సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలను ప్రభుత్వం జాప్యం చేస్తుండటంపై ప్రతిపక్షాల విమర్శలు పెరుగుతున్న నేపథ్యంలో వచ్చే నెల 15 నుంచి సమావేశాలు ప్రారంభం కావొచ్చనే సంకేతాలు వెలువడుతున్నాయి. వచ్చే ఏడాది జనవరి 5 వరకు శీతాకాల సమావేశాలు కొనసాగుతాయని విశ్వసనీయవర్గాల సమాచారం. అయితే ప్రభుత్వం దీనిపై ఎలాంటి ప్రకటనా విడుదల చేయలేదు. బ్యాంకుల్లో అప్పులకు సంబంధించిన దివాలా చట్టంపై ప్రభుత్వం ఆర్డినెన్స్ తెస్తోంది. దానిపై రాష్ట్రపతి సంతకం చేయగానే ప్రభుత్వం సమావేశాల తేదీలను లాంఛనంగా ప్రకటించనుంది.
బుధవారం మంత్రివర్గ సమావేశానికి ముందు ప్రధాని మోదీ, హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి జైట్లీ తదితరులు భేటీ అయ్యి ఈ నిర్ణయాలు తీసుకున్నారు. నిబంధనల ప్రకారం సమావేశాలు ప్రారంభమవడానికి 15 రోజుల ముందే తేదీలు ప్రకటించాల్సి ఉన్నందున నెలాఖరుకల్లా అధికారికంగా తేదీలు వెల్లడయ్యే అవకాశం ఉంది. జనవరి తొలి వారం వరకు శీతాకాల సమావేశాలు కొనసాగినా, అదే నెల చివరి వారంలోనే బడ్జెట్ సమావేశాలు కూడా ప్రారంభమవుతాయనీ, ఫిబ్రవరి 1నే బడ్జెట్‌ను ప్రవేశపెడతారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment