PSLV rocket
-
శ్రీహరికోట: PSLV C59 ప్రయోగం వాయిదా
తిరుపతి, సాక్షి: శ్రీహరికోట నుంచి భారత అంతరిక్ష పరిశోధన నిర్వహించాల్సిన పీఎస్ఎల్వీ C-59 ప్రయోగం వాయిదా పడింది. ప్రయోగానికి గంట ముందు.. ప్రోబా-3లో సాంకేతిక సమస్య తలెత్తినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. దీంతో అధికారులు కౌంట్‌డౌన్ నిలిపివేసి.. ప్రయోగాన్ని వాయిదా వేశారు. గురువారం సాయంత్రం 4.12 గంటలకు పీఎస్ఎల్వీ-సీ59 నింగిలోకి పంపుతామని ఇస్రో ప్రకటించింది. యురోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోబా-3లో రెండు ఉపగ్రహాలు ఉంటాయి. వీటి బరువు 550 కిలోలు. సూర్యుడి బాహ్య వాతావరణమైన కరోనాపై పరిశోధనలు చేయడం ఈ ప్రాజెక్టు ఉద్దేశం. ఇందుకోసం పరస్పరం సమన్వయంతో ఒక క్రమపద్ధతిలో భూకక్ష్యలో విహరిస్తాయి. ఈ తరహా ప్రయోగాన్ని చేపట్టడం ప్రపంచంలోనే ఇది మొదటిసారి!. -
వచ్చేనెల్లో షార్ నుంచి రెండు ప్రయోగాలు
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశో«ధనా సంస్థ (ఇస్రో) డిసెంబర్లో సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లోని మొదటి ప్రయోగవేదిక నుంచి రెండు పీఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగాలను చేపట్టనున్నది. డిసెంబర్ 4న పీఎస్ఎల్వీ సీ59, 24న పీఎస్ఎల్వీ సీ60 రెండో రాకెట్ ప్రయోగానికి సన్నాహాలు చేస్తున్నారు. షార్‌లోని మొదటి ప్రయోగ వేదికకు సంబం«ధించి మొబైల్ సరీ్వస్ టవర్ (ఎంఎస్టీ)లో పీఎస్ఎల్వీ సీ59, పీఎస్ఎల్వీ ఇంటిగ్రేషన్ బిల్డింగ్‌లో పీఎస్ఎల్వీ సీ60 రాకెట్ అనుసంధానం పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ముందుగా డిసెంబర్ 4న పీఎస్ఎల్వీ సీ59 రాకెట్ ద్వారా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోభా–3 అనే ఉపగ్రహంతో పాటు మరో నాలుగు చిన్న తరహా ఉపగ్రహాలను వాణిజ్యపరంగా ప్రయోగించనున్నారు. డిసెంబర్ 24న పీఎస్ఎల్వీ సీ60 ద్వారా రిశాట్–1బి అనే ఉపగ్రహంతో పాటు మరో నాలుగు వాణిజ్యపరమైన ఉపగ్రహాలను ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. -
రేపు ఆదిత్య–ఎల్1 ప్రయోగం
సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): సూర్యుడిపై పరిశోధనల నిమిత్తం ‘ఇస్రో’ శనివారం తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి పీఎస్ఎల్వీ సీ57 రాకెట్ ద్వారా ఆదిత్య–ఎల్1 ఉపగ్రహాన్ని ప్రయోగించబోతోంది. రెండో ప్రయోగ వేదిక నుంచి శనివారం ఉదయం 11.50 గంటలకు ఈ ప్రయోగాన్ని నిర్వహించనున్నారు. ఇందుకోసం శుక్రవారం ఉదయం 11.50 