పెళ్లయిన వారే ఎక్కువ హ్యాపీ.. | Telangana Got Third Rank In All India Happiness Report | Sakshi
Sakshi News home page

తెలంగాణకు 3, ఏపీకి ఐదో ర్యాంక్‌

Published Fri, Sep 18 2020 3:32 AM | Last Updated on Fri, Sep 18 2020 12:29 PM

Telangana Got Third Rank In All India Happiness Report - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో మొట్టమొదటి ఆలిండియా హ్యాపీనెస్‌ రిపోర్ట్‌లోని పెద్ద రాష్ట్రాల కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు ముందు వరసలో నిలిచాయి. ఇందులో తెలంగాణ మూడో స్థానం, ఆంధ్రప్రదేశ్‌ ఐదో స్థానం దక్కించుకున్నాయి. ఈ జాబితాలో పంజాబ్, గుజరాత్‌ తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. ఇక మొత్తంగా అంటే దేశంలోని 36 చిన్న, పెద్ద రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కలుపుకొని ఆయా పరిశీలన అంశాల వారీగా చూస్తే.. మిజోరాం, పంజాబ్, అండమాన్‌ నికోబార్‌ ఓవరాల్‌గా టాప్‌ త్రీ ర్యాంకులను కైవసం చేసుకున్నాయి.

ఏమిటీ రిపోర్ట్‌..?
దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని ప్రజల ఆనందం, సంతోషం వంటి వాటికి దోహదపడే అంశాలను పరిశీలించి, వివిధ విషయాలపై సమాచార సేకరణ ద్వారా హ్యాపీనెస్‌ను కొలిచేందుకు ఆలిండియా హ్యాపీనెస్‌ సర్వే చేశారు. ఈ అధ్యయనంలో భాగంగా మేనేజ్‌మెంట్, వ్యూహాత్మక అంశాల్లో నిపుణుడైన ప్రముఖ ప్రొఫెసర్‌ రాజేశ్‌ కె.పిల్లానియా మార్చి–జూలై మధ్యకాలంలో జాతీయస్థాయిలో 16,950 మంది నుంచి వివిధ అంశాలపై ఒక ప్రశ్నావళి ద్వారా వారి అభిప్రాయాలు సేకరించారు. కోవిడ్‌ కారణంగా సంతోషంపై తీవ్ర ›ప్రభావం పడుతోందని మహారాష్ట్ర, ఢిల్లీ, హరియాణాలకు చెందిన వారు అభిప్రాయపడగా తమ హ్యాపీనెస్‌పై కోవిడ్‌ సానుకూల ప్రభావం చూపుతోందనే భావనను మణిపూర్, అండమాన్‌ నికోబార్, లక్షద్వీప్‌ వాసులు వ్యక్తంచేశారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు రాజ్‌మోహన్‌గాంధీ, కారీ కూపర్, ఆష్లే విలియమ్స్, ఎమ్మా సెప్పాలా, జెన్నీఫర్‌ మోస్, దాసో కర్మ ఉరా, టీవీరావు, దేవ్‌దత్‌ పట్నాయక్‌ల అభిప్రాయాలు కూడా క్రోడీకరించి ఈ నివేదికను రూపొందించారు.

భవిష్యత్‌పై ఆశాభావం..
దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని ప్రజలు సంతోషానికి సంబంధించి స్పందించిన తీరు భిన్నంగా ఉన్నా అందరూ మాత్రం భవిష్యత్‌ పట్ల ఆశాభావం వెలిబుచ్చడం విశేషం. సంతోషం, ఆనందం ఎలా ఉంటాయన్నది తెలుసుకోవడమే కాకుండా దానిని అనుభవించడం, రోజువారీ జీవితంలో దానిని పాటించడం ముఖ్యమనేది కూడా ఈ అధ్యయనంలో వెల్లడైంది.

హ్యాపీనెస్‌ అంచనాకు పరిగణనలోకి తీసుకున్న అంశాలు..
► చేసే పని, దానితో ముడిపడిన అంశాలు, ఆదాయం, పురోగతి, వృద్ధి
► కుటుంబం, స్నేహితులతో సంబంధాలు
► శారీరక, మానసిక ఆరోగ్యాలు
► దాతృత్వం, సామాజిక అంశాలు
► మతపరమైన లేదా ఆధ్యాత్మిక అవగాహన
► వీటితో పాటు కోవిడ్‌–19 నేపథ్యంలో హ్యాపీనెస్‌పై, దాని ప్రభావంపైనా అభిప్రాయాలు సేకరించారు.

ఎవరీ రాజేశ్‌ పిల్లానియా.. 
‘టాప్‌ ప్రొఫెసర్‌ ఆఫ్‌ స్ట్రాటజీ ఇన్‌ ఇండియా’గా ప్రొఫెసర్‌ రాజేశ్‌ను అసోచామ్, ఎడ్యుకేషన్‌ పోస్ట్‌ గుర్తించాయి. అనేక అంతర్జాతీయ రీసెర్చ్‌ జర్నల్స్, ఇతర సంస్థలు, కాన్ఫరెన్స్‌ల అడ్వైజరీ బోర్డుల్లో ఆయన సభ్యుడిగా ఉన్నారు. రచయితగానూ, టీచర్‌గానూ పేరుప్రతిష్టలున్నాయి. వివిధ జాతీయ, అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు, బిజినెస్‌ స్కూళ్లలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. ఆయన చేపట్టిన ‘మేనేజ్‌మెంట్‌ లెర్నింగ్స్‌ ఫ్రం మై మదర్‌’అనే ప్రాజెక్టు విశిష్టమైనది.

పెళ్లయిన వారే ఎక్కువ హ్యాపీ..
ఆనందం లేదా సంతోషానికి లింగ భేదం లేదని వెల్లడైంది. ఆడ, మగ అనే సంబంధం లేకుండా హ్యాపీనెస్‌ అనుభూతిని పొందుతున్నారు. వివాహం, ఏజ్‌ గ్రూపు, విద్యార్హతలు, ఆదాయ స్థాయి వంటివి మొత్తంగా హ్యాపీనెస్‌కు పాజిటివ్‌ అంశాలుగా తేలింది. ఇక పెళ్లి కాని వారి కంటే పెళ్లైన వారే ఎక్కువ సంతోషంగా ఉన్నట్టుగా ఈ నివేదికలో వెల్లడైంది.

టాప్‌ ర్యాంకులు ఇవే... ఓవరాల్‌గా చూస్తే...
1) మిజోరాం
2) పంజాబ్‌
3) అండమాన్‌ నికోబార్‌ దీవులు

పెద్దరాష్ట్రాల్లో..
1) పంజాబ్‌
2) గుజరాత్‌
3) తెలంగాణ 
5) ఆంధ్రప్రదేశ్‌

దక్షిణాది రాష్ట్రాల్లో..
1) పుదుచ్చేరి
2) తెలంగాణ
3) ఆంధ్రప్రదేశ్‌

చిన్న రాష్ట్రాల్లో..
1)మిజోరాం
2) సిక్కిం
3) అరుణాచ ప్రదేశ్‌

కేంద్ర పాలిత ప్రాంతాల్లో.. 
1) అండమాన్‌ నికోబార్‌
2) పుదుచ్చేరి
3) లక్షద్వీప్‌

చివర్లో నిలిచిన రాష్ట్రాలు: ఛత్తీస్‌గఢ్‌ (36వ స్థానం), ఉత్తరాఖండ్‌ (35వ స్థానం), ఒడిశా (34 వ స్థానం)  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement