న్యూఢిల్లీ: రష్యాలో జరుగుతున్న అంతర్జాతీయ ‘ట్యాంక్ బైథ్లాన్’ పోటీ తదుపరి దశ నుంచి భారత ఆర్మీ జట్టు వైదొలిగింది. భారత ప్రధాన యుద్ధ ట్యాంకు టీ–90లో సాంకేతిక లోపం కారణంగా తదుపరి దశలో పాల్గొనకూడదని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
అంతర్జాతీయ ఆర్మీ గేమ్స్‌లో భాగంగా రష్యాలోని అలాబినో పర్వత ప్రాంతంలో జూలై 29న ప్రారంభమైన ఈ పోటీల్లో (28 ఈవెంట్లు ఉంటాయి) భారత్, చైనా, రష్యా సహా 19 దేశాలు పాల్గొంటున్నాయి. ఇందులో టాప్–12 జట్లు రెండో దశ రిలే రేసుకు ఎంపికయ్యాయి. భారత్ గత మూడేళ్లుగా ఈ పోటీల్లో పాల్గొంటోంది. ఈసారి పోటీల్లో భారత్ తొలిసారిగా టీ–90 ట్యాంకులతో బరిలో దిగింది.