పర్యాటక రంగ అభివృద్ధికి సహకరించండి
కేంద్ర పర్యాటక శాఖ మంత్రికి పేర్వారం రాములు విజ్ఞప్తి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో పర్యాటక రంగ అభివృద్ధికి తగిన సహకారం అందించాలని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి డా.మహేష్‌శర్మకి తెలంగాణ పర్యాటకశాఖ చైర్మన్ పేర్వారం రాములు విజ్ఞప్తి చేశారు. ఆయన కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయతో కలిసి రవాణాశాఖ భవన్‌లో కేంద్ర పర్యాటక శాఖ మంత్రితో బుధవారం సమావేశమయ్యారు. రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికి సంబంధించిన పలు కొత్త ప్రాజెక్టులను ఆయనకు వివరించారు. అనంతరం పేర్వారం రాములు మీడియాకి వివరాలు తెలిపారు.
అయోధ్య నుంచి శ్రీలంక వరకు రామాయణంలోని ముఖ్య ఘట్టాలను వివరించే ప్రాంతాలను కలుపుతూ కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న టూరిజం సర్క్యూట్‌లో ఖమ్మం జిల్లా భద్రాచలంలో ఉన్న పర్ణశాలను చేర్చాలని కోరినట్టు తెలిపారు. సోమశిల, శ్రీశైలం నుంచి అక్కమహాదేవి గుడుల అభివృద్ధికి రూ. 80కోట్ల నిధులు మంజూరు చేసినట్టు తెలిపారు. వరంగల్ నుంచి ఏటూరి నాగారం వరకు ఎడమవైపు మేడారం, కుడివైపు లక్నవరం, రామప్ప, పాకాలను కలుపుతూ గిరిజన పర్యాటక సర్క్యూట్ అభివృద్ధికి రూ.120 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ఎకోటూరిజం, ట్రైబల్ టూరిజం, హైదరాబాద్ వంటి నగరాల్లోని టూంబ్స్‌ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు అత్యధిక నిధులు కేటాయించాలని కేంద్ర మంత్రిని కోరినట్టు కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. కేంద్రమంత్రి ఆనంద్‌శర్మ స్పందిస్తూ.. తెలంగాణకు వీలైనంత సాయం చేస్తానని హామీ ఇచ్చారని తెలిపారు.