‘కాంగ్రెస్‌కు ప్రచారం చేయను.. అన్న చెబితే ఓకే’
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ తరుపున తాను ప్రచారం చేయబోనని సమాజ్‌వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ సోదరుడు శివపాల్ యాదవ్ స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ప్రస్తుతం సమాజ్‌వాది పార్టీ, కాంగ్రెస్‌పార్టీ కూటమిగా ఏర్పడి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రెండు పార్టీలు ఉమ్మడిగా ప్రచార కార్యక్రమాల్లోపాల్గొంటున్నాయి. అయితే, తాను మాత్రం కాంగ్రెస్ ప్రచారంలో పాల్గొనబోనని శివపాల్ చెప్పారు.
అయితే, తన సోదరుడు చెబితే అప్పుడు వెళతానని, తాను ఒక్క ఎస్పీకి మాత్రమే ప్రచారం చేస్తానని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో తాను ఎస్పీ టికెట్‌పై పోటీ చేయడం తప్పనిసరి పరిస్థితి అని, మార్చి 11 వరకు ఆ పార్టీతోనే ఉంటానని, ఒక వేళ ఎన్నికల ఫలితాల తర్వాత కూడా తనకు ఎలాంటి అవమానం ఎదురవకుంటే అప్పుడు పరిస్థితిని బట్టి ముందుకెళతానని చెప్పారు. అఖిలేశ్ వర్గానికి చెందిన నేతలు తనను పదేపదే అవమానిస్తున్నారని, ఈనేపథ్యంలో తాను కొత్త పార్టీ పెడతానని గతంలోనే శివపాల్ యాదవ్ ప్రకటించిన విషయం తెలిసిందే. అసలు పార్టీ పెట్టబోరని ములాయం చెప్పారు. అయినప్పటికీ శివపాల్ చేసిన తాజా వ్యాఖ్యల ప్రకారం ఆయన ఇప్పటికీ తీవ్ర అసంతృప్తితోనే ఉన్నట్లు తెలుస్తోంది.