భారతీయ చరిత్ర, సంస్కతిలో 1526 సంవత్సరం నుంచి 1857 వరకు దాదాపు 331 ఏళ్లపాటు సాగిన మొగల్ రాజుల చరిత్ర కాగితాలను పూర్తిగా చింపేశారు. అయితే ముస్లిం దురాక్రమణదారుల తలలను మహారాజా సుహల్దేవ్ క్యారెట్ ముక్కల్లాగా తెగనరికేశారని ఉంది. జాతీయవాదంతోగానీ, స్వాతంత్య్ర పోరాటంతోగాని ముస్లింలకు ఎలాంటి పాత్రలేదు. దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ శతజయంతి ఉత్సవాల కమిటీ ప్రచురించిన పుస్తకంలో ఉన్నవి, లేనివి అంశాలివి. ఆయన శత జయంతి సందర్భంగా ఆగస్టు 20వ తేదీన ఉత్తరప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థిని విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ పుస్తకంలో నుంచే ప్రశ్నలు ఇస్తారట. సరైన జవాబులు, అంటే పుస్తకంలో ఇచ్చిన జవాబులు రాస్తే మంచి బహుమతులు ఇస్తారని నిర్వాహకులు చెబుతున్నారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోని కనీసం వంద స్కూళ్ల నుంచి 15 లక్షల మంది విద్యార్థిని, విద్యార్థులకు ఈ పుస్తకంలోని అంశాలపై క్విజ్ నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ పుస్తకంలో తొలి రాష్ట్రపతి ఎవరు ? లాంటి ప్రశ్నలు ఉన్నాయిగానీ తొలి ప్రధాన మంత్రి ఎవరన్న ప్రశ్న లేదు.
అంటే జవహర్ లాల్ నెహ్రూ ప్రస్థావనే లేదు. హిందూ మతం గురించి ఎక్కువే చెప్పారుగానీ, స్వాతంత్య్ర యోధుడిగానో, దళిత నాయకుడిగానో అంబేడ్కర్ ప్రస్థావన లేదు. ఇక దళితుల అణచివేతకు వ్యతిరేకంగా బౌద్ధం తీసుకున్న విషయ ప్రస్థావన ఉంటుందని ఊహించాల్సిన అవసరమే లేదు. హిందూత్వ నాయకులు వీడీ సావర్కర్, నానాజీ దేశ్‌ముఖ్‌ల గురించి ఎక్కువగానే ఉంది. శ్యామ ప్రసాద్ ముఖర్జీ కషి కారణంగా నేడు భారత్‌తో కశ్మీర్ కలిసి ఉందట. బీహార్‌కు చెందిన దళిత స్వాతంత్య్ర యోధుడు బిర్సా ముండా, సిక్కు గురువు గోవిం«ద్ సింగ్, వారణాసికి చెందిన మదన్ మోహన్ మాలవ్య గురించి కొన్ని వివరాలు ఉన్నాయి. సుభాస్ చంద్రబోస్, లాల్ బహుదూర్ శాస్త్రీల గురించి ఏకవాక్య ప్రస్థావనలు ఉన్నాయి.
ఇక భారత ఆర్థిక వ్యవస్థ గురించి 2014 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మాత్రమే రాశారు. ఆరెస్సెస్‌కు అనుబంధమైన భారతీయ మజ్దూర్ సంఘ్ దేశంలోకెల్లా అతిపెద్ద కార్మిక సంఘమట. ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన డిజిటల్ ఇండియా, మేకిన్ ఇండియా, స్టాండప్ ఇండియా, జీఎస్టీల గురించి ఉంది. స్వచ్ఛ భారత్ ప్రస్థావన అక్కర్లేదనుకున్నారు. బీజేపీ పేర్కొన్న దేశ హీరోల్లో గాంధీ, నెహ్రూల గురించి లేకపోయినా ఫర్వాలేదని, వారి గురించి విద్యార్థులకు నేడు కొత్తగా చెప్పాల్సిన అవసరమేమీ లేదని కాంగ్రెస్ నాయకుడు ఆర్పీఎన్ సింగ్ ఈ పుస్తకంపై వ్యాఖ్యానించారు. ఈ పుస్తకం బీజేపీ సిద్ధాంతాన్ని వ్యాప్తి చేస్తుందని, దీన్ దయాళ్ శతజయంతి ఉత్సవ కమిటీ సభ్యుడు, బీజేపీ అధికార ప్రతినిధి చంద్రమోహన్ వ్యాఖ్యానించారు.