గంటలకు కౌంట్‌డౌన్ ప్రక్రియ ప్రారంభించనున్నారు. గురువారం షార్‌లోని బ్రహ్మప్రకాష్‌హాలులో మిషన్ సంసిద్ధత సమావేశం నిర్వహించారు. పీఎస్ఎల్వీ సీ57 రాకెట్‌కు అన్ని పరీక్షలు నిర్వహించి లాంచ్ ఆథరైజేషన్ బోర్డు(ల్యాబ్)కు అప్పగించారు. ల్యాబ్ చైర్మన్ రాజరాజన్ రాకెట్‌కు మరోసారి పరీక్షలు నిర్వహించి కౌంట్‌డౌన్, ప్రయోగ సమయాన్ని అధికారికంగా ప్రకటించారు. సూర్యుడు ఒక మండే అగ్నిగోళం. అక్కడికి ఉపగ్రహాన్ని పంపిస్తే కాలిపోతుంది కదా.. అనే అనుమానం చాలా మందిలో ఉంటుంది. వాస్తవానికి ఈ ప్రయోగంలో భూమి నుంచి సూర్యుడి దిశగా 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాంగ్రేజియన్ బిందువు–1(ఎల్–1) చుట్టూ ఉన్న కక్ష్యలోకి దాదాపు 1,470 కిలోల బరువున్న ఆదిత్య–ఎల్1 ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టనున్నారు. దీనివల్ల గ్రహణాలతో సంబంధం లేకుండా సౌరగోళంపై నిరంతరం అధ్యయనం చేసేందుకు అవకాశం లభిస్తుంది. ఇది కూడా చదవండి: మోదీ సర్కార్ బిగ్ ప్లాన్.. తెరపైకి వన్ నేషన్, వన్ ఎలక్షన్ బిల్లు? -
వీడిన మిస్టరీ.. అది భారత్‌కు చెందిన రాకెట్‌దే!
ఆస్ట్రేలియా ఒడ్డుకు కొట్టుకొచ్చిన అంతుచిక్కని వస్తువు మిస్టరీ వీడింది. అది భారత్‌కు చెందిన రాకెట్‌దేనని అక్కడి అధికారులు ప్రకటించారు. పశ్చిమ ఆస్ట్రేలియాలోని పెర్త్‌కు ఉత్తరాన రెండు గంటల ప్రయాణంలో ఉన్న జురియన్ బే సమ్పీంలో జులై మధ్యవారంలో ఈ వస్తువు తొలిసారిగా కనిపించింది. ఆరు ఫీట్ల ఎత్తు.. కేబుల్స్ వేలాడుతూ కనిపించింది అది. ఆ సమయంలో ఇది చంద్రయాన్-3కి చెందిన శకలం అంటూ ప్రచారాలు చేశారు కొందరు. మరోవైపు ఇంకొందరు తొమ్మిదేళ్ల కిందట అదృశ్యమైన మలేషియా ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ MH 370 విమానందేమో అనే సందేహాలు వ్యక్తం అయ్యాయి. ఈ తరుణంలో ఆస్ట్రేలియన్ స్పేస్ ఏజెన్సీ దానిని అధ్యయనం చేసి సోమవారం ఒక ప్రకటన చేసింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రయోగించిన పోలార్ శాటిలైట్ లాంఛ్ వెహికిల్(PSLV)కి చెందిన శకలమని ప్రకటించారు అధికారులు. అయితే.. అంతర్జాతీయ ఒప్పందాల పరిధిలోకి లోబడి ఇరు దేశాలు సంయుక్త ప్రకటన వెలువరించాల్సి ఉందని ఆస్ట్రేలియా స్పేస్ ఏజెన్సీ చెబుతోంది. అయితే తాము పరిశీలించిన తర్వాతే ప్రకటన చేస్తామని ఇస్రో ఇదివరకే ప్రకటించగా.. ఇక అది ఎప్పటిది అనే దానిపై ఇస్రో అధికారులే స్పష్టత ఇవ్వాల్సి ఉంది. PSLV ప్రయోగ దశల్లో ఇలా శలాలను సముద్రంలో పడేయడం సాధారణంగా జరిగేదే. ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియా తీరానికి ఇలాంటి స్పేస్‌జంక్ కొట్టుకురావడం ఇదే తొలిసారి కాదు. గత ఆగష్టులో ఎలన్ మస్క్ స్పేస్ ఎక్స్‌కు చెందిన ఫాల్కన్ రాకెట్ శకలం న్యూసౌత్‌వేల్స్‌లోని ఓ గడ్డి మైదనాంలో పడగా.. ఓ గొర్రెల కాపరి దానిని గుర్తించి అధికారులకు సమాచారం అందించాడు. Last friday, people in Australia reported seeing a comet/UFO in the sky which turned out to be the LVM3 rocket that launched #Chandrayaan3. And now, the third stage of a PSLV rocket has washed ashore on the coast of Green Head, Western Australia! #ISRO pic.twitter.com/FFVwhooSyE — Debapratim (@debapratim_) July 17, 2023 -
రాకెట్ ప్రయోగం సక్సెస్.. ఇస్రో బృందానికి సీఎం జగన్ శుభాకాంక్షలు
సాక్షి, తాడేపల్లి: ఇస్రో చేపట్టిన పీఎస్ఎల్వీ సీ-56 రాకెట్ ప్రయోగం విజయవంతమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాకెట్ విజయవంతమైన నేపథ్యంలో ఇస్రో శాస్త్రవేత్తలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. ఏడు ఉపగ్రహాలతో విజయవంతంగా రాకెట్‌ను ప్రయోగించిన ఇస్రో బృందానికి శుభాకాంక్షలు చెప్పారు. అలాగే, భవిష్యత్తులో ఇస్రో మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. Read More.. పీఎస్ఎల్వీ సీ-56 రాకెట్ ప్రయోగం విజయవంతం -
PSLV-C52 రాకెట్ ప్రయోగానికి ప్రారంభమైన కౌంట్‌డౌన్
-
14న పీఎస్ఎల్వీ–సీ52 ప్రయోగం
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శ్రీహరికోట రాకెట్ కేంద్రంలోని రెండో ప్రయోగ వేదిక నుంచి 14వ తేదీ ఉదయం 5.59 గంటలకు పీఎస్ఎల్వీ–సీ52 రాకెట్ ప్రయోగాన్ని నిర్వహించేందుకు శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి 25.30 గంటల ముందు అంటే ఈ నెల 13 తెల్లవారు జామున 4.29 గంటలకు కౌంట్‌డౌన్ ప్రక్రియను నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్టు బుధవారం ఇస్రో ప్రకటించింది. ఈ ప్రయోగంలో భాగంగా షార్ కేంద్రంలోని రెండో ప్రయోగ వేదికకు సంబంధించిన వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్‌లో నాలుగు దశల రాకెట్ అనుసంధానాన్ని పూర్తిచేసి బుధవారం ఉదయం వ్యాబ్ నుంచి హుంబ్లికల్ టవర్‌కు తరలించే ప్రక్రియను విజయవంతంగా నిర్వహించారు. రాకెట్‌ను ప్రయోగ వేదికకు అనుసంధానం చేసి నాలుగు రోజుల పాటు పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధం చేశారు. ఈ ప్రయోగంలో 1,710 కిలోల బరువున్న రాడార్ ఇమేజింగ్ శాటిలైట్(ఈఓఎస్–04) ఉపగ్రహంతో పాటు మరో రెండు చిన్న ఉప గ్రహాలను కూడా రోదసీలోకి పంపుతున్నారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ అండ్ టెక్నాలజీ (ఐఐఎస్టీ) వారు రూపొందించిన ఇన్స్పైర్ శాట్–1, ఇండియా–భూటాన్ సంయుక్తంగా తయారు చేసిన ఐఎన్ఎస్–2బీ ఉపగ్రహాలనూ రోదసీలోకి పంపనున్నారు. అయితే ఇందులో ప్రధానంగా రాడార్ ఇమేజింగ్ శాటిలైట్‌ను భూమికి 529 కి.మీ ఎత్తులోని సన్ సింక్రనస్ ఆర్బిట్‌లో ప్రవేశపెడతారు. ఈ ఉపగ్రహ ప్రయోగం.. వాతావరణ పరిశోధన, వ్యవసాయం, అటవీశాఖ, వరదలు, విపత్తుల పరిశోధనకు ఉపయోగపడుతుంది. ఈ నెల 12న మిషన్ రెడీనెస్ సమీక్ష నిర్వహిస్తారు. -
పీఎస్ఎల్వీ సీ53 అనుసంధాన పనులు ప్రారంభం
సూళ్లూరుపేట: నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్(షార్) నుంచి పీఎస్ఎల్వీ సీ53 ప్రయోగం నిర్వహించేందుకు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. షార్‌లోని మొదటి ప్రయోగ వేదికపై రాకెట్ అనుసంధాన పనులు ప్రారంభమయ్యాయి. రెండు, మూడుదశల పరీక్షలు జరుగు తున్నాయి. ఈ నెల 20న ఈ ప్రయోగాన్ని నిర్వహిం చాలని నిర్ణయించారు. అయితే ఉపగ్రహం రావడంలో జాప్యం జరిగితే ప్రయోగం ఫిబ్రవరికి వాయిదా పడే అవకాశముందని సమాచారం. పీఎస్ఎల్వీ సీ53 ద్వారా ఈఓఎస్–6(ఓషన్‌శాట్–3) అనే ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపించనున్నారు. -
సక్సెస్ మంత్ర: రైతు బిడ్డ నుంచి ఇస్రో శాస్త్రవేత్తగా..
సూళ్లూరుపేట: కేరళలోని కన్నూరు జిల్లా పయ్యనూర్ అనే మారుమూల గ్రామంలో ఒక నిరుపేద రైతు కుటుంబంలో జని్మంచిన కున్హికృష్ణన్ ఇస్రో శాస్త్రవేత్త, ప్రొఫెసర్ యూఆర్‌రావు స్పేస్ సెంటర్ (బెంగళూరు) డైరెక్టర్ పి.కున్హికృష్ణన్ బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు గడించారు. పీఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగాలను సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించి సక్సెస్‌ను అందించిన ఘనత ఆయనదే. 1986లో ఇస్రోలో ప్రవేశం కేరళలోని పయ్యనూరులోనే కున్హికృష్ణన్ ప్రాథమిక విద్యాభాసం. 1981లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, మ్యాథ్స్ గ్రాడ్యుయేట్ పూర్తి చేశారు. త్రివేండ్రం యూనివర్సిటీలో ఎల్రక్టానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో 1986లో పట్టా పుచ్చుకున్నారు. అదే సంవత్సరం కేరళలోని త్రివేండ్రం విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (వీఎస్ఎస్సీ)లో మెకానిజం వెహికల్ ఇంటిగ్రేషన్ అండ్ టెస్లో ఇంజినీర్‌గా ఉద్యోగంలో చేరారు. ఈ విభాగంలో మంచి పరి«ణితి సాధించిన తర్వాత 2009లో పీఎస్ఎల్వీ సీ12, పీఎస్ఎల్వీ సీ13 , పీఎస్ఎల్వీ సీ15 ప్రయోగాలకు అసోసియేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా పని చేస్తూ వీఎస్ఎస్సీ నుంచి షార్కి వచ్చి ప్రయోగాలు పూర్తయ్యే వరకు ఇక్కడే ఉండి విజయవంతం చేశారు. పీఎస్ఎల్వీ రాకెట్ ఇంటిగ్రేషన్ విషయంలో మంచి ఫలితాలు చూపించడంతో పీఎస్ఎల్వీ సీ 15 ప్రయోగం నుంచి పీఎస్ఎల్వీ సీ 27 వరకు 13 పీఎస్ఎల్వీ ప్రాజెక్ట్‌లకు ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా పనిచేసి అన్ని ప్రయోగాలను విజయవంతం చేశారు. ఆ తర్వాత ఆయన షార్ డైరెక్టర్‌గా పదోన్నతి కలి్పంచి షార్ డైరెక్టర్‌గా 2015 నుంచి 2018 దాకా సక్సెస్ పుల్ డైరెక్టర్‌గా పేరు గడించారు. ఆయన డైరెక్టర్‌గా పని చేసిన కాలంలో 17 పీఎస్ఎల్వీ ప్రయోగాలు, ఐదు జీఎస్ఎల్వీ ప్రయోగాలు చేశారు. ఇందులో అత్యంత ప్రతిష్టాత్మకమైన మంగళ్యాన్–1 ప్రయోగానికి ప్రాజెక్టు డైరెక్టర్‌గా వ్యవహరించింది కూడా పి కున్హికృష్ణన్ కావడం విశేషం. ఇస్రో చైర్మన్ డాక్టర్ కే శివన్ ఇతని ప్రతిభను గుర్తించి బెంగళూరులోని ప్రొఫెసర్ యూఆర్‌రావు స్పేస్ సెంటర్ డైరెక్టర్ (ఉపగ్రహాల తయారీ కేంద్రం)కు బదిలీ చేశారు. ఇస్రోలో అన్ని రకాలుగా సేవల అందించి దేశానికి ఉపయోగపడిన కున్హికృష్ణన్ సోమవారం ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఎన్నో అవార్డులు ►2010 : మొట్టమొదటగా ఇస్రో ఇండిజువల్ మెరిట్ ఆవార్డును అందుకున్నారు. ►2011 : ఆస్ట్రోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా అవార్డు ►2013 : పీఎఫ్ఎల్వీ సీ25–మంగళ్యాన్–1 ప్రయోగాన్ని సక్సెస్ పుల్గా నిర్వహించినందుకు ఇస్రో టీమ్ ఎక్స్‌లెన్స్ అవార్డు టీమ్ లీడర్‌గా అందుకున్నారు. ►2013 : ఇస్రో ఫెర్ఫార్మెన్స్ ఎక్స్‌లెన్స్ అవార్డు. ►2015 : స్వదేశీ శాస్త్ర పురస్కార్ ►2017 : మధ్యప్రదేశ్ ప్రభుత్వం విజ్ఞాన్ ప్రతిభా సమ్మాన్ అవార్డు. ►2018 : ఇస్రో అవుట్ స్టాండింగ్ అచీవ్ మెంట్ ఆవార్డు. ►2020 : తమిళనాడు స్టేట్ సెంటర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ (ఇండియా)వారు ఎమినెంట్ ఇంజినీర్ అవార్డులను అందుకున్నారు. చదవండి: నైపుణ్య కళాశాలలు: ఏపీ సర్కార్ కీలక ముందడుగు.. వారెప్పటికీ అనాథలు కారు..! -
పీఎస్ఎల్వీ–సీ51 ప్రయోగంలో తిరుపతి విద్యార్థులు
