శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో పీడీపీ ప్రభుత్వం నుంచి బీజేపీ వైదొలగడంతో అక్కడ గవర్నర్ పాలన అనివార్యం కానుంది. గత నాలుగు దశాబ్దాల్లో ఇప్పటివరకు అక్కడ ఏడుసార్లు గవర్నర్ పాలన విధించారు. ప్రస్తుత గవర్నర్ ఎన్‌ఎన్ వోహ్రా హయాంలోనే మూడుసార్లు అక్కడ గవర్నర్ పాలన అమల్లోకి వచ్చింది.
ఈసారి కూడా విధిస్తే ఆయన హయాంలో నాలుగోసారి అమల్లోకి వచ్చినట్లవుతుంది. రాష్ట్రంలో తీవ్రవాదం, టెర్రరిజం పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వంలో కొనసాగడం అసాధ్యమైందని పేర్కొంటూ పీడీపీ ప్రభుత్వం నుంచి బీజేపీ వైదొలిగింది. మాజీ సీఎం ముఫ్తీ మహమ్మద్ సయీద్ ప్రత్యక్ష, పరోక్ష రాజకీయ నిర్ణయాల వల్లే అత్యధిక పర్యాయాలు జమ్మూలో గవర్నర్ పాలన అమల్లోకి రావడం విశేషం.
ఇవీ గవర్నర్ పాలన తీరుతెన్నులు..
♦ 1977 మార్చిలో తొలిసారి గవర్నర్ పాలన విధించారు. నేషనల్ కాన్ఫరెన్స్ ప్రభుత్వానికి అప్పటి జమ్మూ కాంగ్రెస్ అధ్యక్షుడు సయీద్ మద్దతు ఉపసంహరించుకోవడంతో గవర్నర్ పాలన వచ్చింది.
♦ 1986లో రెండోసారి గవర్నర్ పాలన విధిం చారు. గులాం మొహమ్మద్ షా ప్రభుత్వానికి సయీద్ మద్దతు ఉపసంహరించుకోవడంతో ప్రభుత్వం కుప్పకూలింది.
♦ 1990 జనవరిలో మూడోసారి గవర్నర్ పాలన అమల్లోకి వచ్చింది. ఈ సమయంలో సయీద్ కేంద్ర హోంమంత్రిగా ఉన్నారు. గవర్నర్‌గా జగ్మోహన్ నియామకంలో ఆయన కీలక పాత్ర పోషించారు. సీఎం ఫరూక్ వ్యతిరేకించినప్పటికీ జగ్మోహన్‌ను గవర్నర్‌గా నియమించారు. దీనికి నిరసనగా సీఎం ఫరూక్ అబ్దుల్లా రాజీనామా చేయడంతో ప్రభుత్వం పడిపోయింది. ఈసారి అత్యధికంగా 6 సంవత్సరాల 264 రోజులు జమ్మూకశ్మీర్ గవర్నర్ పాలన కిందే కొనసాగింది.
♦ 2002 అక్టోబర్‌లో నాలుగోసారి గవర్నర్ పాలన విధించారు. అప్పటి ఆపద్ధర్మ సీఎం ఫరూక్ అబ్దుల్లా సీఎంగా కొనసాగడానికి నిరాకరించడంతో గవర్నర్ పాలన అనివార్యమైంది. అయితే ఈసారి 15 రోజులే ఈ పాలన సాగింది.
♦ 2008లో ఐదోసారి గవర్నర్ పాలన అమల్లోకి వచ్చింది. గులాం నబీ ఆజాద్ నేతృత్వంలోని కాంగ్రెస్– పీడీపీ సంకీర్ణ ప్రభుత్వానికి పీడీపీ మద్దతు ఉపసంహరించుకోవడంతో మరోసారి విధించారు.
♦ 2014 డిసెంబర్ అసెంబ్లీ ఫలితాల్లో ఏ పార్టీకి మెజార్టీ రాలేదు. అప్పటి ఆపద్ధర్మ సీఎం ఒమర్ అబ్దుల్లా బాధ్యతల నుంచి తప్పుకోవడంతో 2015 జనవరి 7న ఆరోసారి గవర్నర్ పాలన అమల్లోకి వచ్చింది.
♦ మాజీ సీఎం ముఫ్తీ సయీద్ మరణానంతరం 2016 జనవరి 8న గవర్నర్ పాలన విధించారు.
రాష్ట్రపతి పాలన కాదు.. గవర్నర్ రూల్!
న్యూఢిల్లీ: సాధారణంగా రాష్ట్రాల్లో ఇలాంటి సంక్షోభం ఏర్పడినప్పుడు రాష్ట్రపతి పాలన విధిస్తారు. కానీ జమ్మూకశ్మీర్లో మాత్రం అలా కుదరదు. జమ్మూకశ్మీర్‌కే ప్రత్యేకమైన రాజ్యాంగం ప్రకారం ఇక్కడ సంక్షోభ సమయాల్లో విధించేది గవర్నర్ పాలన.
జమ్మూకశ్మీర్ రాజ్యాంగంలోని సెక్షన్ 92 ప్రకారం.. రాష్ట్రపతి ఆమోదం అనంతరం రాష్ట్రంలో ఆరు నెలల పాటు గవర్నర్ పాలన విధించవచ్చు. ఇతర రాష్ట్రాల్లో రాజకీయ సంక్షోభం ఏర్పడిన సందర్భాల్లో భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 కింద రాష్ట్రపతి పాలన విధిస్తారు. గవర్నర్ పాలన సమయంలో అసెంబ్లీని రద్దు చేయడం కానీ, సుప్త చేతనావస్థలో ఉంచడం కానీ చేస్తారు. ఆర్నెల్లలోపు ప్రభుత్వ ఏర్పాటు సాధ్యం కాని పక్షంలో మరో ఆర్నెల్ల పాటు గవర్నర్ పాలన పొడిగిస్తారు.
త్వరలో కొత్త గవర్నర్!
జమ్మూకశ్మీర్‌కు కేంద్రం త్వరలో కొత్త గవర్నర్‌ను నియమించనున్నట్లు సమాచారం. అమర్‌నాథ్ యాత్ర ముగిసిన అనంతరం కొత్త గవర్నర్ బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందని బీజేపీ సీనియర్ నేత ఒకరు వెల్లడించారు. అమర్‌నాథ్ యాత్ర జూన్ 28న ప్రారంభమై.. రెండు నెలల పాటు కొనసాగనుంది.
ప్రస్తుత గవర్నర్ వోహ్రాకు ఉన్న అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని యాత్ర బాధ్యతలను కేంద్రం ఆయనకు అప్పగించింది. యూపీఏ హయాంలో నియమితులై.. ఎన్‌డీఏ హయాంలో పొడిగింపు పొందిన కొద్దిమంది గవర్నర్లలో వోహ్రా ఒకరు.
Comments
Please login to add a commentAdd a comment