శుద్ధి కేంద్రాలు లేకపోతే మూతే
పరిశ్రమలకు సుప్రీం హెచ్చరిక
న్యూఢిల్లీ: పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాల కారణంగా నీటి వనరులు కలుషిత మవడాన్ని నిరోధించేందుకు పరిశ్రమలు తప్పనిసరిగా ప్రాథమిక వ్యర్థాల శుద్ధి కేంద్రాలను (పీఈటీపీ)ను ఏర్పాటు చేయాల్సిందేనని సుప్రీంకోర్టు బుధవారం ఆదేశించింది. వాటిని ఏర్పాటు చేయని పరిశ్రమలను మూసేయాల్సిందిగా ఆయా రాష్ట్రాల కాలుష్య నియంత్రణ బోర్డు(పీసీబీ)లను ఆదేశించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్ నేతృత్వంలోని ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
మూడు నెలల్లోగా వ్యర్థాల శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయాలని అన్ని పరిశ్రమలకు నోటీసులు జారీ చేయాలని ఆయా రాష్ట్రాల పీసీబీలకు స్పష్టం చేసింది. అనంతరం తనిఖీలు నిర్వహించి వాటిని ఏర్పాటు చేయని పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అలాగే మూడేళ్ల లోగా కామన్ ఎఫ్లుయెంట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ల (సీఈపీటీ)ను ఏర్పాటు చేయాలని స్థానిక, మున్సిపల్ అధికారులను కోరింది. సీఈపీటీల ఏర్పాటుపై ఎన్టీటీకి నివేదికలు సమర్పించాలని ఆదేశించింది. సీఈపీటీల ఏర్పాటు, నిర్వహణకు ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తితే, వినియోగదారులపై పన్ను విధించేందుకు మార్గదర్శకాలు రూపొం దించాలని ఆదేశించింది.