బహ్రెయిచ్(ఉత్తరప్రదేశ్): భారత్- నేపాల్ సరిహద్దుల్లో పోలీసులు జరిపిన వాహన సోదాల్లో 170 కత్తులు లభించాయి. విశ్వసనీయ సమాచారం మేరకు.. మంగళవారం రాత్రి సరిహద్దు భద్రతా దళం, స్థానిక పోలీసులు కలిసి నేపాల్‌తోపాటు యూపీలోని మిగతా జిల్లాల వైపు వెళ్లే వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ సందర్బంగా రెండు బస్సుల్లో 93, 81 చొప్పున కత్తులు లభించాయి. దీనికి సంబంధించి నేపాల్‌కు చెందిన మున్నవర్, ఇర్పాన్, రాజుతోపాటు హర్దోయి జిల్లాకు చెందిన మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ జుగల్ కిషోర్ తెలిపారు.
కాగా, ఈ బస్సులో ప్రయాణికులెవరూ లేరని, పట్టుబడిన వారంతా బస్సు నిర్వాహకులేనని ఆయన వివరించారు. కత్తులను వారు నేపాల్‌కు తీసుకెళ్తున్నామని చెప్పారన్నారు. అయితే, మరింత సమాచారం రాబట్టాల్సి ఉందని తెలిపారు. పండుగ నేపథ్యంలో కత్తులు పెద్ద సంఖ్యలో లభించడంపై పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన అనంతరం వాహన లనిఖీలు ముమ్మరం చేశారు.