fake encounters
-
సీబీఐపై సుప్రీం ఆగ్రహం
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)పై అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. మణిపూర్ నకిలీ ఎన్కౌంటర్లపై విచారణలో తీవ్ర జాప్యం చేస్తున్నారంటూ సీబీఐ డైరెక్టర్ అలోక్ కుమార్ వర్మకు శుక్రవారం సమన్లు జారీ చేసింది. మణిపూర్ నకిలీ ఎన్కౌంటర్లపై విచారణ ఎందుకు ఆలస్యం జరుగుతోందో తగిన కారణాలను జూలై 30 లోపు తన ముందుంచాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. విచారణ ప్రకియను వేగవంత చేయడానికి సంస్థ అనుసరించే విధానం ఏమిటో తనకు తెలపాలని న్యాయస్థానం సీబీఐని కోరింది. భారత సైన్యం, అస్సాం రైఫిల్స్, మణిపూర్ పోలీసులు జరిపిన ఎన్‌కౌంటర్ల్‌పై 2016లో సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైన విషయం తెలిసిందే. సాయుధ దళాలు ప్రత్యేక అధికారాల చట్టం (ఎస్‌ఎఫ్‌ఎస్‌పీఏ) అమలులో ఉన్న మణిపూర్‌లో గడిచిన పదేళ్లల్లో 1528 నకిలీ ఎన్కౌంటర్లు జరిపినట్లు పిటిషన్లో పేర్కొన్నారు. పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టీస్ మదన్ బీ లోకూర్, జిస్టీస్ యూ యూ లలిత్‌లతో కూడిన ధర్మాసనం ఎన్‌కౌంటర్ల్‌పై విచారణ జరపవల్సిందిగా సీబీఐని ఆదేశించింది. మణిపూర్‌లో సైన్యం, అస్సాం రైఫిల్స్, పోలీసుల బలగాలు పాల్పడిన మానవ హక్కుల ఉల్లంఘనపై సుప్రీంకోర్టు తీవ్రం ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. నకిలీ ఎన్కౌంటర్లలో పౌరులు ప్రాణాలు కోల్పోయినందున తీవ్ర ప్రాముఖ్యత గల విషయంగా పరిగణిస్తున్నట్లు న్యాయస్థానం పేర్కొంది. -
హక్కుల ఉల్లంఘనలను సహించబోం
న్యూఢిల్లీ: మానవ హక్కుల ఉల్లంఘనలపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ఇటువంటి ఘటనలను సహించేది లేదని స్పష్టం చేసింది. మణిపూర్‌లో సైన్యం, అస్సాం రైఫిల్స్, పోలీసు బలగాలు పాల్పడిన నాలుగు నకిలీ ఎన్కౌంటర్లపై ఈ నెల 27లోగా తుది నివేదిక ఇవ్వాలని సీబీఐను ఆదేశించింది. ఈ ఎన్కౌంటర్లలో పౌరులు ప్రాణాలు కోల్పోయినందున తీవ్ర ప్రాముఖ్యత గల విషయంగా పరిగణిస్తున్నట్లు పేర్కొంది. జస్టిస్ మదన్ బీ లోకూర్, జస్టిస్ యుయు లలిత్‌ల బెంచ్ గురువారం ఈ కేసు విచారణ చేపట్టింది. తమ విచారణ పూర్తయిందని, తుది నివేదిక రూపొందించే పనిలో ఉన్నామని సీబీఐ ప్రత్యేక విచారణ బృందం(సిట్) కోర్టుకు తెలిపింది. దీంతోపాటు మణిపూర్‌లో జరిగిన 41 ఎన్కౌంటర్లపై సిట్ దర్యాప్తు కొనసాగుతోందనీ, ఇప్పటివరకు 20 కేసుల్లో దర్యాప్తు పూర్తికావొచ్చిందని అదనపు సొలిసిటర్ జనరల్(ఏఎస్జీ) మణీందర్ సింగ్ తెలిపారు. స్పందించిన న్యాయస్థానం ‘మానవ హక్కుల ఉల్లంఘన గురించి మాత్రమే కాదు, మరణాలను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నాం. అవి హత్యలా? కాదా? మానవ హక్కుల కంటే ఈ అంశానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాం’ అని పేర్కొంది. -
‘యోగి.. నువ్వేం ముఖ్యమంత్రివి?’
