న్యూఢిల్లీ : పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రమాణస్వీకారోత్సవానికి హాజరైన నాటి నుంచి తన వ్యాఖ్యలు, చర్యలతో పంజాబ్ మంత్రి, కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధు తరచుగా వార్తల్లో నిలుస్తున్నారు. పాకిస్తాన్‌లో కర్తార్‌పూర్ కారిడార్ శంకుస్థాపనకు హాజరైన సిద్ధు.. ఖలిస్తాన్ వేర్పాటువాద నాయకుడు గోపాల్ సింగ్ చావ్లాతో ఫోటో దిగడం తాజాగా వివాదాస్పదమైంది. ఈ విషయంపై స్పందించిన కేంద్ర మంత్రి హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ సిద్ధుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘మన సైనికులను చంపిన వ్యక్తిని ఆలింగనం చేసుకుంటారు. పాకిస్తాన్‌కు వెళ్లి మూడు రోజులపాటు అక్కడే ఉంటారు. అంతేకాకుండా ఉగ్రవాదులతో కలిసి ఫొటోలకు పోజులిస్తారు. ఇటువంటి చర్యల ద్వారా ఆయన నిజమైన పాకిస్తాన్ ఏజెంట్ అని నిరూపించుకున్నారు’ అని సిద్ధును ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అసలు ఆయన ఎందుకలా ప్రవర్తిస్తున్నారో తెలియడం లేదని, ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పష్టతనివ్వాలని డిమాండ్ చేశారు.
కాగా ఇటీవల అమృత్‌సర్‌లోని నిరంకారి భవన్ వద్ద జరిగిన ఉగ్రవాద దాడికి, గోపాల్ సింగ్ చావ్లాకు సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలున్నాయి. చావ్లాతో తాను ఫొటో దిగడంపై తీవ్ర విమర్శలు వస్తుండటంతో సిద్ధూ స్పందించారు. గోపాల్ సింగ్ చావ్లా ఎవరో తనకు తెలియదని, పాక్‌లో తనతో వేలమంది ఫొటో దిగారని, అతను ఎవరో తాను గుర్తుపట్ట లేదని ఆయన వివరణ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment