భారత్‌లో జనాభా రోజురోజుకీ పెరిగిపోతోంది. చైనాను దాటి నంబర్‌వన్ స్థానంలోకి రావడానికి మరెంతో కాలం పట్టేలాలేదు. మరో ఎనిమిదేళ్లలోనే అంటే 2027 నాటికి చైనా జనాభాను భారత్ దాటేస్తుందని ఐక్యరాజ్యసమితి అంచనా వేస్తోంది. 2019–50 మధ్యనాటికి భారత్‌లో జనాభా 27.3 కోట్లు అదనంగా పెరుగుతుందని, ఈ శతాబ్దం చివరివరకు భారతే ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశంగా కొనసాగుతుందని ఒక నివేదికలో వెల్లడించింది. ఐక్యరాజ్యసమితికి చెందిన ఆర్థిక సామాజిక వ్యవహారాల సంస్థకు అనుబంధంగా ఉండే జనాభా విభాగం ‘ప్రపంచ జనాభా అంచనాలు–2019’ పేరిట ఒక నివేదికను విడుదల చేసింది.
ఈ నివేదికలోని ఇతర ముఖ్య అంశాలు..
► ప్రస్తుతం భారత్ జనాభా 137 కోట్లయితే, చైనా జనాభా 143 కోట్లుగా ఉంది.
► ప్రపంచవ్యాప్తంగా జనాభా 2019–50 మధ్య నాటికి మరో 200 కోట్లు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
► ప్రస్తుత ప్రపంచ జనాభా770 కోట్ల నుంచి 2050 నాటికి 970 కోట్లకు చేరుకోవచ్చు.
► 2010 నుంచి లెక్కలు తీస్తే 27 దేశాల్లో జనాభా ఒక్క శాతం తగ్గుతూ వస్తోంది.
► కొన్ని దేశాల్లో రికార్డు స్థాయిలో జనాభా తగ్గిపోవడానికి సంతాన సాఫల్యత తగ్గిపోవడం, ఒక దేశం నుంచి మరో దేశానికి వలసలు పెరిగిపోవడమే కారణం.
► 2050 నాటికి చైనాలో జనాభా అత్యధికంగా తగ్గిపోతుంది. ఏకంగా 2.2 శాతం తగ్గుదల ఉంటుంది. అంటే చైనా జనాభా 3.14 కోట్లు తగ్గితే అదే సమయంలో భారత్‌లో జనాభా 27.3 కోట్లు పెరగనుంది.
► 2050 నాటికి జనాభా పెరిగే తొమ్మిది దేశాల జాబితాలో భారత్ మొదటి స్థానంలో నిలుస్తుంది.
► 2050 నాటికి 65 ఏళ్లకు పైబడిన వారు చాలా ఎక్కువగా ఉంటారు. ప్రస్తుతం ప్రతీ 11 మందిలో ఒకరు 65 ఏళ్లకు పైబడి ఉంటే 2050 నాటికి ప్రతీ ఆరుగురిలో ఒకరు 65 ఏళ్ల వయసు దాటినవారే ఉంటారు.
భారతీయ అమెరికన్ల జనాభా పైపైకి
అమెరికాలో ఉంటున్న భారత సంతతి జనాభా గత ఏడేళ్లలో గణనీయంగా పెరిగిందని ఒక సంస్థ అధ్యయనంలో తేలింది. 2010–2017 సంవత్సరాల మధ్య భారత సంతతి జనాభా 38 శాతం మేర పెరిగినట్లు గుర్తించింది. సౌత్ ఏసియన్ అమెరికన్స్ లీడింగ్ టుగెదర్(సాల్ట్) సంస్థ పరిశీలన ప్రకారం.. 2010 భారత సంతతి అమెరికన్లు 31, 83, 063 మంది ఉండగా 2017నాటికి వారి సంఖ్య 44, 02, 363కు పెరిగింది. వారిలో కనీసం 6.30 లక్షల మంది అనధికారికంగా ఉంటున్న వారే. వీసా పరిమితి ముగిసినా అనధికారికంగా అమెరికాలో ఉంటున్న వారి సంఖ్యలో 2010తో పోలిస్తే 72 శాతం పెరుగుదల నమోదైంది.
2016 గణాంకాల ప్రకారం వీసా కాల పరిమితి ముగిశాక కూడా ఉంటున్న భారతీయులు 2.25 లక్షల మంది. 2010–2017 సంవత్సరాల మధ్య కాలంలో అమెరికాలో ఉంటున్న దక్షిణాసియా దేశాల నుంచి వారి సంఖ్య కూడా 35 లక్షల నుంచి 54 లక్షలకు (40 శాతం) పెరిగింది. వీరిలో అత్యధికంగా నేపాలీలు (206.6 శాతం), భారతీయులు(38), భూటానీయులు(38), పాకిస్తానీయులు(33), బంగ్లాదేశీయులు(26), శ్రీలంక వాసులు (15 శాతం) ఉన్నారు.
వీరితోపాటు బాల్యంలోనే అమెరికాకు వచ్చి ఇక్కడే ఉండేందుకు అనుమతి పొందిన దక్షిణాసియా దేశాల వారు 4,300 మంది కాగా భారతీయులు అత్యధికంగా 2,550 మంది ఉన్నారు. అమెరికాలో ఉంటున్న 50 లక్షల మంది దక్షిణాసియా వాసుల్లో 10 శాతం అంటే సుమారు 4.72 లక్షల మంది పేదరికంతో బాధపడుతున్నారు. పేదరికంలో ఉన్న భారతీయ అమెరికన్లలో 11 శాతం మంది ప్రభుత్వ సాయం అందుకుంటున్నారు. 1997 తర్వాత హెచ్–4 వీసా పొందిన హెచ్–1బీ వీసా దారుల జీవిత భాగస్వాముల సంఖ్య 17 లక్షలు. వీరిలో 86 శాతం మంది దక్షిణాసియా దేశాల ప్రజలే. 2017లో సుమారు 1.27 లక్షల మంది హెచ్–4 వీసా పొందారని సాల్ట్ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment