జమ్మూకశ్మీర్‌లో మళ్లీ గవర్నర్‌ పాలన.. | Governor Rule In Jammu And Kashmir | Sakshi
Sakshi News home page

Published Wed, Jun 20 2018 10:14 AM | Last Updated on Mon, Jul 29 2019 6:58 PM

Governor Rule In Jammu And Kashmir - Sakshi

శ్రీనగర్ ‌: జమ్మూకశ్మీర్‌లో మళ్లీ గవర్నర్‌ పాలన అమల్లోకి వచ్చింది. పీడీపీ సంకీర్ణ ప్రభుత్వం నుంచి బీజేపీ వైదొలగడంతో రాష్ట్రంలో మరోసారి గవర్నర్‌ పాలన విధించారు. రాష్ట్రంలో తాజా రాజకీయ సంక్షోభం నేపథ్యంలో గవర్నర్‌ పాలన విధించాలంటూ ఆ రాష్ట్ర గవర్నర్‌ వోహ్రా పంపిన ప్రతిపాదనకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదం తెలిపారు. పీడీపీ ప్రభుత్వం నుంచి బీజేపీ వైదొలగడం.. ఆ తర్వాత ముఖ్యమంత్రి పదవి మెహబూబా ముఫ్తీ రాజీనామా చేయడం తెలిసిందే. అనంతర పరిణామాల్లో ప్రభుత్వ ఏర్పాటుకు ఏ పార్టీ కూడా ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌లో గవర్నర్‌ పాలన విధించారు. గత నాలుగు దశాబ్దాల్లో ఇప్పటివరకు అక్కడ ఏడుసార్లు గవర్నర్‌ పాలన విధించారు. ప్రస్తుత గవర్నర్‌ ఎన్‌ఎన్‌ వోహ్రా హయాంలోనే ఇక్కడ గతంలో మూడుసార్లు గవర్నర్‌ పాలన అమల్లోకి వచ్చింది. తాజాగా కూడా గవర్నర్‌ పాలన విధించడంతో ఆయన హయాంలో నాలుగోసారి ఇది అమల్లోకి వచ్చినట్లవుతుంది.

రాష్ట్రంలో తీవ్రవాదం, టెర్రరిజం పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వంలో కొనసాగడం అసాధ్యమైందని పేర్కొంటూ పీడీపీ ప్రభుత్వం నుంచి బీజేపీ వైదొలిగింది. మాజీ సీఎం ముఫ్తీ మహమ్మద్‌ సయీద్‌ ప్రత్యక్ష, పరోక్ష రాజకీయ నిర్ణయాల వల్లే అత్యధిక పర్యాయాలు జమ్మూలో గవర్నర్‌ పాలన అమల్లోకి రావడం విశేషం.

ఇవీ గవర్నర్‌ పాలన తీరుతెన్నులు..
♦ 1977 మార్చిలో తొలిసారి గవర్నర్‌ పాలన విధించారు. నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ప్రభుత్వానికి అప్పటి జమ్మూ కాంగ్రెస్‌ అధ్యక్షుడు సయీద్‌ మద్దతు ఉపసంహరించుకోవడంతో గవర్నర్‌ పాలన వచ్చింది.
♦ 1986లో రెండోసారి గవర్నర్‌ పాలన విధిం చారు. గులాం మొహమ్మద్‌ షా ప్రభుత్వానికి సయీద్‌ మద్దతు ఉపసంహరించుకోవడంతో ప్రభుత్వం కుప్పకూలింది.
♦ 1990 జనవరిలో మూడోసారి గవర్నర్‌ పాలన అమల్లోకి వచ్చింది. ఈ సమయంలో సయీద్‌ కేంద్ర హోంమంత్రిగా ఉన్నారు. గవర్నర్‌గా జగ్మోహన్‌ నియామకంలో ఆయన కీలక పాత్ర పోషించారు. సీఎం ఫరూక్‌ వ్యతిరేకించినప్పటికీ జగ్మోహన్‌ను గవర్నర్‌గా నియమించారు. దీనికి నిరసనగా సీఎం ఫరూక్‌ అబ్దుల్లా రాజీనామా చేయడంతో ప్రభుత్వం పడిపోయింది. ఈసారి అత్యధికంగా 6 సంవత్సరాల 264 రోజులు జమ్మూకశ్మీర్‌ గవర్నర్‌ పాలన కిందే కొనసాగింది.
♦ 2002 అక్టోబర్‌లో నాలుగోసారి గవర్నర్‌ పాలన విధించారు. అప్పటి ఆపద్ధర్మ సీఎం ఫరూక్‌ అబ్దుల్లా సీఎంగా కొనసాగడానికి నిరాకరించడంతో గవర్నర్‌ పాలన అనివార్యమైంది. అయితే ఈసారి 15 రోజులే ఈ పాలన సాగింది.
♦ 2008లో ఐదోసారి గవర్నర్‌ పాలన అమల్లోకి వచ్చింది. గులాం నబీ ఆజాద్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌– పీడీపీ సంకీర్ణ ప్రభుత్వానికి పీడీపీ మద్దతు ఉపసంహరించుకోవడంతో మరోసారి విధించారు.
♦ 2014 డిసెంబర్‌ అసెంబ్లీ ఫలితాల్లో ఏ పార్టీకి మెజార్టీ రాలేదు. అప్పటి ఆపద్ధర్మ సీఎం ఒమర్‌ అబ్దుల్లా బాధ్యతల నుంచి తప్పుకోవడంతో 2015 జనవరి 7న ఆరోసారి గవర్నర్‌ పాలన అమల్లోకి వచ్చింది.
♦ మాజీ సీఎం ముఫ్తీ సయీద్‌ మరణానంతరం 2016 జనవరి 8న గవర్నర్‌ పాలన విధించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement