ఎన్‌కౌంటర్లు.. ఎన్నిరకాలు?
అస్సాంలో బ్రహ్మపుత్ర నదికి ఉత్తర ఒడ్డున మార్చి 30వ తేదీన ‘డెమొక్రాటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్’కు చెందిన ఇద్దరు తిరుగుబాటుదారులు డేవిడ్ ఇస్లారీ, లూకాస్ నర్జరీలను ఓ సంయుక్త భద్రతాదళం మట్టుబెట్టింది. ఆర్మీ, సీఆర్‌పీఎఫ్, సశస్త్ర సీమాబల్, అస్సాం పోలీసులకు చెందిన సంయుక్త దళం ఎంతో కష్టపడి ఈ ఇద్దరు తిరుగుబాటుదారులను మట్టుబెట్టినట్లు ఫొటోల సాక్షిగా మీడియాను, ప్రభుత్వ విభాగాలను నమ్మించింది. ఈ సంఘటనపై దర్యాప్తు జరిపిన ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజీపీ) రజనీష్ రాయ్ అది బూటకపు ఎన్‌కౌంటర్ అని తేల్చారు.
బ్రహ్మపుత్ర నది సాక్షిగా భూటాన్, బంగ్లాదేశ్ సరిహద్దులో ఉన్న అస్సాం అటవీ ప్రాంతంలో ఎన్నో ఏళ్లుగా ఇలాంటి బూటకపు ఎన్‌కౌంటర్లు జరుగుతున్నాయని రజనీష్ రాయ్ దిగ్భ్రాంతికరమైన విషయాలు వెల్లడించారు. ఆయన ఎన్‌కౌంటర్లను మూడు రకాలుగా విశ్లేషించారు. తిరుగుబాటుదారులు లేదా మిలిటెంట్లు, భద్రతా బలగాలు పరస్పరం ఎదురైనప్పుడు కాల్పులు జరుపుకోవడం అసలైన ఎన్‌కౌంటర్ అని, లొంగిపోయిన మిలిటెంట్లను పట్టుకెళ్లి చంపేయడం రెండో రకమని, నేరస్థులను, చిల్లర దొంగలను, ఈ నేరం చేయని అమాయకులను పట్టుకెళ్లి నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపడం మూడో రకం అని ఆయన వివరించారు.
దేశంలో ఎక్కువ సార్లు, ముఖ్యంగా అస్సాంలో రెండోరకం, మూడో రకం ఎన్‌కౌంటర్లే జరుగుతుంటాయని రాయ్ తన నివేదికలో పేర్కొన్నారు. రెండోరకాన్ని నకిలీ అని, మూడోరకాన్ని బూటకపు ఎన్‌కౌంటర్లు అని అనవచ్చని చెప్పారు. ఉన్నతాధికారుల ఒత్తిళ్లు ఎక్కువైనప్పుడు ఈ రెండు రకాల ఎన్‌కౌంటర్లు చోటు చేసుకుంటున్నాయని ఆయన చెప్పారు. ఈ ఎన్‌కౌంటర్లకు భద్రతా బలగాలు నకిలీ నెంబర్ ప్లేట్లు గల వాహనాలను, ముఖ్యంగా మారుతీ వ్యాన్లను ఉపయోగిస్తాయని చెప్పారు. బాధితులను ఓ వాహనం నుంచి మరో వాహనంలోకి తరలించేందుకు వీలుగా ఉంటుందనే ఉద్దేశంతోనే స్లైడింగ్ తలుపులు ఉండే మారుతీ వ్యాన్లను ఉపయోగిస్తాయని అన్నారు.
ఈ నకిలీ, బూటకపు ఎన్‌కౌంటర్ల కోసం ఆయుధాలు సరఫరా చేసే ముఠాలు కూడా అస్సాంలో ఎక్కువగానే ఉన్నాయని, వారికి డబ్బులిస్తే వారు ఆయుధాలు సరఫరా చేస్తారని చెప్పారు. నిజమైన ఎన్‌కౌంటర్ అని నమ్మించడం కోసం అడ్డదిడ్డంగా పడేసిన మృతదేహాల భంగిమను బట్టి ఆయుధాలను అమర్చుతారని అన్నారు. అన్నింటికన్నా బాధాకరమైన ది బూటకపు ఎన్‌కౌంటర్ అని, మిలిటెంట్ల హెడ్‌కౌంటే కావాల్సి వచ్చినప్పుడు ఉన్నతాధికారుల ఒత్తిళ్లకు లొంగిపోయి ఇతర కేసుల్లో అరెస్టయిన వారిని, చిల్లర దొంగలను, వారూ దొరకనప్పుడు భూటాన్ నుంచో, బంగ్లాదేశ్ నుంచో పొరపాటున సరిహద్దులు దాటి వచ్చిన అమాయకులను పట్టుకెళ్లి కాల్చి చంపుతారని ఆయన వివరించారు. చిల్లర దొంగలను, అమాయకులను పట్టుకెళ్లినప్పుడు వాళ్లను కొన్ని రోజులు రహస్యంగా నిర్బంధించి ఉంచుతారని, వారి గురించి గల్లంతయిన ఫిర్యాదులు వస్తాయా లేదా అన్న తేల్చుకోవడం కోసమే ఈ నిర్బంధమని ఆయన చెప్పారు. వారి గురించి ఎవరు ఫిర్యాదు చేయకపోతే వారి ఎన్‌కౌంటర్ త్వరగా పూర్తవుతుందని అన్నారు.
ఈ ఎన్‌కౌంటర్లకు సంబంధించి సైనిక, పారా మిలటరీ దళాలకు, స్థానిక పోలీసులకు మధ్య మంచి సహకారం ఉంటుందని, ఎన్‌కౌంటర్ క్రెడిట్ రెండు విభాగాలకు దక్కడమే కాకుండా ఆర్థికపరమైన, సర్వీసు పరమైన ప్రయోజనాలు కూడా ఎన్నో ఉంటాయని రాయ్ తెలిపారు. ప్రశంసాపత్రాలు, మెడళ్లతో పాటు ఇంక్రిమెంట్లు, రిస్క్ అలవెన్సులు లభిస్తాయని చెప్పారు. ఎక్కువ ఎన్‌కౌంటర్లు చేసిన వారిని ఎన్‌కౌంటర్లు అవసరమైన చోటుకు పంపించడం కూడా ఓ ఆనవాయితీగా వస్తోందని అన్నారు. ఉన్నతాధికారుల ఒత్తిళ్లతోపాటు స్వీయ ఆర్థిక ప్రయోజనాలు కూడా ఉండటంతో నకిలీ, బూటకపు ఎన్‌కౌంటర్ల వైపు భద్రతా బలగాలు మొగ్గు చూపిస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్‌కౌంటర్లే కాకుండా మీడియా సమక్షంలో పోలీసుల ముందు ఆయుధాలను అప్పగించి మిలిటెంట్లు లేదా తిరుగుబాటుదారులు లొంగిపోయినట్లు చూపించడంలో కూడా చాలావరకు బూటకమేనని రాయ్ తెలిపారు. సాధారణంగా చిల్లర దొంగలను, అమాయకులను డబ్బులు ఎరవేసి ఈ బూటకపు లొంగుబాటును సృష్టిస్తారని చెప్పారు. లొంగిపోయిన వారు ఓ మూడు నెలలపాటు జైల్లో ఉండాల్సి వస్తోందని, అప్పుడు వారి కుటుంబాలను పోషించాల్సిన బాధ్యతను భద్రతా దళాలే తీసుకుంటాయని అన్నారు. వారు లొంగుబాటు సందర్భంగా అప్పగించే ఆయుధాలు కూడా అక్రమ ఆయుధాల సరఫరాల ముఠాలు అందించేవేనంటూ రాయ్ బాంబు పేల్చారు.
(గమనిక: ఎన్‌కంటర్లపై అస్సాం ప్రధాన కార్యదర్శి పైపర్‌సైనా, సీఆర్‌పీఎఫ్ డైరెక్టర్ జనరల్ సుదీప్ లక్టాకియాలకు రజనీష్ రాయ్ అందజేసిన నివేదికలోని అంశాలివి)