బడ్జెట్పై ప్రముఖుల స్పందన | Important persons reaction on the Budget | Sakshi
Sakshi News home page

బడ్జెట్పై ప్రముఖుల స్పందన

Published Thu, Jul 10 2014 6:19 PM | Last Updated on Sat, Sep 2 2017 10:06 AM

మమత బెనర్జీ, కేజ్రీవాల్, అరుణ్ జైట్లీ, మల్లికార్జున ఖర్గే, ఏచూరి

మమత బెనర్జీ, కేజ్రీవాల్, అరుణ్ జైట్లీ, మల్లికార్జున ఖర్గే, ఏచూరి

న్యూఢిల్లీ: లోక్సభలో ఈ రోజు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ  ప్రవేశపెట్టిన దేశ వార్షిక బడ్జెట్ (2014 -2015)పై మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు బాగుందంటే, మరికొందరు తీవ్రస్థాయిలో విమర్శించారు. ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా స్పందించాయి.   జైట్లీ బడ్జెట్‌ కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా ఉందని ఆమ్‌ఆద్మీ పార్టీ అధ్యక్షుడు కేజ్రీవాల్ విమర్శించారు. ధరల భారం నుంచి ఉపశమనం కలుగుతుందని ఆశించిన సామాన్యుడి ఆశలను బడ్జెట్ అడియాశలు చేసిందని ఆయన ఆరోపించారు.  కీలకమైన రంగాల్లో విదేశీ పెట్టుబడులకు అనుమతించడాన్ని జెడియు  తప్పుబట్టింది. జైట్లీ బడ్జెట్‌ సామాన్యలకు కోతలు, సంపన్నులకు వరాలిచ్చిందని సీపీఎం ప్రధాన కార్యదర్శి  సీతారాం ఏచూరి ఆరోపించారు. బడ్జెట్‌లో ఏపీకు కాస్తా న్యాయం  జరిగిందని, ఇంకా న్యాయం జరగాల్సి ఉందని వైఎస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీకి చెందిన కర్నూలు  ఎంపీ బుట్టా రేణుక చెప్పారు. భవిష్యత్తులో న్యాయం జరుగుతుందని ఆశ ఉందని ఆమె అన్నారు. ప్రతి వ్యక్తి ఆరోగ్యం, సంపదలు వృద్ధిచెందాలని బడ్జెట్‌ కోరుకుంటోందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. అన్నిరంగాలు పునరుజ్జీవం చెందుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

 బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఒరిగిందేమీలేదని కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బరామిరెడ్డి అన్నారు. ఈ బడ్జెట్‌ను కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని ఆయన చెప్పారు.  కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్  ఆశాజనకంగా ఉందని,  గాడితప్పిన భారతదేశ ఆర్ధిక వ్యవస్థను  పట్టాలెక్కించే విధంగా ఉందని బీజేపీ  తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు  కిషన్ రెడ్డి  అన్నారు.  తెలంగాణ హార్టీ కల్చర్ యూనివర్సిటీ  రావడం సంతోషంగా ఉందని చెప్పారు.  వచ్చే బడ్జెట్ లోపు  తెలంగాణకు మరిన్ని నిధులు  తెచ్చే విధంగా  కృషి చేస్తామన్నారు. దేశంలో మౌళిక సదుపాయాలు పెంచి  ఉద్యోగకల్పన వచ్చే విధంగా, అన్ని ప్రాంతాలకు సమన్యాయం జరిగిందని ఆయన బడ్జెట్ను స్వాగతించారు. బడ్జెట్ తటస్దంగా వుందని ఎఫ్ఏపిసిసిఐ  అధ్యక్షుడు శివకుమార్ అన్నారు. దేశం లోని ఆర్దిక స్దితి గతులను బట్టి అన్ని వర్గాలకు ఉపయోగపడే విధంగా బడ్జెట్ వుందని ఆయన ఆభిప్రాయ పడ్డారు.

ప్రముఖుల అభిప్రాయాలు:
ఈ బడ్జెట్ నుంచి అతిగా ఆశించవద్దు - కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ
జైట్లీ బడ్జెట్‌ అమోఘం. ఈ బడ్జెట్‌ వాస్తవిక దృక్పథంతో ఉంది- హోంమంత్రి రాజ్‌నాథ్‌
బడ్జెట్‌ దూరదృష్టితో వచ్చింది - రైల్వేమంత్రి సదానంద గౌడ
వృద్ధిరేటుకు ఈ బడ్జెట్‌ చోదక శక్తి - కేంద్రమంత్రి అనంత్‌కుమార్‌
బడ్జెట్‌ నిరాశపరిచింది: బీహార్‌ మాజీ సీఎం నితీష్‌
పేదలను ఆదుకునేలా బడ్జెట్‌ లేదు: ఎన్సీపీ

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగింది. హార్టికల్చర్ యూనివర్సిటీ తప్ప  తెలంగాణకు కొత్తగా ఒరిగిందేమీ లేదు.
- తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు

బడ్జెట్‌ పేదలకు వ్యతిరేకంగా ఉంది. ప్రజలను చాలా నిరాశపరిచింది. ద్రవ్యోల్బణంతో పోరాడుతున్న సగటుమనిషికి ఏ అండా దొరకలేదు.
- లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్షనేత మల్లికార్జున ఖర్గే

ఇదొక అచేతన బడ్జెట్‌. దూరదృష్టీ, కార్యాచరణలేని బడ్జెట్‌. విదేశీ పెట్టుబడుల కోసం, పెట్టుబడుల చేత, పెట్టుబడు కొరకు ఈ బడ్జెట్‌ వచ్చింది.
- బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ

 ప్రజలు చాలా ఆశలు పెట్టుకుంటే, వారిని బడ్జెట్‌ వమ్ముచేసింది. సమాజంలో ఏ వర్గం క్షేమాన్ని బడ్జెట్‌ పట్టించుకోలేదు.
- ఆమ్‌ఆద్మీ పార్టీ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement