యూపీలో అత్యధిక, అత్యల్ప మెజారిటీలు
⇒ అత్యధికం 1,50,685
⇒ అత్యల్పం 171
లక్నో: ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ నాలుగింట మూడొంతుల ఆధిక్యం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. వివిధ పార్టీల నుంచి ఇక్కడ పోటీ చేసిన అభ్యర్థుల్లో ఒకరు లక్షన్నరకు పైగా మెజారిటీ సాధిస్తే.. మరొకరు కేవలం 171 ఓట్ల తేడాతో గట్టెక్కారు. యూపీలో అత్యధిక, అత్యల్ప మెజారిటీ సాధించిన వారిని పరిశీలిస్తే.. ఐదుగురు అభ్యర్థులు లక్ష ఓట్ల పైచిలుకు ఆధిక్యంతో గెలవగా, ఎనిమిది మంది కేవలం వెయ్యి లోపు మెజారిటీతో గట్టెక్కారు. అలాంటివారి వివరాలు...
► సాహిబాబాద్ నుంచి పోటీ చేసిన సునీల్ కుమార్ శర్మ అత్యధికంగా 1,50,685 ఓట్ల మెజారిటీ సాధిం చారు. కాంగ్రెస్ అభ్యర్థి అమర్ పాల్‌ను సునీల్ ఓడించారు.
► రథ్ నియోజకవర్గంలో మనీషా అనురాగి 1,04,643 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి గాయదీన్ అనురాగిపై గెలిచారు.
► నోయిడా నుంచి బీజేపీ తరఫున పోటీ చేసిన హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కొడుకు పంకజ్ సింగ్ 1,04,016 ఓట్ల మెజారిటీ సాధించారు. ఎస్పీ అభ్యర్థి సునీల్ చౌదరిని ఆయన ఓడించారు.
► దోమరియాగంజ్ స్థానంలో బీజేపీ అభ్యర్థి రాఘవేంద్ర ప్రతాప్ సింగ్ కేవలం 171 ఓట్ల మెజారిటీ సాధించారు. బీఎస్పీ నుంచి పోటీ చేసిన సయ్యదా ఖటూన్‌ను ఆయన ఓడించారు.
► మీరాపూర్‌లో బీజేపీ అభ్యర్థి అవతార్ సింగ్ భదానా 193 ఓట్ల తేడాతో ఎస్పీ అభ్యర్థి లియాకత్ అలీపై గెలుపొందారు.
► మంత్ నియోజకవర్గంలో బీఎస్పీకి చెందిన శ్యామ్ సుందర్ శర్మ ఆర్‌ఎల్‌డీ అభ్యర్థి యోగేశ్ చౌదరిని 432 ఓట్ల తేడాతో ఓడించారు.