న్యూఢిల్లీ: దేశంలో తొలి రైల్వే యూనివర్సిటీ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. గుజరాత్‌లోని వడోదరలో నేషనల్ రైల్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ యూనివర్సిటీ(ఎన్‌ఆర్‌టీయూ) పేరిట దీన్ని నెలకొల్పాలని బుధవారం ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన సమావేశంలో నిర్ణయించారు. దీంతో మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ ప్రాజెక్టుకు మోక్షం లభించినట్లయింది. కంపెనీల చట్టం–2013 ప్రకారం రైల్వే మంత్రిత్వ శాఖ నెలకొల్పే లాభాపేక్ష లేని కంపెనీ ప్రతిపాదిత యూనివర్సిటీని నిర్వహిస్తుంది. వర్సిటీకి అవసరమైన ఆర్థిక, మౌలిక వసతులను సమకూర్చడంతో పాటు చాన్స్‌లర్, ఇతర ముఖ్యమైన బోధనా సిబ్బందిని ఆ కంపెనీయే నియమిస్తుందని రైల్వే శాఖ తెలిపింది. విద్య, పాలన విధులు నిర్వర్తించేందుకు స్వతంత్ర బోర్డును కూడా ఏర్పాటుచేస్తామని పేర్కొంది. ఏడాదికి 3 వేల మంది విద్యార్థులు వేర్వేరు ఫుల్‌టైమ్ కోర్సుల్లో నమోదుచేసుకోవచ్చని, అధునాతన పద్ధతుల్లో బోధన కొనసాగుతుందని పేర్కొంది.
వినియోగదారుల రక్షణ బిల్లుకు ఓకే:
వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం ప్రతిపాదించిన కొత్త బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 2015 నాటి చట్టంలో పలు సవరణలు చేసి దీన్ని రూపొందించారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనల్లో నటించే సెలబ్రిటీలపై జరిమానా, నిషేధం విధించనున్నారు.
‘టెక్స్‌టైల్స్’లో నైపుణ్యాభివృద్ధికి రూ.1300 కోట్లు
వ్యవస్థీకృత టెక్స్‌టైల్స్ రంగంలో నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగ కల్పన పెంచేందుకు రూ.1300 కోట్ల వ్యయంతో కొత్త పథకానికి కేంద్రం అంగీకారం తెలిపింది. ‘స్కీం ఫర్ కెపాసిటీ బిల్డింగ్’ పేరిట టెక్స్‌టైల్స్ రంగంలోని వేర్వేరు విభాగాల్లో 10 మంది లక్షల మందిని సుశిక్షితులుగా తీర్చిదిద్ది సర్టిఫికెట్లు ఇస్తారు. వారిలో కనీసం 70 శాతం మందికి స్థిర వేతనంతో కూడిన ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
రోహిణి కమిటీ పదవీకాలం పొడిగింపు
ఓబీసీల ఉపవర్గీకరణపై ఏర్పాటైన జస్టిస్ రోహిణి కమిటీ పదవీకాలాన్ని కేంద్రం వచ్చే ఏప్రిల్ 2 వరకు పొడిగించింది. అక్టోబర్ 11న పని ప్రారంభించిన కమిటీ 10 వారాల్లోనే నివేదిక సమర్పించాల్సి ఉండగా తాజాగా గడువు పొడిగించారు.
తొలి రైల్వే వర్సిటీకి పచ్చజెండా
Published Thu, Dec 21 2017 2:24 AM | Last Updated on Thu, May 24 2018 2:09 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment