ప్రపంచంలో ఆనందమయ జీవనాన్ని సాగించే దేశాల్లో భారత్ స్థానం మరింత దిగజారింది. మొత్తం 156 దేశాల జాబితాలో మనదేశం 133 స్థానంతో (గతంలోని 122 ర్యాంక్ నుంచి) సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అదీకాకుండా సార్క్‌దేశాలతో (దక్షిణాసియా) పోల్చితే కూడా యుద్ధసంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న అఫ్గనిస్తాన్ (145 ర్యాంక్) కంటే మాత్రమే మెరుగైన స్థితిలో నిలిచింది. ఇదిలా ఉంటే మన పొరుగుదేశాలైన పాకిస్తాన్–75, భూటాన్–97, నేపాల్–101, బంగ్లాదేశ్–115, శ్రీలంక–116 భారత్ కంటే మంచి మార్కులనే సాధించాయి.
స్థూల దేశీయ ఉత్పత్తి (జీడీపీ)లో తలసరి ఆదాయం , సామాజిక సహకారం, ఆరోగ్యకరమైన జీవనసాఫల్యం, సామాజిక స్వేచ్ఛ, ధాతృత్వం, అవినీతిరాహిత్యం వంటి అంశాల్లో జరిపిన పరిశీలన ఆధారం ఐరాస సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ సొల్యూషన్స్ నెట్‌వర్క్ (ఎస్‌డీఎస్‌ఎన్) 2018 వరల్డ్ హ్యాపినెస్ రిపోర్ట్‌లో ఈ అంశాలు పొందుపరిచారు. ఈ నెల 20న ‘ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్’ను పురస్కరించుకుని ఈ వార్షిక నివేదిక విడుదలచేశారు. 170 పేజీల రిపోర్ట్‌లో...ప్రస్తుతం తలెత్తుతున్న ఊబకాయం, కుంగుబాటు, ఒపియాడ్ సంక్షోభం వంటి ఆరోగ్య సమస్యలపై ప్రత్యేక దృష్టిపెట్టారు. ఇతర దేశాలతో పోల్చితే ఈ సమస్యలు అమెరికాలో ఎక్కువగా కనిపించడాన్ని గురించి ప్రస్తావించారు.
అగ్రస్థానంలో ఫిన్‌లాండ్...
గతంలో ప్రధమస్థానంలో ఉన్న డెన్మార్క్‌ను వెనక్కుతోసి ఈ ఏడాది సూచిలో అత్యంత సంతోషరకరమైన దేశంగా ఫిన్‌లాండ్(గతంలో అయిదోస్థానం) అగ్రస్థానానికి చేరుకుంది. 2015–17 సంవత్సరాల మధ్య ఆర్థిక, ఆరోగ్యపరమైన అంశాలతో పాటు, ఎన్నికలకు సంబంధించిన సమాచారం ఆధారంగా ఆర్థికవేత్తలు ఈ నివేదిక రూపొందించారు. ప్రకృతి, భద్రత, పిల్లల సంరక్షణ, మంచి పాఠశాలలు, ఉచిత వైద్యసేవలు వంటి అంశాల్లో ఫిన్‌లాండ్ అత్యుత్తమ మార్కులు సాధించింది.
అమెరికా 18వ స్థానంలో (గతేడాది 14), బ్రిటన్–19, యూనైటెడ్ అరబ్ ఎమిరైట్స్–20స్థానాల్లో నిలిచాయి. ఈ జాబితాలో సిరియా కంటే కూడా వెనుజువెలా దిగజారింది. చైనాలో గ్రామీణ ప్రాంతాల నుంచి లక్షలాది మంది పట్టణప్రాంతాలకు వలస వెళుతున్నా వారి సంతోషమయ జీవితం ఏమాత్రం బాగుపడలేదని తేలింది.
టాప్ టు బాటమ్...
టాప్– 1)ఫిన్‌లాండ్ 2) నార్వే 3) డెన్మార్క్ 4) ఐస్‌లాండ్ 5) స్విట్జర్లాండ్
లాస్ట్–152)యెమన్ 153)టాంజానియా 154) దక్షిణ సూడాన్ 155) సెంట్రల్ ఆప్రికన్ రిపబ్లిక్ 156) బురుండి
–సాక్షి నాలెడ్జ్ సెంటర్
Comments
Please login to add a commentAdd a comment