యూనివర్సిటీ క్యాంపస్: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) విజయవంతంగా ప్రయోగించిన పీఎస్ఎల్వీ–సీ51 ఉపగ్రహ ప్రయోగంలో తిరుపతికి చెందిన ఇద్దరు విద్యార్థులు యజ్ఞసాయి, రఘుపతి భాగస్వాములయ్యారు. మరో ఐదుగురితో కలిసి వారిద్దరూ రూపొందించిన సతీష్ ధావన్ శాట్.. పీఎస్ఎల్వీ–సీ51 వాహక నౌక ద్వారా అంతరిక్షంలోకి దూసుకెళ్లింది. 1.9 కిలోల బరువున్న శాట్ కోసం వీరు దాదాపు 4 నెలలపాటు శ్రమించారు. ఏరోస్పేస్లో ఇంజనీరింగ్ చేసిన యజ్ఞసాయికి ఇది మూడో ఉపగ్రహం కాగా రఘుపతికి తొలి ఉపగ్రహం. తిరుపతికి చెందిన కంబాల రాము, వాణిల కుమారుడు కె.యజ్ఞసాయి తన విద్యాభ్యాసమంతా తిరుపతిలోనే పూర్తి చేశాడు. చెన్నైలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదివాడు. ఈ సమయంలో స్పేస్ కిడ్జ్ ఇండియా సంస్థ నాసాకు వెళ్లే అవకాశం కల్పించింది. దీంతో తన డిగ్రీని ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌కు మార్చుకున్నాడు. కలాం శాట్, కలాం శాట్ వీ2 ఉపగ్రహాల తయారీలో పాలుపంచుకున్నాడు. తిరుపతికి చెందిన ఫళణి(హమాలీ), మంజుల కుమారుడైన రఘుపతి ఎంటెక్ చేశాడు. అవకాశం ఇలా.. అంతరిక్షం పట్ల ఆసక్తి కలిగినవారికి చెన్నైకి చెందిన స్పేస్ కిడ్జ్ ఇండియా సంస్థ శిక్షణ ఇస్తుంది. ఆ సంస్థ సీఈవో శ్రీమతి కేశన్ ప్రోత్సాహంతో విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు. తాజాగా పంపిన సతీష్ ధావన్ శాట్ భూమికి 530 కిలోమీటర్ల దూరంలో ఉన్న కక్ష్యలో తిరుగుతుంది. తక్కువ శక్తితో ఎక్కువ డేటాను సమర్థవంతంగా ఉపయోగించే పరిశోధనలు చేస్తుంది. సతీష్ ధావన్ శాట్ ఉపగ్రహం -
రేపు నింగిలోకి పీఎస్ఎల్వీ సీ-51 రాకెట్
అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్‌ధవన్ స్పేస్ సెంటర్ (షార్) వేదికగా 2021లో తొలి హిట్ కొట్టేందుకు ఇస్రో సిద్ధమైంది. తన నమ్మకమైన వాహకనౌక పీఎస్ఎల్వీ సీ – 51ను నింగిలోకి పంపేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రయోగానికి సంబంధించి శాస్త్రవేత్తలు అన్ని పరీక్షలు పూర్తి చేశారు. మొదటి ప్రయోగవేదిక నుంచి రోదసిలోకి రాకెట్ దూసుకుపోవడమే మిగిలింది. సూళ్లూరుపేట: కరోనా లాక్‌డౌన్‌తో 2020 నింపిన చేదు అనుభవాలను అధిగమించి 2021లో సరికొత్త అడుగులేసేందుకు ఇస్రో ప్రణాళికలు రూపొందించింది. ఒక వైపు చంద్రయాన్ – 3, ఆదిత్య – ఎల్ 1, గగన్‌యాన్‌కు సిద్ధమవుతూనే.. వాణిజ్యపరమైన ప్రయోగాలు చేసేందుకు పక్కా ప్లాన్‌తో ముందుకెళ్తోంది. ఇందులో భాగంగా షార్ నుంచి ఆదివారం ఉదయం 10.24కు పీఎస్ఎల్వీ సీ – 51 ఉపగ్రహ వాహకనౌకకు నింగిలోకి పంపనుంది. ప్రయోగానికి 25 గంటల ముందుగా శనివారం ఉదయం 8.54కు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఈ ప్రయోగం ద్వారా బ్రెజిల్ దేశానికి చెందిన 637 కిలోల బరువు కలిగిన అమెజానియా – 01 అనే ఉపగ్రహంతో పాటు మరో 18 చిన్న తరహా ఉపగ్రహాలను రోదసిలో ప్రవేశపెట్టనున్నారు. న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ప్రారంభించాక పూర్తి స్థాయి వాణిజ్యపరమైన మొదటి ప్రయోగం కావడం దీని ప్రత్యేకత. ప్రయోగ ప్రక్రియ ఇలా.. పీఎస్ఎల్వీ సీ – 51 రాకెట్‌ను పీఎస్ఎల్వీ డీఎల్‌గా పిలుస్తారు. ఈ తరహాలో ఇది మూడో ప్రయోగం కావడం విశేషం. ఉపగ్రహాల బరువు తక్కువగా ఉండడంతో దీన్ని రెండు స్ట్రాపాన్ బూస్టర్లతో నిర్వహించనున్నారు. ఈ ప్రయోగంలో నాలుగో దశ (పీఎస్ – 4)లో రెండుసార్లు మండించి 18 ఉపగ్రహాలను రెండుసార్లుగా సన్ సింక్రనస్ ఆర్బిట్‌లోకి ప్రవేశపెడతారు. రాకెట్‌లోని మొదటి దశ 1.49 నిమిషం పూర్తికాగానే, 2.42 నిమిషాలకు నాలుగో దశలో ఉపగ్రహాలను అమర్చిన హీట్‌షీల్డ్ విడిపోతుంది. అనంతరం రెండో దశ 4.22 నిమిషాలకు, మూడో దశ 8.15 నిమిషాలకు పూర్తయి 16.36 నిమిషాలకు నాలుగో దశ కటాఫ్ అవుతుంది. అనంతరం 17.23 నిమిషాలకు బ్రెజిల్‌కు చెందిన 637 కిలోల బరువు కలిగిన అమెజానియా – 01 ఉపగ్రహాన్ని భూమికి 537 కిలోమీటర్లు ఎత్తులోని సన్‌సింక్రనస్ ఆర్బిట్‌లోకి ప్రవేశపెడతారు. అనంతరం 01:01:09 గంటలకు పీఎస్ – 4ను రీస్టార్ట్ చేసి 01:01:19 గంటలకు కటాఫ్ చేస్తారు. మళ్లీ రెండోసారి 01:49:52 గంటలకు రీస్టార్ట్ చేసి 01:52:00 గంటలకు కటాఫ్ చేస్తారు. ఆ తర్వాత 01:51:32 గంటలకు యూఎస్ చెందిన స్పేస్‌బీస్ శ్రేణిలో 12 చిన్న తరహా ఉపగ్రహాలు, సాయ్ – 1 నానోకాంటాక్ట్ – 2 అనే మరో ఉపగ్రహాన్ని కలిపి 13 ఉపగ్రహాల శ్రేణిని సన్‌సింక్రనస్ అర్బిట్‌లో ప్రవేశపెడతారు. మళ్లీ 01:55:07 గంటలకు భారత ప్రైవేట్ సంస్థలకు చెందిన ఉపగ్రహాలు సతీష్ ధవన్‌శాట్, సింధునేత్ర, వివిధ రకాల యూనివర్సిటీ విద్యార్థులు తయారు చేసిన యూనిటీశాట్‌లో భాగంగా ఉన్న శ్రీశక్తిశాట్, జిట్‌శాట్, జీహెచ్ఆర్సీ ఈశాట్ అనే ఐదు ఉపగ్రహాల శ్రేణిని అంతరిక్ష కక్ష్యలోకి వదిలిపెట్టి ప్రయోగాన్ని పూర్తి చేసేలా ఇస్రో శాస్త్రవేత్తలు డిజైన్ చేసుకున్నారు. మొదటి ప్రయోగవేదిక నుంచి 39వ ప్రయోగం కాగా, సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి 78వది, పీఎస్ఎల్వీ సిరీస్‌లో 53వ ప్రయోగం కావడం విశేషం. చదవండి: బాబు వ్యూహం.. కేశినేనికి చెక్! శభాష్ ఏపీ.. ప్రతికూలతలోనూ ‘సుస్థిర’పరుగు -
పీఎస్ఎల్వీ సీ51 ప్రయోగానికి ఇస్రో సిద్ధం
