ప్రపంచంలో సంతోషంగా జీవిస్తున్న దేశం ఇదే
ప్రపంచంలో సంతోషంగా జీవిస్తున్న దేశం ఇదే
Published Wed, Nov 16 2016 4:27 PM | Last Updated on Mon, Sep 4 2017 8:15 PM
ప్రపంచంలో ప్రజలు అత్యంత సంతోషంగా జీవిస్తున్న దేశాల జాబితాలో ఈ ఏడాదికి డెన్మార్క్ అగ్రస్థానంలో నిలిచింది. 2015లో ఈ దేశం మూడోస్థానంలో ఉండగా.. ఈ ఏడాది మరింత పురోభివృద్ధి చెంది అగ్రస్థానానికి చేరిందని 'వరల్డ్ హాపీనెస్ లెవెల్స్' తాజా అధ్యయనలో తేలింది. జాతీయ స్థూల ఉత్పత్తిలో ప్రజల సగటు ఆదాయాన్ని, వారి ఆరోగ్య ఆయుర్దాయాన్ని, జీవితాన్ని ఎంపిక చేసుకోవడంలో ప్రజలకున్న స్వేచ్ఛను పరిగణనలోకి తీసుకొని 156 దేశాల జాబితాను రూపొందించగా, డెన్మార్క్‌కు మొదటి స్థానం లభించింది.
స్విట్జర్లాండ్, ఐస్‌లాండ్, నార్వే, ఫిన్‌లాండ్‌లు మొదటి ఐదు స్థానాల్లో నిలిచాయి. నోర్డాక్ దేశాలు మొదటి ఐదు స్థానాలను సాధించడం విశేషం. కామన్‌వెల్త్ దేశాలైన కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలు పది స్థానాల లోపల చోటు దక్కించుకున్నాయి. అభివృద్ధి చెందిన దేశాలైన అమెరికా 13వ స్థానంలో, జర్మనీ 16వ స్థానంలో, బ్రిటన్ 23 స్థానాల్లో నిలిచాయి. డబ్బు వెంట పరుగెత్తుతున్న అమెరికా లాంటి దేశాలకు ఇదో సందేశమని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ ప్రత్యేక సలహాదారు జెఫ్రీ సాచ్స్ వ్యాఖ్యానించారు. మన సామాజిక స్వరూపం క్షీణించిపోతోందని, సామాజిక విశ్వాసం సన్నగిల్లుతోందని, ప్రభుత్వాల పట్ల ప్రజలు విశ్వాసం కూడా కోల్పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
'సామాజిక, పర్యావరణ ప్రాథమ్యాలను పట్టించుకోకుండా కేవలం ఆర్థిక అభివృద్ధిపైనే దేశాలు దృష్టి పెడితే అది మానవ సంక్షేమానికి అవరోధం అవడమే కాకుండా మానవ మనుగడకే ముప్పును తీసుకొస్తుంది' ప్రపంచ ప్రజల సంతోషం పట్ల అధ్యయనం చేసిన సంస్థ తన నివేదికలో వ్యాఖ్యానించింది. తూర్పు యూరప్ దేశాలైన లాత్వియా, స్లొవేకియా, ఉజ్బెకిస్తాన్, రష్యా లాంటి దేశాలు కూడా ప్రజలు సంతోషంగా జీవించేందుకు ప్రాధాన్యం ఇవ్వడంలో గతంలో కన్నా ఎంతో పురోగతి చెందాయని కూడా ఆ నివేదిక వెల్లడించింది.
Advertisement
Advertisement