
జయహో.. జీశాట్
జీఎస్‌ఎల్వీ–ఎఫ్09 వాహక నౌక ద్వారా నింగిలోకి
► సాకారమైన ప్రధాని నరేంద్ర మోదీ కల
► దక్షిణాసియా దేశాలకు సమాచార, విపత్తు రంగాల్లో సాయం
► తొలిసారి ప్రాంతీయ సహకారం బలోపేతానికి ఉపగ్రహ సాయం
శ్రీహరికోట(సూళ్లూరుపేట), బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శుక్రవారం మరో అరుదైన ఘనత సాధించింది. సార్క్ దేశాలకు సమాచార, విపత్తు నిర్వహణ రంగాల్లో సేవలందించే జీశాట్–9 (దక్షిణాసియా ఉపగ్రహం) ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది. పూర్తిగా భారత ఆర్థిక సాయంతో నిర్మించిన ఈ ఉపగ్రహం సార్క్ సభ్య దేశాలైన భారత్, శ్రీలంక, భూటాన్, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, మాల్దీవులకు 12 ఏళ్ల పాటు సేవలందించనుంది. ప్రాంతీయ సహకారాన్ని బలోపేతం చేసేందుకు చేసిన ఈ ప్రయోగాన్ని చరిత్రాత్మక అడుగుగా భావిస్తున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ కోరిక మేరకు ఇస్రో నిర్మించిన జీశాట్–9ని శుక్రవారం సాయంత్రం 4.57 గంటలకు జీఎస్‌ఎల్వీ–ఎఫ్09 వాహక నౌక అంతరిక్షంలోకి మోసుకెళ్లింది. 28 గంటల కౌంట్‌డౌన్ ముగిసిన వెంటనే శ్రీహరికోటలో సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రంలోని రెండో ప్రయోగ వేదిక నుంచి జీఎస్‌ఎల్‌వీ రాకెట్ నిప్పులు చిమ్ముతూ దూసుకెళ్లింది. అనంతరం మూడు దశలను విజయవంతంగా అధిగమించి నిర్ణీత కక్ష్యలోకి జీశాట్–9ను ప్రవేశపెట్టింది. భూమి నుంచి బయల్దేరిన 17 నిమిషాల్లో ప్రయోగం విజయవంతమైంది. జీఎస్‌ఎల్వీ సిరీస్‌లో 11 ప్రయోగాలు చేయగా ఇస్రో శాస్త్రవేత్తలు ఎనిమిది సార్లు విజయం సాధించారు. అత్యంత బరువైన ఉపగ్రహాల్ని ప్రయోగించేందుకు ఇతర దేశాలపై ఆధారపడకుండా మనమే ప్రయోగించే సామర్థ్యం జీశాట్–9తో ఇస్రో సొంతమైంది. కక్ష్యలోకి చేరిన ఉపగ్రహం సక్రమంగా పనిచేస్తున్నట్లు హసన్‌లోని మాస్టర్ కంట్రోల్ సెంటర్ ప్రకటించిందని ఇస్రో తెలిపింది.
ప్రాజెక్టు కోసం రూ.450 కోట్ల ఖర్చు
జీశాట్–9 మొత్తం బరువు 2230 కిలోలు. ఇక జీఎస్‌ఎల్వీ–ఎఫ్9 పొడవు 49 మీటర్లు కాగా బరువు 415 టన్నులు. జీశాట్–9లోని కేయూ బ్యాండ్ ట్రాన్స్‌పాండర్ల ద్వారా దక్షిణాసియా దేశాలకు టెలి కమ్యునికేషన్స్, టెలివిజన్, డీ2హెచ్, వీశాట్స్, టెలి–ఎడ్యుకేషన్, టెలిమెడిసన్ వంటి రంగాల్లో పూర్తి స్థాయి సేవలు అందుతాయి. ఇక భూకంపాలు, తుపాన్‌లు, వరదలు, సునామీలు వంటి సమయంలో దక్షిణాసియా దేశాల మధ్య సమన్వయం కోసం హాట్‌లైన్ సంభాషణలకు వీలు కల్పిస్తుంది. జీశాట్–9 తయారీకి భారత ప్రభుత్వం మొత్తం రూ. 235 కోట్లు ఖర్చుచేసింది. మొత్తం ప్రాజెక్టుకు రూ.450కోట్లు వెచ్చించారు. క్రయోజనిక్ ఇంజిన్‌తో వరుసగా నాలుగోసారీ ఉపగ్రహ ప్రయోగం విజయవంతమవడంతో ఇక జీఎస్‌ఎల్‌వీ ప్రయోగాలకు తిరుగు ఉండదని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 2010లో రెండు జీఎస్‌ఎల్‌వీ ప్రయోగాలు విఫలమవడంతో ఇస్రో శాస్త్రవేత్తలు నాలుగేళ్లు శ్రమించి క్రయోజనిక్ ఇంజిన్లను మరింత అభివృద్ధి చేశారు. అనంతరం 2014 జనవరి, 2015 ఆగస్టు, 2016 సెప్టెంబర్‌లో చేసిన మూడు ప్రయోగాలతో హ్యాట్రిక్ సాధించింది.
2014లోనే ఉపగ్రహ ప్రయోగానికి నాంది
2014లో తన ప్రమాణ స్వీకారానికి సార్క్ కూటమి దేశాధినేతల్ని ప్రధాని మోదీ ఆహ్వానించారు. అనంతరం ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఒక ఉపగ్రహాన్ని కానుకగా ప్రకటించారు. ప్రధాని ఆకాంక్షను ఇస్రో విజయవంతంగా నిజం చేసింది. మొదట దీనికి సార్క్ ఉపగ్రహం అని పేరు పెట్టినా.. ప్రాజెక్టులో చేరేందుకు పాకిస్తాన్ నిరాకరించడంతో దక్షిణాసియా ఉపగ్రహంగా పేరు మార్చారు.
సమష్టి విజయం : ఇస్రో చైర్మన్ కిరణ్ కుమార్
ప్రయోగం అనంతరం ఇస్రో చైర్మన్ ఏఎస్ కిరణ్‌కుమార్ మాట్లాడుతూ ఇది సమష్టి విజయమని పేర్కొన్నారు. క్రయోజనిక్ దశను రూపొందించడంలో ఇస్రో శాస్త్రవేత్తలు చేసిన కృషి ప్రశంసనీయమైందని అభివర్ణించారు. ప్రధాని కోరిన మేరకు సార్క్‌దేశాలకు ఉపయోగపడే విధంగా ఒక ఉపగ్రహాన్ని తయారు చేయాలని ఆకాంక్షను నెరవేర్చినందుకు సంతోషంగా ఉందని చెప్పారు. భవిష్యత్తులో భారీ ప్రయోగాలు సైతం చేయగలమన్న నమ్మకం ఏర్పడిందని, వాణిజ్యపరంగా కూడా భవిష్యత్తులో మరెన్నో భారీ ప్రయోగాలు చేస్తామన్నారు.