జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తున్న భారత రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్
న్యూఢిల్లీ: ఇతరుల అభిప్రాయాలతో విభేదిస్తున్నా, వారి గౌరవం, హుందాతనాన్ని అపహాస్యం చేయరాదని రాష్ట్రపతి కోవింద్ ఉద్ఘాటించారు. పౌరుల సంక్షేమానికి పాటుపడే సమాజ నిర్మాణం జరగాలని పిలుపునిచ్చారు. పదవుల్లో ఉన్న వ్యక్తుల కన్నా వ్యవస్థలే ముఖ్యమైనవని, అవి క్రమశిక్షణ, నీతి నిజాయతీలకు కట్టుబడి పనిచేయాలని అన్నారు. పేదరికాన్ని సాధ్యమైనంత తొందరగా తరిమికొట్టడం మన పవిత్ర కర్తవ్యమని ఉద్బోధించారు. 69వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతిగా కోవింద్ తొలిసారి గురువారం సాయంత్రం దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. చారిత్రక సంబంధ విషయాల్లోనూ ఇతరులతో విభేదిస్తే తప్పేం లేదనీ కానీ, వారి గౌరవాన్ని కించపరచకూడదని అన్నారు. చరిత్రను వక్రీకరించి తీశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న పద్మావత్ చిత్రానికి వ్యతిరేకంగా కొన్ని హిందూ అతివాద సంస్థలు హింసకు పాల్పడుతున్న నేపథ్యంలో కోవింద్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది. రాష్ట్రపతి ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే...
వ్యక్తి కాదు...వ్యవస్థే ముఖ్యం..
పట్టణాలైనా, గ్రామాలైనా పౌర స్పృహ కలిగి ఉన్న పౌరులతోనే పౌరస్పృహ ఉన్న జాతి నిర్మితమవుతుంది. పండగ జరుపుకుంటున్న సమయంలో, నిరసన తెలుపుతున్నప్పుడు పొరుగువారికి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలి. ఏదైనా విషయంలో ఇతరులతో అభిప్రాయభేదాలు ఏర్పడొచ్చు. చారిత్రక విషయాలు కూడా ఇందుకు మినహాయింపు కాకపోవచ్చు. సాటి వ్యవస్థ, సంస్థలతో సంబంధాలను గౌరవించుకుంటూ అన్ని సంస్థలు ముందుకు సాగాలి. నాణ్యత, పనితీరు విషయంలో రాజీపడకుండా సొంత పరిధిని అతిక్రమించకుండానే అవి పనిచేయాలి.
పేదరిక నిర్మూలన పవిత్ర బాధ్యత..
మనం గణతంత్ర రాజ్యాన్ని నిర్మించిన నాయకుల స్ఫూర్తితో కష్టపడాలి. పేదలు, అణగారిన వర్గాల కనీస అవసరాలు తీర్చలేనప్పుడు మనం సంతృప్తి చెందలేం. తక్కువ కాలంలో పేదరికాన్ని అంతమొందించడం మనందరి పవిత్ర బాధ్యత . ‘అభివృద్ధి చెందిన భారత్’ అనే కల సమీపంలోనే కనిపిస్తున్నా జాతి నిర్మాణానికి చేస్తున్న ప్రయత్నాల్లో ఇది ఒక కొత్త దశ మాత్రమే. దీన్ని యువతే తమ దార్శనికత, ఆశయాలతో ముందుకు తీసుకెళ్లాల్సి ఉంది. మన విద్యా వ్యవస్థ 21 శతాబ్దానికి అనుగుణంగా డిజిటల్ ఎకానమీ, జినోమిక్స్, రోబోటిక్స్, ఆటోమేషన్‌లను ఆకళింపు చేసుకునేలా సంస్కరణలు రావాలి.
Comments
Please login to add a commentAdd a comment