
'సరదాకు కూడా కిడ్నీలు అమ్మేసుకుంటున్నారు'
గాంధీనగర్: డబ్బుకోసమే కాకుండా కామెడీగా కూడా కొందరు వ్యక్తులు కిడ్నీలు అమ్ముకుంటున్నారని గుజరాత్ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఆనంద్ జిల్లాలోని పండోలి అనే గ్రామంలో 13 మంది వ్యక్తులు తమ అవసరాల కోసం ఓ కిడ్నీ రాకెట్కు తమ మూత్రపిండాలు అమ్ముకున్నారన్న వార్తలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.
ఈ వ్యవహారంపై తేల్చాలంటూ, చర్చ చేపట్టాలంటూ గుజరాత్ అసెంబ్లీలో కాంగ్రెస్ ఇతర ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో దీనిపై వివరణ ఇచ్చిన గుజరాత్ ఆరోగ్యశాఖామంత్రి నితిన్ పటేల్ పేదరికం కారణంగానే కిడ్నీలను అమ్ముకోవడం లేదని, సరదాకు కూడా కొందరు వ్యక్తులు ఈ చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. ఏదేమైనా ఈ వ్యవహారాన్ని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామన్నారు.