చక్మా శరణార్థులకు త్వరలో పౌరసత్వం
సాక్షి, న్యూఢిల్లీ : చక్మా, హజోంగ్ శరణార్థులకు భారత ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. దాదాపు 5 దశాబ్దాల కిందట తూర్పు పాకిస్తాన్ నుంచి వచ్చి ఈశాన్య రాష్ట్రాల్లో స్థిరపడ్డ చక్మా, హజోంగ్ శరణార్థులకు త్వరలో భారత పౌరసత్వం ఇస్తున్నట్లు ప్రభుత్వం వర్గాలు బుధవారం పేర్కొన్నాయి. చక్మా, హజోంగ్ శరణార్థుల సమస్యపై కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ఫెమా ఖండు, మరో కేంద్రసహాయ మంత్రి కిరణ్ రిజిజు, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో అరుణాచల్ ప్రదేశ్‌లో స్థిరపడ్డ చక్మా, హజోంగ్ శరణార్థులకు పౌరసత్వం ఇవ్వడంపైనే ప్రధానంగా చర్చ జరిగింది. శరణార్థులకు పౌరసత్వం ఇవ్వాలని 2015లో సుప్రీం కోర్టు చేసిన ఆదేశాలపైనా చర్చించారు. మరోవైపు అరుణాచల్ ప్రదేశ్‌లోని అనేక జాతులు, పౌర సమాజం... చక్మా, హజోంగ్ శరణార్థులకు పౌరసత్వం ఇవ్వడంపై తీవ్రంగా మండిపడుతున్నాయి. వారికి పౌరసత్వం ఇస్తే.. రాష్ట్ర, భౌగోళిక, జనాభా పరిస్థితులు తీవ్రంగా మారిపోతాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అరుణాచల్ ప్రదేశ్‌లో చక్మా, హజోంగ్ శరణార్థుల జనాభా సుమారు లక్ష వరకూ ఉండొచ్చని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.