ఫలించిన పోలీస్ వేట
చెన్నై, సాక్షి ప్రతినిధి: తీవ్రవాద కార్యకలాపాలతో తమిళనాడును బెంబేలెత్తించిన అల్-ఉమ్మా తీవ్రవాది హైదర్ అలీ అరెస్టయ్యాడు. రాష్ట్ర సీబీసీఐడీ పోలీసులు ఇతని కోసం 21 ఏళ్ల నుంచి గాలిస్తుండగా కేరళలో మంగళవారం పోలీసులకు పట్టుబడ్డాడు. కోయంబత్తూరులో 1989 సెప్టెంబరు 1న వీరగణేష్ అనే హిందూ సంస్థకు చెందిన నేత దారుణ హత్యకు గురయ్యూడు.
అతని అంత్యక్రియల్లో పాల్గొన్నవారిపై కూడా దాడులు జరిగాయి. కోవై విన్సెంట్ రోడ్డుకు చెందిన అల్-ఉమ్మా తీవ్రవాది హైదర్ అలీ సహా మొత్తం 12 మందిపై పోలీసులు హత్య, హత్యాయత్నం కేసులు పెట్టి జైల్లోకి నెట్టారు. అదే ఏడాది బెయిల్‌పై వెలుపలికి వచ్చిన హైదర్ అలీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. 1993 చెన్నైలోని ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయంలో బాంబుపేలి 11 మంది దుర్మరణం చెందారు. ఆ తరువాత కూడా రాష్ట్రంలో వరుసగా హిందూ నేతలపై దాడులు చోటుచేసుకున్నాయి.
ఈ సంఘటనల వెనుక హైదర్ అలీ, బాషా అనే మరో తీవ్రవాది సహా మొత్తం 20 మందిపై కేసులు పెట్టారు. అప్పటి నుంచి ఈ ముఠాకోసం పోలీసులు గాలించని ప్రదేశం లేదు. తీవ్రవాది హైదర్ అలీ కేరళలో దాక్కుని ఉన్నట్లు సమాచారం అందింది. తన ఉనికి తెలియకుండా పాల్‌ఘాట్‌లోని ఒక వస్త్రదుకాణంలో గుమాస్తాగా పనిచేస్తున్నట్లు తెలుసుకున్న రాష్ట్ర సీబీసీఐడీ పోలీసులు మంగళవారం ఆకస్మికంగా దుకాణాన్ని ముట్టడించి హైదర్ అలీని అరెస్ట్ చేశారు. కోవై కోర్టులో 1989లో బెయిల్‌పై బైటకు వచ్చిన హైదర్ అలీ 8 ఏళ్లపాటూ సౌదీ ఆరేబియాలో తలదాచుకున్నాడు. ఆ తరువాత కేరళకు చేరుకున్నట్లు భావిస్తున్నారు.
ఇతనితోపాటూ సిద్దిక్ అనే తీవ్రవాది కోసం 19 ఏళ్లుగా పోలీసులు గాలిస్తున్నారు. చెన్నై సెంట్రల్‌లో గువాహటి ఎక్స్‌ప్రెస్ బోగీలో పేలుడుపై జరుగుతున్న విచారణ లో ఇంతవరకు నిందితుని ఆచూకీ తెలియలేదు. పట్టుపడిన హైదర్ అలీకి ఇందులో ప్రమేయం ఉండొచ్చని అనుమానిస్తున్నారు. కేరళలో మంగళవారం పట్టుబడిన హైదర్ అలీని బుధవారం కోయంబత్తూరు కోర్టులో ప్రవేశపెట్టగా ఈనెల 17వ తేదీ వరకు రిమాండ్ విధించారు. కోర్టు అనుమతితో అతన్ని పోలీస్ కస్టడీకి తీసుకుని విచారించడం ద్వారా ఇతర కేసుల్లోని మిస్టరీని ఛేదించే దుకు, అజ్ఞాతంలో ఉన్న సిద్దిక్, బాషాల అచూకీ తెలుసుకునేందుకు సీబీసీఐడీ పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.