సోలార్ అలయన్స్.. మనకు మేలే!
వాతావరణ మార్పుల నుంచి మానవాళిని రక్షించే లక్ష్యంతో మొదలైన పారిస్ సదస్సు మరో రెండు రోజుల్లో ముగియనుంది. భూ తాపోన్నతిని ఎన్ని డిగ్రీలకు పరిమితం చేయాలి?, ఆర్థిక వనరుల సమీకరణ ఎలా? అన్న అంశాలపై తర్జనభర్జనలు కొనసాగుతూనే ఉన్నాయి. ధనిక దేశాలు పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఎంత మేరకు సాయం చేస్తాయన్న విషయం ఇప్పటికీ తేలకపోయినా...
ఈ సదస్సు మొత్తమ్మీద భారత్ లాంటి అభివృద్ది చెందుతున్న దేశాలకు, ఆఫ్రికా, లాటిన్ అమెరికాల్లోని పేద దేశాలకూ మంచి చేసే ఓ పరిణామం హైలైట్‌గా నిలిచింది. భారత్‌తోపాటు ఫ్రాన్స్ ప్రతిపాదించిన ఈ సరికొత్త ప్రయత్నం పేరు 'ద ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్'
పర్యావరణ పరిరక్షణకు, భూ తాపోన్నతికి కారణమవుతున్న గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాల తగ్గింపునకూ సౌరశక్తి మేలైన మార్గమని అందరూ అంగీకరిస్తారు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా అందుబాటులో ఉన్నప్పటికీ... ధర వరలూ క్రమేపీ తగ్గుతున్నప్పటికీ ఈ ప్రత్యామ్నాయ ఇంధన వనరుకు లభిస్తున్న ఆదరణ అంతంత మాత్రమే దీనికి కారణాలు అనేకం. బొగ్గు, చమురు ఆధారిత విద్యుదుత్పత్తితో పోలిస్తే సౌరశక్తి ఇప్పటికీ ఖరీదైంది కావడం ఒక కారణమైతే... మరింత మెరుగైన చౌకైన సౌరశక్తి ఘటకాలను తయారీకి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న దేశాల వద్ద లేకపోవడం మరో కారణం.
పరిశోధనలకు అవసరమైన నిధుల లేమి కూడా సౌరశక్తిలో ముందంజ వేసేందుకు అవరోధంగా మారుతోంది. ఈ సమస్యలన్నింటికీ ‘ద ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్’ ద్వారా చక్కటి పరిష్కార మార్గం చూపారు ప్రధాని నరేంద్రమోదీ! అమెరికా, చైనా, బ్రెజిల్‌లతోపాటు దాదాపు 120 దేశాలు కలిసికట్టుగా సౌరశక్తి ఉత్పత్తి, పంపిణీ, నిల్వ వంటి అన్ని అంశాలపై పరిశోధనలకు ముమ్మరం చేసేందుకు ఈ అలయన్స్ అవకాశం కల్పిస్తోంది. అన్ని దేశాలూ సంయుక్తంగా దాదాపు 1000 కోట్ల డాలర్ల (దాదాపు రూ.65 వేల కోట్లు) పెన్నిధిని ఏర్పాటు చేస్తూండటం వల్ల పరిశోధనలు వేగం పుంజుకుంటాయని, ఫలితాలూ తొందరగా అందుతాయని అంచనా.
స్పర్దయా వర్దతే విద్య: పోటీ ఉన్నప్పుడే విద్యలో రాణిస్తారన్న ఈ సంస్కృత నానుడి సౌరశక్తి విషయంలోనూ సరిపోతుంది. సోలార్ అలయన్స్ ఏర్పాటుతో పరిశోధనలకు అవసరమైన నిధులు దండిగా అందుబాటులో ఉండటం వల్ల సౌరశక్తి రంగంలో ఎన్నడూ లేని స్థాయిలో పోటీ ఏర్పడుతుందనడంలో సందేహం లేదు. 120 దేశాల శాస్త్రవేత్తలు తమకు తెలిసిన విజ్ఞానాన్ని పంచుకోవడం మొదలుపెడితే కొరకరాని కొయ్యల్లాంటి సమస్యలకూ ఇట్టే పరిష్కారం లభించే అవకాశాలున్నాయి. అదే సమయంలో అంతర్జాతీయ సమాఖ్య నడిపించే ప్రాజెక్టు కాబట్టి.. ప్రైవేట్ పెట్టుబడులు పెరుగుతాయి. అదే సమయంలో సౌరశక్తి ధరలు తగ్గుతాయి. ఇప్పటికే కొన్ని దేశాల్లో ఇది సంప్రదాయ ఇంధన వనరుల స్థాయికి పడిపోవడం గమనార్హం. మొత్తమ్మీద చూస్తే భూతాపోన్నతిని 2 డిగ్రీలకు పరిమితం చేసి వాతావరణ మార్పుల దుష్ర్పభావాన్ని తట్టుకోవాలన్న మానవ సంకల్పమూ వాస్తవం కావచ్చు!
లాభం మనకే ఎక్కువ...
అవసరం ప్రపంచమంతా ఉన్నా సౌరశక్తి అధికోత్పత్తికి భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న దేశాల్లోనే అవకాశాలు ఎక్కువ. సూర్యుడి నుంచి వెలువడే రేడియో ధార్మికత ఈ ప్రాంతాల్లో అధికంగా ఉండటం దీనికి కారణం. భారత్ విషయాన్నే తీసుకుంటే సంవత్సరం పొడవునా దాదాపు 300 రోజుల పాటు సూర్యరశ్మి మనకు అందుబాటులో ఉంటుంది. ఉత్తర ఆఫ్రికా దేశాలూ. కొన్ని లాటిన్ అమెరికన్ దేశాల్లోనూ ఇదే పరిస్థితి. సోలార్ ఫార్మ్స్ ఏర్పాటుకు విస్తారమైన నేల అందుబాటులో ఉండటం, ఎడారి ప్రాంతాల్లోనూ వీటిని ఏర్పాటు చేయగలగడం ఈ దేశాలకు కలిసివచ్చే అంశం. థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణానికి ఏళ్లు పడితే... సోలార్ ఫార్మ్స్ ఏర్పాటును నెలల్లోనే పూర్తి చేయవచ్చు.
సోలార్ అలయన్స్ అంటే...
సౌరశక్తి రంగంలో పరిశోధనలకు ప్రోత్సాహమిచ్చేందుకు, టెక్నాలజీల అభివృద్ధి, ప్రామాణీకరణల కోసం ఏర్పడ్డ 120 దేశాల సమాఖ్య.
ప్రతిపాదించింది ఎవరు...?
ప్యారిస్ సదస్సులో భారత ప్రధాని నరేంద్రమోదీ ఈ సమాఖ్య ఏర్పాటును ప్రతిపాదించారు.
ఏఏ దేశాలు ...
అమెరికా, చైనా, ఫ్రాన్స్ వంటి అభివృద్ది చెందిన దేశాలతోపాటు ఈజిప్ట్, మొరాకో, బ్రెజిల్, థాయ్‌లాండ్, సౌతాఫ్రికా వంటి ఆఫ్రికా, లాటిన్ అమెరికన్ దేశాలు ఈ సమాఖ్యలో సభ్యులు.
ఏం చేస్తారు?
దాదాపు రూ.65 వేల కోట్ల నిధుల్ని సమీకరించి సౌరశక్తిని మరింత చౌకగా ఉత్పత్తి చేసేందుకు పరిశోధనలు ముమ్మరం చేస్తారు. ఇందులో భారత్ వాటా దాదాపు రూ.2500 కోట్లు. ప్రస్తుతానికి న్యూఢిల్లీలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ ప్రధాన కేంద్రంగా పనిచేసే సోలార్ అలయన్స్ శాశ్వత భవన నిర్మాణానికి అవసరమైన స్థలం, నిధులు కూడా భారత్ సమకూర్చనుంది.
ప్రయోజనమెవరికి?
భూమధ్య రేఖకు అటు ఇటూ కర్కాటక, మకర రేఖల మధ్యలో ఉండే
అన్ని దేశాలూ లాభపడతాయి. సౌరశక్తి ఉత్పత్త సామర్థ్యం
ఎక్కువగా ఉండటం దీనికి కారణం.
సౌరశక్తి ధరలు (ఒక వాట్ విద్యుత్తుకు)
1977లో.... 76 డాలర్లు
2015లో.... 0.30 డాలర్లు
భారత్‌లో ప్రతి చదరపు మీటర్ నేలతో ఉత్పత్తి చేయగల సౌరశక్తి... 0.25 కిలోవాట్స్/గంటలు.
2015 నాటికి దేశంలో స్థాపిత సౌరశక్తి సామర్థ్యం... 4 గిగావాట్లు
2022 నాటికి లక్ష్యం... 100 గిగావాట్లు!