దాదర్‌లో దేవీ నవరాత్రుల సందడి
పండగ ఏర్పాట్లలో మండళ్లు నిమగ్నం
దాదర్, న్యూస్‌లైన్ : నగరంలో దేవీ నవరాత్రుల సందడి మొదలైంది. ప్రతీ ఏడాది మాదిరిగానే ఈ సారి కూడా అమ్మవారి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవడానికి మండళ్లు కృషి చేస్తున్నాయి. ఇప్పటికే ఆయా పనుల్లో మండళ్లు నిమగ్నమయ్యాయి.
ఉత్సవాలకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. అమ్మవారి విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరిస్తున్నారు. నవరాత్రులు పలు సేవా, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. రోజూ అమ్మవారికి విశేష పూజలతోపాటు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. తొమ్మిది రోజులు వివిధ రూపాల్లో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనుంది.
మాటుంగాలో...
మాటుంగా తూర్పులోని తెలంగ్ రోడ్ వద్ద ఉన్న వాసవీ నిలయంలో ది బొంబాయి ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో కన్యాకా పరమేశ్వరీ ఆలయంలో గురువారం ఉదయం 7 గంటలకు గణపతి పూజ నిర్వహించనున్నారు. కలశ స్థాపనం, వాసవీ హోమములతో దసరా ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 3వ తేదీ శుక్రవారం వరకు జరిగే ఈ ఉత్సవాలలో రోజూ కన్యకా పరమేశ్వరి అమ్మవారిని లక్ష్మీ, అన్నపూర్ణ, గాయత్రి, లలిత, దుర్గ, సరస్వతి, చండీ, రాజరాజేశ్వరి రూపాలతో అలంకరించి హోమాలు, విశేష పూజలు నిర్వహించనున్నారు. సాయంత్రం స్థానిక సంగీత కళాకారులు, భజన మండళ్లుతో సాంస్కృతిక కార్యక్రమాలుంటాయి. ప్రముఖ సంగీత కళాకారిణులు నల్లాన్ చక్రవర్తల సీతాదేవి బృందం (25వ తేదీ గురువారం), పద్మావతి త్యాగరాజు బృందం (27వ తేదీ), ఆర్.వి.లక్ష్మీమూర్తి బృందం (30 ), పి.సరళా రావు, దుర్గా సూరి బృందం చే సౌందర్యలహరి (01) ల భక్తి సంగీత కచేరీలు ఉంటాయి.
డోంబివలిలో...
డోంబివలి పశ్చిమం ఎంజీరోడ్ లోని రైల్వే స్టేషన్ సమీపంలో పశ్చిమ విభాగ్ సార్వజనిక్ నవరాత్రోత్సవ మండల్ ఆధ్వర్యంలో గురువారం నుంచి ఉత్సవాలు ప్రారంభించనున్నారు. ఉదయం 7 గంటలకు అమ్మవారికి విశేష పుష్పాలంకరణం, గణ హోమం, ప్రాణ ప్రతిష్టతోపాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. నవరాత్రోత్సవ మండల్ సువర్ణ జయంతి పురస్కరించుకొని ఈ సారి విశేష సాంస్కృతిక కార్యక్రమాలుంటాయి. మహారాష్ట్ర పారంపారిక లోక నృత్యాలు, భక్తి గీతాలు, నృత్యాలు, హాస్య సంధ్య, శ్రీ దేవీ మహాత్య యక్షగాన ద్రర్శనలు ఏర్పాటు చేశారు. స్థానిక బాల బాలికలను ప్రోత్సహించేందుకు పాటలు, నృత్య పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేయడానికి ఏర్పాటు చేశారు.