లండన్‌లో భారతీయుల ‘విలాసం’
లండన్: విలాసవంతమైన నివాసాల కొనుగోలుకు భారతీయులు కోట్లాది పౌండ్లు కుమ్మరిస్తున్నారు. గత 18 నెలల్లో లండన్ నగరం నడిబొడ్డులో ఇళ్లు కొనడానికి ఏకంగా 100 కోట్ల పౌండ్లు ఖర్చు చేశారు. వీటిని మరింత సుందరంగా తీర్చిదిద్దడానికి వచ్చే ఐదేళ్లలో మరో 50 కోట్లు వెచ్చించనున్నారు. అక్కడ స్థిరాస్తుల కొనుగోలులో బ్రిటిష్ వారి తర్వాతి స్థానం మనవాళ్లదే. యూకే లగ్జరీ ప్రాపర్టీ ఏజెన్సీ వెదరెల్ విడుదల చేసిన తాజా నివేదికలో ఈ వివరాలు వెల్లడించారు. వీటిలో ముఖ్యాంశాలివీ...
భారత్‌లో రియల్టీ మార్కెట్ మందగించడంతో ఇక్కడి కుబేరులు లండన్‌లో సూపర్ ఫ్లాట్లు, ఎస్టేట్లు, హోటళ్లను కొంటున్నారు. 2013లో వీరు సెంట్రల్ లండన్‌లోని ఖరీదైన ప్రాంతాల్లో 45 కోట్ల పౌండ్లతో 221 నివాసాలు కొన్నారు. అక్కడి అత్యంత ఖరీదైన సెయింట్ జాన్స్ ఉడ్, బెల్‌గ్రేవియా, మేఫెయిర్ ప్రాంతాల్లోనూ కొనుగోళ్లు జరిపారు.
మేఫెయిర్‌లోని స్థిరాస్తుల్లో 30 శాతాన్ని స్థానికులు (బ్రిటిషర్లు) కొనుగోలు చేయగా, 25 శాతాన్ని భారతీయులు చేజిక్కించుకున్నారు.
అత్యధిక నెట్‌వర్త్ కలిగిన మూడు వేల మందికిపైగా భారతీయులు వేసవికాలంలో చల్లదనం కోసం లండన్ వస్తున్నారు. ఇందుకోసం వారు లండన్‌లో భవనాలు కొంటున్నారు. ఇలాంటి పెట్టుబడులు సురక్షితమని వారు భావిస్తున్నారు.
బెల్‌గ్రేవియా, నైట్స్‌బ్రిడ్జి వంటి ప్రాంతాలతో పోలిస్తే మేఫెయిర్‌లో రియల్టీ ధరలు తక్కువగా ఉన్నాయి. దీంతో భారతీయ కుబేరులు ఈ ప్రాంతంపై ఎక్కువ దృష్టి సారిస్తున్నారు.
భారత్‌లోని అతిపెద్ద రియల్టీ సంస్థ లోధా గ్రూప్ ఇటీవలే మేఫెయిర్‌లోని గ్రాస్‌వెనార్‌లో ఉన్న కెనడియన్ హైకమిషన్ భవంతిని 30.60 కోట్ల పౌండ్లతో కొనుగోలు చేసింది. ఏడు అంతస్తులతో 1.35 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఈ భవనాన్ని 18-20 లగ్జరీ హోమ్‌లుగా తీర్చిదిద్దాలని సంస్థ భావిస్తోంది.