లక్నో : ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌పై సమాజ్‌వాదీ పార్టీ నేత రామ్ గోపాల్ యాదవ్ విరుచుకుపడ్డారు. సీఎం హోదాలో ఉండి నోటికొచ్చినట్లు మాట్లాడటం మంచిది కాదని యోగికి రామ్ గోపాల్ సూచించారు. (సల్మాన్ గెటప్‌లో యోగి.. వైరల్) శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ‘ప్రధాని నరేంద్ర మోదీ తర్వాత.. యోగి పైనే ఇప్పుడు దేశవ్యాప్తంగా విమర్శలు వినిపిస్తున్నాయి. అందుకు ఆయన తీసుకుంటున్న నిర్ణయాలే కారణం. ముఖ్యమంత్రి హోదాలో ఉండి ‘లేపేస్తాం.. చంపి పడేస్తాం’ అంటూ యోగి మాట్లాడుతున్నారు. ఓ సీఎం హోదాలో ఉన్న వ్యక్తి మాట్లాడే మాటలేనా అవి. ఆయన అధికారంలోకి వచ్చాక ఫేక్ ఎన్కౌంటర్లు ప్రతీ రోజూ జరుగుతున్నాయి. బీజేపీ ప్రభుత్వం అమాయకులు ప్రాణాలను బలితీసుకుంటోంది. ప్రజలు అంతా గమనిస్తున్నారు. సరైన సమయంలో బుద్ధి చెబుతారు’ అని రామ్ గోపాల్ యాదవ్ విమర్శించారు. కాగా, శుక్రవారం ముజఫర్ నగర్లో జరిగిన ఎన్కౌంటర్లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఒకడు తప్పించుకుని పోయాడు. ఈ కాల్పుల్లో అధికారి ఒకరు గాయపడగా.. ఎన్కౌంటర్ జరిగిన తీరుపై మీడియాలో రకరకాల కథనాలు ప్రసారం అయ్యాయి. ఈ నేపథ్యంలోనే రామ్‌గోపాల్ యాదవ్ యోగి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
బుల్లెట్‌కి బుల్లెట్టే సమాధానమా?
బుల్లెట్‌కి బుల్లెట్ ఎప్పుడూ సమాధానం కాదు. పోలీసులకి చట్టాన్ని మించిన అధికారాలు ఇస్తే జిమ్ ట్రైనర్ లాంటి వ్యక్తులు బలయ్యే అవకాశం ఉంది. మరణ శిక్షను తొలగించాలన్న వాదన బలపడుతున్న దశలో బూటకపు ఎన్కౌంటర్లు ఎంతవరకు సమంజసం? గత వారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 18 ఎన్కౌంటర్లు జరిగాయి. గత సంవత్సరం మార్చి నెల నుంచి ఇప్పటివరకు దాదాపు 34 మంది ఎన్కౌంటర్లలో మరణించారు? ఎన్కౌంటర్ల రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ ప్రసిద్ధి చెందుతోంది. ఎలాంటి కారణాలు లేకుండా ఇద్దరు వ్యక్తులు పోలీసు కాల్పుల్లో గాయపడ్డారు. వాళ్ల తప్పిదం ఉన్నట్టు ఎలాంటి వార్తలు ఇప్పటివరకు రాలేదు. ఒక వ్యక్తి జిమ్ ట్రైనర్. రెండవ వ్యక్తి అతని సన్నిహితుడు. ఓ వివాహానికి హాజరై ఇంటికి వెళ్తున్నప్పుడు పోలీసులు వాళ్లను ఆపి కాల్చారు. అక్కడ ఎలాంటి ఎదురు కాల్పులు లేవు. అది ఎన్కౌంటర్ అని, ఆ వ్యక్తుల బంధువులు, వ్యక్తిగత కారణాలవల్ల కాల్చారని పోలీసులు అంటున్నారు. ఈ సంఘ టనలో పాలుపంచుకున్న పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ని అరెస్టు చేశారు. ముగ్గురు పోలీసులని సస్పెండ్ చేశారు. న్యాయపాలన ఉన్న మన దేశంలో ఎన్కౌంటర్లు కొత్త కాదు. ఏ రాష్ట్రమూ దానికి మినహాయింపు కాదు. పోలీసుల చర్యల్లో వ్యక్తులు మరణించినప్పుడు ఆ చర్యలని ఆత్మరక్షణార్థం జరిపిన కాల్పులని పోలీసులు చెబుతారు. బూటకపు ఎన్కౌంటరని ప్రజాసంఘాలు అంటూ ఉంటాయి. పోలీసులు చేసే ఎన్కౌంటర్ మరణాల్లో ఆత్మరక్షణ అనేది అరుదుగా ఉంటుంది. ఎందుకంటే అవి దాదాపు కావాలని చేసినవి కావొచ్చు లేదా ప్రతీకారంతో చేసినవి కావొచ్చు. ఆత్మరక్షణ కోసం చేసిన వాటిని, ప్రతీకారంతో చేసిన వాటిని స్పష్టంగా తెలుసుకోవచ్చు. ఎదుటి వ్యక్తిని చంపితే తప్ప అతని నుంచి ప్రాణాన్ని రక్షించుకోలేని పరిస్థితుల్లోనే ఆత్మరక్షణ కోసం అతణ్ని చంపే అవకాశం ఉంటుంది. అంతే తప్ప మిగతా సందర్భాలలో లేదు. ఎదుటి వ్యక్తుల దగ్గర ఎలాంటి ఆయుధాలు లేనప్పుడు చంపితే అది ఆత్మరక్షణ కోసం చేసినదిగా భావించే అవకాశం లేదు. ఎదుటి వ్యక్తులని పట్టుకునే అవకాశం ఉన్నప్పుడు కూడా కాల్పులు జరిపి చంపితే అది ప్రతీకార చర్య అవుతుంది. ఈ విషయాన్ని సుప్రీం కోర్టు ‘ఎక్స్ట్రా జ్యుడీషియల్ ఎగ్జిబిషన్ విక్టిమ్ ఫ్యామిలీస్ అసో సియేషన్, ఇతరులు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఏ.ఐ.ఆర్ 2016 సుప్రీంకోర్టు 3400)’ కేసులో చెప్పింది. ఎవరిమీద అయితే దాడి జరిగిందో ఆ వ్యక్తి అవసరమైన దానికన్నా ఎక్కువ బలాన్ని ఉపయోగిస్తే ఆ వ్యక్తే దురాక్రమణదారు అవుతాడు. అతను శిక్షార్హుడవుతాడు. ఒకవేళ ‘రాజ్యం’ దాని ప్రతినిధులు అవసరమైన దానికన్నా, ఎక్కువ బలాన్ని ఉపయోగించి మొదటి దురాక్రమణదారుని చంపితే అది న్యాయేతర మరణం అవుతుంది. (ఎక్స్ట్రా జ్యుడీషియల్ కిల్లింగ్). దురాక్రమణదారు తనని చంపుతాడన్న నిజమైన భయాందోళన ఉన్నప్పుడు ఆత్మరక్షణ అనేది అమల్లోకి వస్తుంది. కానీ ప్రతీకారం తీర్చు కునేందుకు కాదు. (దర్శన్‌సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్, ఏ.ఐ.ఆర్ 2010 సుప్రీంకోర్టు 1212). చాలా ఎన్కౌంటర్లు ఆత్మరక్షణ కోసం చేసినవి కాదు. ప్రతీకారం కోసమో లేదా కావాలని చంపినవి మాత్రమే. వీటి విషయంలో సరైన దర్యాప్తు జరిగితే ఈ విషయాలు బయటకు వస్తాయి. అపాయకరమైన వ్యక్తులని, తీవ్రమైన నేరాలు చేసిన వ్యక్తులని పోలీసులు చంపుతూ ఉంటారు. ఉత్తరప్రదేశ్‌లో ఆ విధంగా జరుగు తుందన్న ఆరోపణలు ఉన్నాయి. ‘ఓంప్రకాశ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ జార్ఖండ్ 2012 (12) ఎన్.సి.సి. 72’ కేసులో సుప్రీంకోర్టు ఈ విధంగా అభిప్రా యపడింది. ‘‘అపాయకరమైన నేరస్తులన్న కారణంగా వాళ్లను పోలీ సులు మట్టుపెట్టడానికి వీల్లేదు. వాళ్లని అరెస్టు చేసి కోర్టుకి పంపిం చాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది’’. దురాక్రమణదారు ఎవరు అన్నది తెలుసుకోవడం కోసం దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉంది. బాధితుల అసోసియేషన్ దాఖలు చేసిన కేసులో ఈ విషయమే సుప్రీంకోర్టు చెప్పింది. మానవ హక్కుల జాతీయ కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ఎన్కౌంటర్లు జరిగిన ప్పుడు సి.బి.సి.ఐ.డి. ద్వారా గానీ వేరే ఏజెన్సీ ద్వారాగానీ దర్యాప్తు జరిపించాలి. పి.యు.సి.ఎల్ వర్సెస్ సివిల్ లిబర్టీస్ 2015 క్రిమినల్ జర్నల్ 610 కేసులో ఈ మార్గదర్శకాలు పాటించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. భారతీయ శిక్షాస్మృతిలోని ఆత్మరక్షణ నిబంధనలు ఏమి చెప్పినా, సుప్రీంకోర్టు ఎన్ని తీర్పులు చెప్పినా మానవ హక్కుల కమిషన్ ఎన్ని మార్గదర్శకాలు జారీ చేసినా మన దేశంలో ఎన్కౌంటర్ల విషయంలో ఎలాంటి గుణాత్మకమైన మార్పు కన్పించడం లేదు. బుల్లెట్‌కి బుల్లెట్ ఎప్పుడూ సమాధానం కాదు. పోలీసులకి చట్టాన్ని మించిన అధికారాలు ఇస్తే జిమ్ ట్రైనర్ లాంటి వ్యక్తులు బలయ్యే అవకాశం ఉంది. మరణ శిక్షను తొలగించాలన్న వాదన బలపడు తున్న దశలో బూటకపు ఎన్కౌంటర్లు ఎంతవరకు సమంజసం? ఎలాంటి దర్యాప్తూ, కోర్టు విచారణలు లేకుండా క్రిమినల్స్‌కి, ఆ పేరుతో మరికొందరిని మట్టుపెట్టవచ్చు. వాళ్లలో భయాన్ని కలిగించ వచ్చు. క్రిమినల్స్ ఈ విధంగా పెరగడానికి కారణాలను నిరోధించడా నికి తగు చర్యలని అన్వేషించకుండా చంపడం అనేది ఎప్పుడూ సమా ధానం కాదు. ఈ చర్యలు న్యాయపాలనకి విఘాతం కలిగిస్తాయి. మన రాజ్యాం గాన్ని, శాసనాలని లెక్క చేయకపోవడం ఎంతవరకు సమంజసం? - మంగారి రాజేందర్ వ్యాసకర్త కవి, రచయిత మొబైల్ : 94404 83001 -
ఎన్కౌంటర్లు.. ఎన్నిరకాలు?
అస్సాంలో బ్రహ్మపుత్ర నదికి ఉత్తర ఒడ్డున మార్చి 30వ తేదీన ‘డెమొక్రాటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్’కు చెందిన ఇద్దరు తిరుగుబాటుదారులు డేవిడ్ ఇస్లారీ, లూకాస్ నర్జరీలను ఓ సంయుక్త భద్రతాదళం మట్టుబెట్టింది. ఆర్మీ, సీఆర్పీఎఫ్, సశస్త్ర సీమాబల్, అస్సాం పోలీసులకు చెందిన సంయుక్త దళం ఎంతో కష్టపడి ఈ ఇద్దరు తిరుగుబాటుదారులను మట్టుబెట్టినట్లు ఫొటోల సాక్షిగా మీడియాను, ప్రభుత్వ విభాగాలను నమ్మించింది. ఈ సంఘటనపై దర్యాప్తు జరిపిన ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజీపీ) రజనీష్ రాయ్ అది బూటకపు ఎన్కౌంటర్ అని తేల్చారు. బ్రహ్మపుత్ర