![‘కార్టోశాట్ –2డీ’నే కీలకం](/styles/webp/s3/article_images/2017/09/5/71487101165_625x300.jpg.webp?itok=41rk8Ik5)
‘కార్టోశాట్ –2డీ’నే కీలకం
శ్రీహరికోట (సూళ్లూరుపేట): పీఎస్‌ఎల్వీ రాకెట్ 104 ఉపగ్రహాల్ని భూమికి 505–524 కి.మీ.ల మధ్యలో సూర్యానువర్తన ధృవకక్ష్య(సన్ సింక్రోనస్ ఆర్బిట్)లో ప్రవేశపెడుతుంది. ఇందులో ప్రధానంగా కార్టోశాట్–2డీ ఉపగ్రహం 510 కిలోమీటర్ల ఎత్తులో పరిభ్రమిస్తూ భూమిపై మార్పుల్ని ఫొటోలు తీస్తుంది. నానో శాటిలైట్స్ (ఐఎన్ ఎస్–1ఏ, ఐఎన్ ఎస్–1బీ)లు మాత్రం 6 నెలలు మాత్రమే పనిచేస్తాయి.
కార్టోశాట్–2డీ..
భౌగోళిక సమాచారం కోసం కార్టోశాట్ ఉపగ్రహాల ప్రయోగాన్ని 2005లో ప్రారంభించారు. కార్టోశాట్–1, 2, 2ఏ, 2బీ, 2సీ అనంతరం తాజాగా కార్టోశాట్–2డీ రోదసీలోకి పంపుతున్నారు. ఈ ఉపగ్రహంలో అమర్చిన ఫ్రాంక్రోమాటిక్ మల్టీ స్ప్రెక్ట్రల్ కెమెరా భూమిని నిశితంగా పరిశీలిస్తూ అత్యంత నాణ్యమైన చాయాచిత్రాల్ని పంపిస్తుంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల సమాచారంతోపాటు తీరప్రాంతపు భూములు, వ్యవసాయ, సాగునీటి పంపిణీ, రోడ్ల సమాచారాన్ని క్షుణ్నంగా అందిస్తుంది. పట్టణాభివృద్ధిలో ఈ ఉపగ్రహ చిత్రాలు కీలక భూమిక పోషించనున్నాయి. భూమిపై మార్పులను ఎప్పటికప్పుడు ఛాయా చిత్రాలు తీసి పంపుతుంది.
ఇస్రో నానో శాటిలైట్స్
ఇస్రో నానో శాటిలైట్స్ (ఐఎన్ ఎస్–1ఏ, ఐఎన్ ఎస్–1బీ) ఉపగ్రహాల్ని అహ్మదాబాద్‌లో స్పేస్ అప్లికేషన్ సెంటర్ రూపొందించింది. రెండు ఉపగ్రహాల బరువు 18.1 కేజీలు మాత్రమే. 8.4 కేజీల బరువున్న ఐఎన్ ఎస్–1ఏలో 5 కేజీల పేలోడ్స్‌ను అమర్చారు. బైడెరెక్షనల్ రెఫె్లక్టెన్స్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ రేడియో మీటర్ (బీఆర్‌డీఎఫ్), సింగిల్ ఈవెంట్ అప్‌సెట్ మానిటర్ (ఎస్‌ఈయూఎం) పేలోడ్స్‌ను పొందుపర్చారు. ఐఎన్ ఎస్–1ఏ కూడా రిమోట్ సెన్సింగ్ శాటిలైటే. భూమిపై సూర్యుడి ప్రభావాన్ని తెలియచేయడంతో పాటు, రేడియేషన్ ఎనర్జీని లెక్కిస్తుంది. 9.7 కేజీలు బరువు కలిగి ఐఎన్ ఎస్–1బీ ఉపగ్రహంలో ఎర్త్ ఎక్సోస్పియర్ లేమాన్ ఆల్ఫా అనాలసిసర్(ఈఈఎల్‌ఏ), ఆర్గామీ కెమెరా పేలోడ్స్ అమర్చారు. ఇది కూడా భూమికి సంబంధించిన సమాచారం అందజేస్తుంది.
విదేశీ ఉపగ్రహాలు
అమెరికాకు చెందిన డవ్ ఫ్లోక్–3పీ శాటిలైట్స్‌లో 88 చిన్న ఉపగ్రహాలుంటాయి. వీటిని ఒక బాక్స్‌లో అమర్చారు. స్పేస్‌లోకి వెళ్లగానే బాక్స్‌ను అమెరికా అంతరిక్ష సంస్థ గ్రౌండ్ స్టేషన్ నుంచి తెరుస్తారు. ఈ ఉపగ్రహాలు వాణిజ్య ప్రయోజనాలు అందించడంతో పాటు వాతావరణ సమాచారం తెలియచేస్తాయి. లేమూర్ ఉపగ్రహాల వ్యవస్థలో మొత్తం 8 ఉపగ్రహాలున్నాయి. అంతరిక్షంలోకి వెళ్లాక ఇవి ఉన్న బాక్స్‌ను తెరుస్తారు. ఇవి కూడా భూమికి సంబంధించిన సమాచారాన్ని అందిస్తాయి.
ఉపగ్రహం బరువు దేశం
పీయాస్ 3 కేజీలు నెదర్లాండ్స్
డిడో2 4.2 కేజీలు స్విట్జర్లాండ్
బీజీయూ శాట్ 4.3 కేజీలు ఇజ్రాయెల్
ఆల్–ఫరాబి–1 1.7 కేజీలు కజకిస్తాన్
నాయిప్ 1.1 కేజీలు యూఏఈ
ఈ ఉపగ్రహాల్ని కూడా సాంకేతిక ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. చిన్న చిన్న అప్లికేషన్స్ తయారీలో సాయపడతాయి.