'నేను బెండ్ అవలేను.. అందుకే లేస్ కట్టాడు'
న్యూఢిల్లీ: 'నేను వీఐపీని.. నా షూలేస్ కట్టు' అంటూ సెక్యూరిటీ అధికారిచే అనుచిత పని చేయించిన ఒడిశా మంత్రి జోగేంద్ర బెహరా మాట మార్చారు. భిన్నవర్గాల నుంచి ఆయన చర్యపై తీవ్ర విమర్శలు రావడంతో వెంటనే స్వరం మార్చి తన ఆరోగ్య పరిస్థితి బాగోలేదని, అందుకే షూ లేస్ కట్టాలని చెప్పానని అన్నారు.
తాను కిందికి ఒంగి అలా చేయలేకపోవడం వల్లే ఆ అధికారికి చెప్పినట్లు తెలిపారు. 'నా ఎడమకాలికి బాగా నొప్పి. నేను ఒంగి ఏ పని చేయలేను. ఆ అధికారి నా షూలేస్ కట్టి ఉండొచ్చు.. అతడు నాకు కుమారుడిలాంటివాడు. నేను గత కొద్ది రోజులుగా ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్సకు వెళుతున్నాను. కావాలంటే మీకు మెడిసిన్ తీసుకున్న రశీదులు కూడా చూపించగలను' అని అన్నారు.