నది సాక్షిగా భూటాన్, బంగ్లాదేశ్ సరిహద్దులో ఉన్న అస్సాం అటవీ ప్రాంతంలో ఎన్నో ఏళ్లుగా ఇలాంటి బూటకపు ఎన్కౌంటర్లు జరుగుతున్నాయని రజనీష్ రాయ్ దిగ్భ్రాంతికరమైన విషయాలు వెల్లడించారు. ఆయన ఎన్కౌంటర్లను మూడు రకాలుగా విశ్లేషించారు. తిరుగుబాటుదారులు లేదా మిలిటెంట్లు, భద్రతా బలగాలు పరస్పరం ఎదురైనప్పుడు కాల్పులు జరుపుకోవడం అసలైన ఎన్కౌంటర్ అని, లొంగిపోయిన మిలిటెంట్లను పట్టుకెళ్లి చంపేయడం రెండో రకమని, నేరస్థులను, చిల్లర దొంగలను, ఈ నేరం చేయని అమాయకులను పట్టుకెళ్లి నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపడం మూడో రకం అని ఆయన వివరించారు. దేశంలో ఎక్కువ సార్లు, ముఖ్యంగా అస్సాంలో రెండోరకం, మూడో రకం ఎన్కౌంటర్లే జరుగుతుంటాయని రాయ్ తన నివేదికలో పేర్కొన్నారు. రెండోరకాన్ని నకిలీ అని, మూడోరకాన్ని బూటకపు ఎన్కౌంటర్లు అని అనవచ్చని చెప్పారు. ఉన్నతాధికారుల ఒత్తిళ్లు ఎక్కువైనప్పుడు ఈ రెండు రకాల ఎన్కౌంటర్లు చోటు చేసుకుంటున్నాయని ఆయన చెప్పారు. ఈ ఎన్కౌంటర్లకు భద్రతా బలగాలు నకిలీ నెంబర్ ప్లేట్లు గల వాహనాలను, ముఖ్యంగా మారుతీ వ్యాన్లను ఉపయోగిస్తాయని చెప్పారు. బాధితులను ఓ వాహనం నుంచి మరో వాహనంలోకి తరలించేందుకు వీలుగా ఉంటుందనే ఉద్దేశంతోనే స్లైడింగ్ తలుపులు ఉండే మారుతీ వ్యాన్లను ఉపయోగిస్తాయని అన్నారు. ఈ నకిలీ, బూటకపు ఎన్కౌంటర్ల కోసం ఆయుధాలు సరఫరా చేసే ముఠాలు కూడా అస్సాంలో ఎక్కువగానే ఉన్నాయని, వారికి డబ్బులిస్తే వారు ఆయుధాలు సరఫరా చేస్తారని చెప్పారు. నిజమైన ఎన్కౌంటర్ అని నమ్మించడం కోసం అడ్డదిడ్డంగా పడేసిన మృతదేహాల భంగిమను బట్టి ఆయుధాలను అమర్చుతారని అన్నారు. అన్నింటికన్నా బాధాకరమైన ది బూటకపు ఎన్కౌంటర్ అని, మిలిటెంట్ల హెడ్కౌంటే కావాల్సి వచ్చినప్పుడు ఉన్నతాధికారుల ఒత్తిళ్లకు లొంగిపోయి ఇతర కేసుల్లో అరెస్టయిన వారిని, చిల్లర దొంగలను, వారూ దొరకనప్పుడు భూటాన్ నుంచో, బంగ్లాదేశ్ నుంచో పొరపాటున సరిహద్దులు దాటి వచ్చిన అమాయకులను పట్టుకెళ్లి కాల్చి చంపుతారని ఆయన వివరించారు. చిల్లర దొంగలను, అమాయకులను పట్టుకెళ్లినప్పుడు వాళ్లను కొన్ని రోజులు రహస్యంగా నిర్బంధించి ఉంచుతారని, వారి గురించి గల్లంతయిన ఫిర్యాదులు వస్తాయా లేదా అన్న తేల్చుకోవడం కోసమే ఈ నిర్బంధమని ఆయన చెప్పారు. వారి గురించి ఎవరు ఫిర్యాదు చేయకపోతే వారి ఎన్కౌంటర్ త్వరగా పూర్తవుతుందని అన్నారు. ఈ ఎన్కౌంటర్లకు సంబంధించి సైనిక, పారా మిలటరీ దళాలకు, స్థానిక పోలీసులకు మధ్య మంచి సహకారం ఉంటుందని, ఎన్కౌంటర్ క్రెడిట్ రెండు విభాగాలకు దక్కడమే కాకుండా ఆర్థికపరమైన, సర్వీసు పరమైన ప్రయోజనాలు కూడా ఎన్నో ఉంటాయని రాయ్ తెలిపారు. ప్రశంసాపత్రాలు, మెడళ్లతో పాటు ఇంక్రిమెంట్లు, రిస్క్ అలవెన్సులు లభిస్తాయని చెప్పారు. ఎక్కువ ఎన్కౌంటర్లు చేసిన వారిని ఎన్కౌంటర్లు అవసరమైన చోటుకు పంపించడం కూడా ఓ ఆనవాయితీగా వస్తోందని అన్నారు. ఉన్నతాధికారుల ఒత్తిళ్లతోపాటు స్వీయ ఆర్థిక ప్రయోజనాలు కూడా ఉండటంతో నకిలీ, బూటకపు ఎన్కౌంటర్ల వైపు భద్రతా బలగాలు మొగ్గు చూపిస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్కౌంటర్లే కాకుండా మీడియా సమక్షంలో పోలీసుల ముందు ఆయుధాలను అప్పగించి మిలిటెంట్లు లేదా తిరుగుబాటుదారులు లొంగిపోయినట్లు చూపించడంలో కూడా చాలావరకు బూటకమేనని రాయ్ తెలిపారు. సాధారణంగా చిల్లర దొంగలను, అమాయకులను డబ్బులు ఎరవేసి ఈ బూటకపు లొంగుబాటును సృష్టిస్తారని చెప్పారు. లొంగిపోయిన వారు ఓ మూడు నెలలపాటు జైల్లో ఉండాల్సి వస్తోందని, అప్పుడు వారి కుటుంబాలను పోషించాల్సిన బాధ్యతను భద్రతా దళాలే తీసుకుంటాయని అన్నారు. వారు లొంగుబాటు సందర్భంగా అప్పగించే ఆయుధాలు కూడా అక్రమ ఆయుధాల సరఫరాల ముఠాలు అందించేవేనంటూ రాయ్ బాంబు పేల్చారు. (గమనిక: ఎన్కంటర్లపై అస్సాం ప్రధాన కార్యదర్శి పైపర్సైనా, సీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ సుదీప్ లక్టాకియాలకు రజనీష్ రాయ్ అందజేసిన నివేదికలోని అంశాలివి) -
ఉక్కుమహిళ కల నెరవేరుతుందా..!
న్యూఢిల్లీ: మణిపూర్ ఉక్కుమహిళ ఇరోమ్ షర్మిళ కల సాకారం అయ్యేట్టు కనిపిస్తుంది. తమ రాష్ట్రంలో ప్రత్యేక సాయుధ బలగాలను ఉపసంహరించాలంటూ ఆమె గత పద్నాలుగేళ్లుగా చేస్తున్న దీక్షకు ప్రతిఫలం లభించే అవకాశం కలిగేలా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఆర్మీ, పారామిలిటరీ బలగాలు మితిమీరిన బలగాన్ని మణిపూర్‌లో మోహరించవద్దని, ఇష్టమొచ్చినట్లుగా ప్రతిదాడులు చేయొద్దని సుప్రీంకోర్టు సూచించింది. ఇప్పటి వరకు ఆ రాష్ట్రంలో జరిగిన 1500 ఫేక్ ఎన్ కౌంటర్లకు సంబంధించి ఓ స్వతంత్ర్య దర్యాప్తు సంస్థ ద్వారా విచారణ జరపాలని ఆదేశించింది. రెండు దశాబ్దాల కాలంగా మణిపూర్ లో ఎన్కౌంటర్లు జరుగుతున్నాయని కోర్టు గుర్తు చేసింది. మణిపూర్ లో ఏఎఫ్ఎస్పీఏ(సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం) అమలులో ఉన్న విషయం తెలిసిందే. దీని ప్రకారం ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఎవ్వరినైనా తమ అదుపులోకి తీసుకునే అధికారం సైనికులకు ఉండగా దానిని రద్దు చేయాలని షర్మిల దీక్ష చేస్తున్నారు.