
జైలులో గుర్మీత్: ఆసక్తికర విషయాలు
రోహతక్: లైంగిక వేధింపుల కేసులో శిక్ష అనుభవిస్తున్న డేరా సచ్ఛా సౌదా గురువు గుర్మీత్ రాం రహీమ్ సింగ్ జైల్లో చాలా మధనపడుతున్నారు. సునైరా జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఆయన ఎలా ఉన్నారనే దాని గురించి దళిత నాయకుడు స్వదేశ్ కిరాద్ వెల్లడించారు. బెయిల్‌పై ఈరోజు ఆయన సునైరా జైలు నుంచి విడుదలయ్యారు. జైల్లో గుర్మీత్ ఎలా ఉన్నారనే విషయాల గురించి మీడియాతో చెప్పారు.
రేప్ కేసులో దోషిగా తేలి, శిక్ష పడినప్పటి నుంచి గుర్మీత్ తనలో తాను మాట్లాడుకుంటున్నారని కిరాద్ తెలిపారు. దేవుడా నేనేం తప్పు చేశాను? నేను చేసిన నేరం ఏమిటి? అంటూ తనలో తాను గుర్మీత్ మాట్లాడుకుంటున్నారని చెప్పారు. దోషిగా తేలడంతో ఆగస్టు 25 రాత్రి జైలులో గుర్మీత్ ఆహారం తీసుకోలేదని, నేలపై కూర్చుని రాత్రంతా ఏడుస్తూనే ఉన్నారని వెల్లడించారు. శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పిన వెంటనే మోకాళ్లపై కూలబడి.. 'నన్ను ఉరి తీయండి, నాకు బతకాలని లేద'ని రోదించినట్టు అన్నారు. ఆయనకు ఎటువంటి ప్రత్యేక సౌకర్యాలు కల్పించలేదని, సాధారణ ఖైదీలాగే పరిగణిస్తున్నారని తెలిపారు.
గుర్మీత్‌ను కోర్టు దోషిగా నిర్ధారించిన తర్వాత ఆయన పేరుతో హరియాణా, పంజాబ్ రాష్ట్రాల్లో నిరసనకారులు హింసకు దిగడం పట్ల ఖైదీలు ఆగ్రహం వ్యక్తం చేశారని చెప్పారు. జైలులో గుర్మీత్‌పై దాడి జరిగే అవకాశముందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇద్దరు మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో గుర్మీత్‌కు ఆగస్టు 28న కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే.