుకు తాము విముఖంకాదని పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) బుధవారం సూచనప్రాయంగా ప్రకటించిన నేపథ్యంలో బీజేపీ ప్రతినిధి బృందం గురువారం జమ్మూలో గవర్నర్ ఎన్ఎన్ వోహ్రాను కలుసుకుంది. సుస్థిర ప్రభుత్వం ఏర్పాటుపై పార్టీలతో చర్చించేందుకు తమకు మరింత గడువు కావాలని ఆ బృందం గవర్నర్‌ను కోరింది. జమ్మూ కశ్మీర్లో ఏ పార్టీకి గానీ, కూటమికి గానీ పూర్తి మెజార్టీ రాకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన నెలకొన్న విషయం తెలిసిందే. రాష్ట్రంలోని 87 శాసనసభ స్థానాలలో 28 సీట్లతో పీడీపీ అతిపెద్దపార్టీగా అవతరించింది. 25 సీట్లతో బీజేపీ రెండో స్థానంలో ఉంది. అయితే ఈ రెండు పార్టీలు ప్రభుత్వం ఏర్పాటుకు కావలసిన సంఖ్యాబలాన్ని సాధించలేక పోయాయి.