జమ్ము కశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా (ఫైల్ ఫొటో)
శ్రీనగర్ : అనూహ్య రాజకీయ పరిణామాల మధ్య కశ్మీర్‌లో గవర్నర్ పాలన విధించిన విషయం తెలిసిందే. జమ్మూ కశ్మీర్ రాజ్యాంగంలోని సెక్షన్ 92 కింద గవర్నర్ పాలనను అమలు చేస్తున్నట్లు ప్రకటించిన ఎన్‌ఎన్ వోహ్రా.. అసెంబ్లీని సుప్తచేతనావస్థలో ఉంచుతున్నట్లు ప్రకటించారు. అయితే ప్రస్తుతం జమ్ము కశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితులపై మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా ఓ జాతీయ మీడియాకు గురువారం ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
పీడీపీ(పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ)లో చీలిక ఏర్పడే అవకాశం ఉందన్న అబ్దుల్లా.. మళ్లీ అధికారం చేజిక్కించుకునేందుకు పీడీపీలోని ఓ వర్గం బీజేపీలో చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదని వ్యాఖ్యానించారు. అధికారమే పరమావధిగా భావించే బీజేపీ ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ఏమాత్రం వెనకాడబోదన్నారు. ‘మా పార్టీ ప్రయత్నాలు మొదలుపెట్టిందంటూ’ బీజేపీ నేత, కశ్మీర్ మాజీ ఉప ముఖ్యమంత్రి కవిందర్ గుప్తా చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమని అబ్దుల్లా వ్యాఖ్యానించారు.
అసెంబ్లీని రద్దు చేయాలి..
ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న క్లిష్ట పరిస్థితుల దృష్ట్యా గవర్నర్ వోహ్రా పదవీ కాలాన్ని పొడగించడం సరైన నిర్ణయమని అబ్దుల్లా పేర్కొన్నారు. అయితే జమ్ము కశ్మీర్ అసెంబ్లీని వెంటనే రద్దు చేయాలని.. లేనిపక్షంలో బీజేపీ ఇతర పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే అవకాశం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఏ పార్టీ ముందుకు రాని నేపథ్యంలో అసెంబ్లీని సుప్తచేతనావస్థలో ఉంచడం వల్ల ప్రజా ధనం దుర్వినియోగమవుతుందని వ్యాఖ్యానించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల దృష్ట్యానే బీజేపీ ఈ నిర్ణయం తీసుకుందని... అయితే బీజేపీ ఎత్తుగడలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నారు. కశ్మీర్‌లో ప్రస్తుతం నెలకొన్న అశాంతికి బీజేపీ, పీడీపీల అధికార దాహమే కారణమని ఆయన ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment