happiness index
-
ఆనందమా! నువ్వెక్కడ?
భవిష్యత్తు ఇలాగే ఉంటుందని ఎవరూ చెప్పలేరు. ఇంతకంటే బాగుండాలనే అందరూ అనుకుంటారు. ఆశపడతారు. అయితే అందుకు తగ్గట్టు ఏమి చేస్తున్నారనేదే ప్రశ్న. ఆనందం; పరమానందం; బ్రహ్మానందం- మాటలకు వేదాంత కోణంలో వేరే అర్థాలున్నా – మనం లౌకిక అర్థమే చూద్దాం. ఆనందం వెతుక్కోవడంలోనే మనం తికమక పడుతున్నాం. ఆనందం కానిది ఆనందం అనుకుని పరుగులు తీస్తున్నాం. జీవితం ఎప్పుడూ సరళరేఖ కానేకాదు. ఒకేవేగం, ఒకే పద్ధతిలో వెళ్ళదు. ఎగుడు దిగుళ్లు; లాభనష్టాలు; కష్టసుఖాలు సహజం. అయితే లాభమూ సుఖమూ ఆనందించదగ్గది – నష్టమూ కష్టమూ భరించకూడనిది అవుతుంది. ఇక్కడే వస్తోంది చిక్కంతా. జీవితం సంక్లిష్టం కావాలని ఎవరూ కోరుకోరు. కానీ సంక్లిష్టమయినప్పుడు బయటపడడానికి, ఆ ప్రయత్నంలో ఆనందం వెతుక్కోవడానికి ప్రయత్నించేవారు తక్కువ. ఆనందం దానికదిగా వస్తువు కాదు. మార్కెట్లో దొరకదు. ఆనందం అక్షరాలా మనకు మనమే తయారుచేసుకోవాల్సిన పదార్థం. మనలో మనమే వెతికి పట్టుకోవాల్సిన వస్తువు. మనలోపలే ఉన్నా మనం లేదనుకుని వెతికే ఫీలింగ్. ఒక అనుభూతి. ఒక మానసిక స్థితి. మరి – మనలోపలే ఆనందం టన్నుల కొద్దీ ఉంటే మనకెందుకు కనిపించదు? అనిపించదు? గెలుపు ఆనందం- ఓటమి బాధ. స్థూలంగా ఆనందానికి- బాధకు మన నిర్వచనం ఇది. లక్ష్యం , గమ్యం ఆనందం. చేరేదారి, గమనం బాధ. నొప్పి, అసహ్యం, అసహనం, అసంతృప్తి. గమ్యంతోపాటు గమనాన్ని, చేరే దారిని కూడా ఆనందించాలి, ప్రేమించాలి, అనుభవించాలి. జీవితం చాలాసార్లు సవాళ్లు విసురుతుంది. ఇక మార్గమే లేనట్లుగా చేస్తుంది. బరువుగా మారుతుంది. దిగులుగా చేస్తుంది. నీరసపరుస్తుంది. నిస్పృహ నింపుతుంది. మొండిగా బండగా మారుస్తుంది. కానీ ఇలాంటి సమయాల్లో కూడా ఆనందాలను వెతుక్కోవాలి. అలవికాని ఆశలు, అంచనాలు, ఇతరులతో పోలిక, ఇతరులు ఏమనుకుంటారోనన్న ఆందోళనలు వదిలేస్తే ఎన్నెన్నో ఆనందాలు కళ్ళముందే ప్రత్యక్షమవుతాయి. -పమిడికాల్వ మధుసూదన్ -
సంతోష సూచీలో మనమెక్కడ.. మనకంటే మెరుగైన స్థానాల్లో పాక్, శ్రీలంక
ఎం.విశ్వనాథరెడ్డి, సాక్షి ప్రతినిధి : ప్రపంచంలో సంతోషకర దేశాల గురించి తెలుసుకోవడం ఎప్పుడూ ఆసక్తికరమే. ఈ దేశాల ఎంపికకు తీసుకుంటున్న ప్రమాణాలపై పలు అభ్యంతరాలు ఉన్నాయి. అయినప్పటికీ ఈ జాబితాపై అంతా ఆసక్తి చూపుతుంటారు. తాజాగా ప్రపంచ సంతోషకర దేశాల (హ్యాపీనెస్ ఇండెక్స్) జాబితాలో భారత్ 126వ స్థానంలో నిలిచింది. ఈ జాబితా కోసం మొత్తం 150 దేశాలను పరిగణనలోకి తీసుకున్నారు. ప్రపంచంలోనే సంతోషకర దేశాలుగా నార్డిక్ దేశాలుగా పేరున్న ఫిన్లాండ్, డెన్మార్క్, ఐస్లాండ్ తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. చిట్టచివరి స్థానంలో ఆప్ఘనిస్థాన్ నిలిచింది. మొత్తం 10 పాయింట్లకుగాను తొలిస్థానంలో నిలిచిన ఫిన్లాండ్కు 7.8 పాయింట్లు లభించాయి. మన దేశానికి కేవలం 4.6 పాయింట్లు మాత్రమే దక్కాయి. ఇక అట్టడుగున నిలిచిన ఆఫ్ఘనిస్థాన్‌కు 1.9 పాయింట్లు మాత్రమే వచ్చాయి. సంతోషానికి కొలమానం ఏమిటి? ఇది అత్యంత క్లిష్టమైన ప్రశ్న. మనిషి ఎంత సంతోషంగా ఉన్నారని చెప్పడానికి కొలమానం ఏమీ లేదు. సంపదకు, సంతోషానికి ప్రత్యక్ష సంబంధం లేదని సంతోష సూచీ ఫలితాలనుబట్టి చూస్తే అర్థమవుతుంది. సైనిక, ఆర్థిక వ్యవస్థల పరంగా పెద్ద దేశాలైన అమెరికా, చైనా టాప్–10లో లేకపోవడం గమనార్హం. ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న మన దేశం కంటే నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్థాన్.. సంతోష సూచీలో ముందుండటంగమనార్హం. ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ.. సంతోష సూచీలో కీలకపాత్ర పోషిస్తున్నాయని నివేదిక రూపకర్తలు అభిప్రాయపడ్డారు. కానీ ప్రజాస్వామ్యం లేని దేశాలు కూడా సంతోష సూచీలో మెరుగైన స్థానాలు సంపాదించడం గమనార్హం. ఈ అంశాల ఆధారంగా నివేదిక ‘యూఎన్ సస్టైన్‌బుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్’.. ఏటా సంతోష సూచీ నివేదిక రూపొందిస్తోంది. మార్చి మూడో వారంలో ఈ నివేదికను విడుదల చేస్తోంది. ఇందులో భాగంగా తాజా నివేదికను ఇటీవల విడుదల చేసింది. జీవితంలో ఎంత సంతృప్తిగా ఉన్నారు? అనే తొలి ప్రశ్నతో మొదలుపెట్టి, ప్రజల సంతృప్తస్థాయి, ఆరోగ్యకర జీవనం, విద్య, వైద్య రంగాల్లో నాణ్యత, భద్రత, తలసరి ఆదాయం, సామాజిక మద్దతు, అతి తక్కువ అవినీతి, సమాజంలో ఔదార్యం.. వంటి ప్రశ్నలకు ప్రజలు ఇచ్చిన జవాబుల ఆధారంగా సూచీని రూపొందించారు. నివేదికపై భిన్నాభిప్రాయాలు భారతీయ సమాజంలో సంక్లిష్టతను పాశ్చాత్య దేశాలు అర్థం చేసుకోలేవని, ఒకే రకమైన కొలమానంతో మన దేశ ప్రజల సంతోషాన్ని కొలవడంలో అర్థం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కుటుంబంతో కలిసి సంవత్సరానికి ఎన్నిసార్లు భోజనం చేశారు? అనే ప్రశ్న అడిగితే పాశ్చాత్య దేశాలు సంతోష సూచీల్లో వెనుకబడి ఉంటాయని ప్రముఖ సినీ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి (ది కాశ్మీర్ ఫైల్స్ ఫేమ్) ప్రశ్నించడం గమనార్హం. దీనిపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఆయన అభిప్రాయంతో కొందరు ఏకీభవిస్తుండగా మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. యుద్ధం చేస్తున్నా ఆనందంగానే.. కాగా ఏడాదికిపైగా రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ యుద్ధంలో ఉక్రెయిన్ తీవ్రంగా దెబ్బతింది. అయినా సరే సంతోష సూచీలో మెరుగైన స్థానంలోనే ఉంది. గతేడాది 98వ స్థానంలో ఉన్న ఉక్రెయిన్ తాజా నివేదికలో 92కు చేరింది. దేశం కోసం స్వచ్ఛంద సేవ చేయడం, వివిధ రూపాల్లో రోజూ కరుణ చూపడం, తోటి ప్రజలకు సహాయం అందించడం, ఉన్నంతలో పొరుగువారికి పంచడం, ఒకరికోసం ఒకరు నిలబడటం, యుద్ధంలో గాయపడిన వారికి సేవలు చేయడం.. ఇవన్నీ ప్రజల్లో సంతృప్తస్థాయిని పెంచాయని సంతోష సూచీ రూపకర్తల్లో ఒకరైన లారా అక్నిన్ నివేదికలో పేర్కొనడం గమనార్హం. గతంతో పోలిస్తే కాస్త మెరుగుపడ్డ భారత్ ర్యాంక్ కాగా గతేడాది నివేదికలో మన దేశానికి 136వ స్థానం దక్కగా ఈ సంవత్సరం కాస్త మెరుగుపడి 126వ స్థానానికి చేరింది. సంతోషకర దేశాల జాబితాలో మన దాయాది పాకిస్తాన్ 108, ఆర్థిక సంక్షోభంతో అతలాకుతలమైన శ్రీలంక 112, బంగ్లాదేశ్ 118 స్థానాల్లో నిలిచాయి. నేపాల్ 78వ స్థానం దక్కించుకుంది. ప్రపంచంలోని అన్ని దేశాలు స్థూల జాతీయ ఉత్పత్తి(జీడీపీ) గణాంకాలను రూపొందిస్తుండగా.. గ్రాస్ నేషనల్ ఇండెక్స్ రూపొందిస్తున్న భూటాన్‌ను ప్రపంచ సంతోష సూచీలో పరిగణనలోకి తీసుకోకపోవడం గమనార్హం. -
పాకిస్తాన్, బంగ్లాదేశ్ కంటే భారత్ వెనుకంజ
వరల్ఢ్ హ్యాపినెస్ రిపోర్ట్‌లో ఫిన్లాండ్ వరుసగా నాలుగోసారి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ప్రపంచ వ్యాప్తంగా 149 దేశాలకు చెందిన ప్రజలు ఎంత సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నారనే దానిపై జరిపిన సర్వేలో ఫిన్లాండ్ మరొకసారి టాప్‌లో నిలిచింది. ఈ మేరకు వరల్ఢ్ హ్యాపినెస్ రిపోర్ట్- 2021ను యూఎన్ సస్టేనబుల్ డెవలప్మెంట్ సోల్యూషన్స్ నెటెవర్క్ సంస్థ విడుదల చేసింది. ఈ జాబితాలో భారత్ 139వ స్థానంలో నిలిచింది. కాగా, గత ఏడాది కంటే భారత్ హ్యాపినెస్ ఇండెక్స్‌లో తన స్థానాన్ని మెరుగుపర్చుకుంది. కాగా పొరుగు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్ , చైనాల కంటే హ్యాపినెస్ ఇండెక్స్‌లో భారత్ వెనుకంజలో ఉండడం గమనార్హం. నివేదిక ప్రకారం.. పాకిస్తాన్ 105, బంగ్లాదేశ్ 101, చైనా 84 వ స్థానంలో నిలిచాయి. చివరి మూడు స్థానాల్లో ఆఫ్ఘనిస్తాన్ 149, జింబాబ్వే 148, రవాండా 147, నిలిచాయి.ప్రతి ఏడాది యూఎన్ హ్యాపినెస్ ఇండెక్స్‌ను విడుదల చేస్తోంది. ఈ ఇండెక్స్‌ను గాలప్ వరల్డ్ పోల్ నిర్వహించే ప్రశ్నల ఆధారంగా ప్రపంచ దేశాలకు ర్యాంకులను నిర్ణయిస్తోంది. దాంతో పాటుగా దేశాల జీడిపీ, సామాజిక భద్రతను పరిగణలోకి తీసుకుంటుంది. ఈ సూచీను ఆయా దేశాల జీడీపీ, సామాజిక భద్రత, దాతృత్వం, ప్రజల ఆరోగ్య స్థితిగతులు, లంచగొండితనం , ప్రజల నిర్ణయాల్లో స్వతంత్రత వంటి విషయాలను పరిగణలోనికి తీసుకుంటుంది. 2021 ప్రపంచంలోనే సంతోషకరమైన మొదటి 20 దేశాల జాబితా... 1. ఫిన్ లాండ్ 2. డెన్మార్క్ 3. స్విట్జర్లాండ్ 4. ఐస్ లాండ్ 5. నెదర్లాండ్స్ 6. నార్వే 7. స్వీడన్ 8. లక్సెంబర్గ్ 9. న్యూజిలాండ్ 10. ఆస్ట్రియా 11. ఆస్ట్రేలియా 12. ఇజ్రాయెల్ 13. జర్మనీ 14. కెనడా 15. ఐర్లాండ్ 16. కోస్టా రికా 17. యునైటెడ్ కింగ్డమ్ 18. చెక్ రిపబ్లిక్ 19. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 20. బెల్జియం -
పెళ్లయిన వారే ఎక్కువ హ్యాపీ..
సాక్షి, హైదరాబాద్: దేశంలో మొట్టమొదటి ఆలిండియా హ్యాపీనెస్ రిపోర్ట్‌లోని పెద్ద రాష్ట్రాల కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు ముందు వరసలో నిలిచాయి. ఇందులో తెలంగాణ మూడో స్థానం, ఆంధ్రప్రదేశ్ ఐదో స్థానం దక్కించుకున్నాయి. ఈ జాబితాలో పంజాబ్, గుజరాత్ తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. ఇక మొత్తంగా అంటే దేశంలోని 36 చిన్న, పెద్ద రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కలుపుకొని ఆయా పరిశీలన అంశాల వారీగా చూస్తే.. మిజోరాం, పంజాబ్, అండమాన్ నికోబార్ ఓవరాల్‌గా టాప్ త్రీ ర్యాంకులను కైవసం చేసుకున్నాయి. ఏమిటీ రిపోర్ట్..? దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని ప్రజల ఆనందం, సంతోషం వంటి వాటికి దోహదపడే అంశాలను పరిశీలించి, వివిధ విషయాలపై సమాచార సేకరణ ద్వారా హ్యాపీనెస్‌ను కొలిచేందుకు ఆలిండియా హ్యాపీనెస్ సర్వే చేశారు. ఈ అధ్యయనంలో భాగంగా మేనేజ్మెంట్, వ్యూహాత్మక అంశాల్లో నిపుణుడైన ప్రముఖ ప్రొఫెసర్ రాజేశ్ కె.పిల్లానియా మార్చి–జూలై మధ్యకాలంలో జాతీయస్థాయిలో 16,950 మంది నుంచి వివిధ అంశాలపై ఒక ప్రశ్నావళి ద్వారా వారి అభిప్రాయాలు సేకరించారు. కోవిడ్ కారణంగా సంతోషంపై తీవ్ర ›ప్రభావం పడుతోందని మహారాష్ట్ర, ఢిల్లీ, హరియాణాలకు చెందిన వారు అభిప్రాయపడగా తమ హ్యాపీనెస్‌పై కోవిడ్ సానుకూల ప్రభావం చూపుతోందనే భావనను మణిపూర్, అండమాన్ నికోబార్, లక్షద్వీప్ వాసులు వ్యక్తంచేశారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు రాజ్‌మోహన్‌గాంధీ, కారీ కూపర్, ఆష్లే విలియమ్స్, ఎమ్మా సెప్పాలా, జెన్నీఫర్ మోస్, దాసో కర్మ ఉరా, టీవీరావు, దేవ్‌దత్ పట్నాయక్ల అభిప్రాయాలు కూడా క్రోడీకరించి ఈ నివేదికను రూపొందించారు. భవిష్యత్‌పై ఆశాభావం.. దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని ప్రజలు సంతోషానికి సంబంధించి స్పందించిన తీరు భిన్నంగా ఉన్నా అందరూ మాత్రం భవిష్యత్ పట్ల ఆశాభావం వెలిబుచ్చడం విశేషం. సంతోషం, ఆనందం ఎలా ఉంటాయన్నది తెలుసుకోవడమే కాకుండా దానిని అనుభవించడం, రోజువారీ జీవితంలో దానిని పాటించడం ముఖ్యమనేది కూడా ఈ అధ్యయనంలో వెల్లడైంది. హ్యాపీనెస్ అంచనాకు పరిగణనలోకి తీసుకున్న అంశాలు.. ► చేసే పని, దానితో ముడిపడిన అంశాలు, ఆదాయం, పురోగతి, వృద్ధి ► కుటుంబం, స్నేహితులతో సంబంధాలు ► శారీరక, మానసిక ఆరోగ్యాలు ► దాతృత్వం, సామాజిక అంశాలు ► మతపరమైన లేదా ఆధ్యాత్మిక అవగాహన ► వీటితో పాటు కోవిడ్–19 నేపథ్యంలో హ్యాపీనెస్‌పై, దాని ప్రభావంపైనా అభిప్రాయాలు సేకరించారు. ఎవరీ రాజేశ్ పిల్లానియా.. ‘టాప్ ప్రొఫెసర్ ఆఫ్ స్ట్రాటజీ ఇన్ ఇండియా’గా ప్రొఫెసర్ రాజేశ్‌ను అసోచామ్, ఎడ్యుకేషన్ పోస్ట్ గుర్తించాయి. అనేక అంతర్జాతీయ రీసెర్చ్ జర్నల్స్, ఇతర సంస్థలు, కాన్ఫరెన్స్‌ల అడ్వైజరీ బోర్డుల్లో ఆయన సభ్యుడిగా ఉన్నారు. రచయితగానూ, టీచర్‌గానూ పేరుప్రతిష్టలున్నాయి. వివిధ జాతీయ, అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు, బిజినెస్ స్కూళ్లలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. ఆయన చేపట్టిన ‘మేనేజ్మెంట్ లెర్నింగ్స్ ఫ్రం మై మదర్’అనే ప్రాజెక్టు విశిష్టమైనది. పెళ్లయిన వారే ఎక్కువ హ్యాపీ.. ఆనందం లేదా సంతోషానికి లింగ భేదం లేదని వెల్లడైంది. ఆడ, మగ అనే సంబంధం లేకుండా హ్యాపీనెస్ అనుభూతిని పొందుతున్నారు. వివాహం, ఏజ్ గ్రూపు, విద్యార్హతలు, ఆదాయ స్థాయి వంటివి మొత్తంగా హ్యాపీనెస్‌కు పాజిటివ్ అంశాలుగా తేలింది. ఇక పెళ్లి కాని వారి కంటే పెళ్లైన వారే ఎక్కువ సంతోషంగా ఉన్నట్టుగా ఈ నివేదికలో వెల్లడైంది. టాప్ ర్యాంకులు ఇవే... ఓవరాల్‌గా చూస్తే... 1) మిజోరాం 2) పంజాబ్ 3) అండమాన్ నికోబార్ దీవులు పెద్దరాష్ట్రాల్లో.. 1) పంజాబ్ 2) గుజరాత్ 3) తెలంగాణ 5) ఆంధ్రప్రదేశ్ దక్షిణాది రాష్ట్రాల్లో.. 1) పుదుచ్చేరి 2) తెలంగాణ 3) ఆంధ్రప్రదేశ్ చిన్న రాష్ట్రాల్లో.. 1)మిజోరాం 2) సిక్కిం 3) అరుణాచ ప్రదేశ్ కేంద్ర పాలిత ప్రాంతాల్లో.. 1) అండమాన్ నికోబార్ 2) పుదుచ్చేరి 3) లక్షద్వీప్ చివర్లో నిలిచిన రాష్ట్రాలు: ఛత్తీస్‌గఢ్ (36వ స్థానం), ఉత్తరాఖండ్ (35వ స్థానం), ఒడిశా (34 వ స్థానం) -
మనం ఆనందంగా లేము...!
ప్రపంచంలో ఆనందమయ జీవనాన్ని సాగించే దేశాల్లో భారత్ స్థానం మరింత దిగజారింది. మొత్తం 156 దేశాల జాబితాలో మనదేశం 133 స్థానంతో (గతంలోని 122 ర్యాంక్ నుంచి) సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అదీకాకుండా సార్క్దేశాలతో (దక్షిణాసియా) పోల్చితే కూడా యుద్ధసంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న అఫ్గనిస్తాన్ (145 ర్యాంక్) కంటే మాత్రమే మెరుగైన స్థితిలో నిలిచింది. ఇదిలా ఉంటే మన పొరుగుదేశాలైన పాకిస్తాన్–75, భూటాన్–97, నేపాల్–101, బంగ్లాదేశ్–115, శ్రీలంక–116 భారత్ కంటే మంచి మార్కులనే సాధించాయి. స్థూల దేశీయ ఉత్పత్తి (జీడీపీ)లో తలసరి ఆదాయం , సామాజిక సహకారం, ఆరోగ్యకరమైన జీవనసాఫల్యం, సామాజిక స్వేచ్ఛ, ధాతృత్వం, అవినీతిరాహిత్యం వంటి అంశాల్లో జరిపిన పరిశీలన ఆధారం ఐరాస సస్టెయినబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ (ఎస్డీఎస్ఎన్) 2018 వరల్డ్ హ్యాపినెస్ రిపోర్ట్‌లో ఈ అంశాలు పొందుపరిచారు. ఈ నెల 20న ‘ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్’ను పురస్కరించుకుని ఈ వార్షిక నివేదిక విడుదలచేశారు. 170 పేజీల రిపోర్ట్‌లో...ప్రస్తుతం తలెత్తుతున్న ఊబకాయం, కుంగుబాటు, ఒపియాడ్ సంక్షోభం వంటి ఆరోగ్య సమస్యలపై ప్రత్యేక దృష్టిపెట్టారు. ఇతర దేశాలతో పోల్చితే ఈ సమస్యలు అమెరికాలో ఎక్కువగా కనిపించడాన్ని గురించి ప్రస్తావించారు. అగ్రస్థానంలో ఫిన్లాండ్... గతంలో ప్రధమస్థానంలో ఉన్న డెన్మార్క్‌ను వెనక్కుతోసి ఈ ఏడాది సూచిలో అత్యంత సంతోషరకరమైన దేశంగా ఫిన్లాండ్(గతంలో అయిదోస్థానం) అగ్రస్థానానికి చేరుకుంది. 2015–17 సంవత్సరాల మధ్య ఆర్థిక, ఆరోగ్యపరమైన అంశాలతో పాటు, ఎన్నికలకు సంబంధించిన సమాచారం ఆధారంగా ఆర్థికవేత్తలు ఈ నివేదిక రూపొందించారు. ప్రకృతి, భద్రత, పిల్లల సంరక్షణ, మంచి పాఠశాలలు, ఉచిత వైద్యసేవలు వంటి అంశాల్లో ఫిన్లాండ్ అత్యుత్తమ మార్కులు సాధించింది. అమెరికా 18వ స్థానంలో (గతేడాది 14), బ్రిటన్–19, యూనైటెడ్ అరబ్ ఎమిరైట్స్–20స్థానాల్లో నిలిచాయి. ఈ జాబితాలో సిరియా కంటే కూడా వెనుజువెలా దిగజారింది. చైనాలో గ్రామీణ ప్రాంతాల నుంచి లక్షలాది మంది పట్టణప్రాంతాలకు వలస వెళుతున్నా వారి సంతోషమయ జీవితం ఏమాత్రం బాగుపడలేదని తేలింది. టాప్ టు బాటమ్... టాప్– 1)ఫిన్లాండ్ 2) నార్వే 3) డెన్మార్క్ 4) ఐస్లాండ్ 5) స్విట్జర్లాండ్ లాస్ట్–152)యెమన్ 153)టాంజానియా 154) దక్షిణ సూడాన్ 155) సెంట్రల్ ఆప్రికన్ రిపబ్లిక్ 156) బురుండి –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
ప్రపంచంలో సంతోషంగా జీవిస్తున్న దేశం ఇదే
ప్రపంచంలో ప్రజలు అత్యంత సంతోషంగా జీవిస్తున్న దేశాల జాబితాలో ఈ ఏడాదికి డెన్మార్క్ అగ్రస్థానంలో నిలిచింది. 2015లో ఈ దేశం మూడోస్థానంలో ఉండగా.. ఈ ఏడాది మరింత పురోభివృద్ధి చెంది అగ్రస్థానానికి చేరిందని 'వరల్డ్ హాపీనెస్ లెవెల్స్' తాజా అధ్యయనలో తేలింది. జాతీయ స్థూల ఉత్పత్తిలో ప్రజల సగటు ఆదాయాన్ని, వారి ఆరోగ్య ఆయుర్దాయాన్ని, జీవితాన్ని ఎంపిక చేసుకోవడంలో ప్రజలకున్న స్వేచ్ఛను పరిగణనలోకి తీసుకొని 156 దేశాల జాబితాను రూపొందించగా, డెన్మార్క్‌కు మొదటి స్థానం లభించింది. స్విట్జర్లాండ్, ఐస్లాండ్, నార్వే, ఫిన్లాండ్లు మొదటి ఐదు స్థానాల్లో నిలిచాయి. నోర్డాక్ దేశాలు మొదటి ఐదు స్థానాలను సాధించడం విశేషం. కామన్వెల్త్ దేశాలైన కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలు పది స్థానాల లోపల చోటు దక్కించుకున్నాయి. అభివృద్ధి చెందిన దేశాలైన అమెరికా 13వ స్థానంలో, జర్మనీ 16వ స్థానంలో, బ్రిటన్ 23 స్థానాల్లో నిలిచాయి. డబ్బు వెంట పరుగెత్తుతున్న అమెరికా లాంటి దేశాలకు ఇదో సందేశమని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ ప్రత్యేక సలహాదారు జెఫ్రీ సాచ్స్ వ్యాఖ్యానించారు. మన సామాజిక స్వరూపం క్షీణించిపోతోందని, సామాజిక విశ్వాసం సన్నగిల్లుతోందని, ప్రభుత్వాల పట్ల ప్రజలు విశ్వాసం కూడా కోల్పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 'సామాజిక, పర్యావరణ ప్రాథమ్యాలను పట్టించుకోకుండా కేవలం ఆర్థిక అభివృద్ధిపైనే దేశాలు దృష్టి పెడితే అది మానవ సంక్షేమానికి అవరోధం అవడమే కాకుండా మానవ మనుగడకే ముప్పును తీసుకొస్తుంది' ప్రపంచ ప్రజల సంతోషం పట్ల అధ్యయనం చేసిన సంస్థ తన నివేదికలో వ్యాఖ్యానించింది. తూర్పు యూరప్ దేశాలైన లాత్వియా, స్లొవేకియా, ఉజ్బెకిస్తాన్, రష్యా లాంటి దేశాలు కూడా ప్రజలు సంతోషంగా జీవించేందుకు ప్రాధాన్యం ఇవ్వడంలో గతంలో కన్నా ఎంతో పురోగతి చెందాయని కూడా ఆ నివేదిక వెల్లడించింది.