
తిరువనంతపురం:
ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లోని విద్యార్థుల ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేయడమే లక్ష్యంగా కేరళలోని హరిత విద్యాలయం.. ఓ ఎడ్యుకేషనల్ రియాల్టీ షోను నిర్వహిస్తోంది. ఇందుకు సంబంధించిన విధివిధానాలను కేరళ సాంకేతిక విద్య, మౌలిక సదుపాయాల సంస్థ(కైట్) సంస్థ విడుదల చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు తమ ప్రతిభను చాటుకోవడానికి ఇదో అమోఘమైన అవకాశమని కైట్ పేర్కొంది. ప్రభుత్వ పాఠశాలలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ షోను నిర్వహిస్తున్నట్లు తెలిపింది.
కైట్ తెలిపిన మరిన్ని వివరాల ప్రకారం.. ఈ షోలో పాల్గొనాలనుకునే గవర్నమెంట్ పాఠశాలల విద్యార్థులు అక్టోబర్ 2వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి. అంతేకాక తమ ప్రతిభాపాఠవాలకు సంబంధించి సొంత యాక్టివిటీతో కూడిన 5 నిమిషాల వీడియో లేదా 20 నిమిషాల స్లైడ్ షోను పంపాలి. వీటిని పరిశీలించి, 150 మందిని తొలి రౌండ్ కోసం ఎంపిక చేస్తారు. వీరిలో రియాల్టీ షోను నిర్వహించి, అత్యుత్తమ ప్రతిభను చాటుకున్న విద్యార్థులను తదుపరి రౌండ్లకు పంపుతారు. పోటీలో చివరి వరకు నిలిచిన వారిని విజేతలుగా ప్రకటిస్తారు. మొదటి బహుమతిగా రూ.15 లక్షల నగదు, రెండో బహుమతిగా రూ.10 లక్షల నగదును, మూడో బహుమతిగా రూ.5 లక్షల నగదును అందజేస్తారు. విజేతలుగా నిలిచిన విద్యార్థులు చదివే పాఠశాలలకు కూడా ప్రోత్సాహకాలు అందజేస్తారు.