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఈనెల 28న పీఎస్ఎల్వీ సీ51 రాకెట్‌ను నింగిలోకి ప్రయోగించనుంది. ఉదయం 10.23కు శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్లో ఉన్న రెండో ప్రయోగ వేదిక నుంచి 21 ఉపగ్రహాలతో ఈ రాకెట్ అంతరిక్షంలోకి దూసుకుపోనుంది. పలు వర్సిటీల విద్యార్థులు యూనిటీ శాట్స్ అనే పేరుతో తయారు చేసిన సతీష్ ధవన్ శాట్–1, జిట్ శాట్, జీహెచ్‌ఆర్‌సీఈ శాట్, శ్రీశక్తి శాట్, సింధు నేత్ర, ఆనంద్ అనే ఉపగ్రహాలతో పాటు పలు ఉపగ్రహాలను ఇస్రో పంపించనుంది. -
ఈవోఎస్–01 ఉపగ్రహానికి విచ్చుకున్న యాంటెన్నా
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఈనెల 7న పీఎస్ఎల్వీ సీ–49 రాకెట్ ద్వారా ప్రయోగించిన ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ (ఈవోఎస్–01) ఉపగ్రహానికి మంగళవారం సాయంత్రం రేడియల్ రిబ్ యాంటెన్నా విజయవంతంగా విచ్చుకున్నట్టు ఇస్రో తన అధికారిక వెబ్సైట్లో తెలిపింది. వ్యవసాయం, అటవీ, విపత్తులకు సంబంధించిన సమాచారాన్ని అందించేందుకు ఈ ఉపగ్రహ ప్రయోగాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ యాంటెన్నా ఉపగ్రహ సమాచారాన్ని అందించేందుకు కీలక భూమిక పోషిస్తుంది. ఉపగ్రహ సేవలు బుధవారం నుంచే అందుబాటులోకి వస్తాయని ఇస్రో ప్రకటించింది. -
పీఎస్ఎల్వీ సీ49 కౌంట్‌డౌన్ ప్రారంభం
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధనాసంస్థ (ఇస్రో) సతీష్ ధవన్ స్పేస్ సెంటర్లోని మొదటి ప్రయోగవేదిక నుంచి శనివారం మధ్యాహ్నం 3.02 గంటలకు పీఎస్ఎల్వీ సీ49 (పీఎస్ఎల్వీ–డీఎల్) ఉపగ్రహ వాహకనౌకను నింగిలోకి పంపనున్నారు. ఇందుకు సంబంధించి శుక్రవారం మధ్యాహ్నం 1.02 గంటలకు కౌంట్‌డౌన్ ప్రక్రియ ప్రారంభమైంది. రాకెట్‌కు తుది విడత తనిఖీలు నిర్వహించి ప్రయోగపనులను లాంచ్ ఆథరైజేషన్ బోర్టు (ల్యాబ్)వారికి అప్పగించడంతో వారు ప్రయోగానికి 26 గంటల ముందు అంటే శుక్రవారం మధ్యాహ్నం 1.02 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభించారు. ఈ ప్రయోగం ద్వారా స్వదేశానికి చెందిన ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ (ఈఓఎస్–01)తో పాటు అమెరికాకు చెందిన నాలుగు ఉపగ్రహాలు, లక్స్‌ంబర్గ్‌కు చెందిన నాలుగు ఉపగ్రహాలు, లిథువేనియాకు చెందిన ఒక చిన్న తరహా ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపనున్నారు. -
7న పీఎస్ఎల్వీ–సీ49 ప్రయోగం
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఈ నెల 7వ తేదీన సాయంత్రం 3.02 గంటలకు పీఎస్ఎల్వీ–సీ49 (పీఎస్ఎల్వీ–డీఎల్) ఉపగ్రహ వాహక నౌకను ప్రయోగించనుంది. ఇందుకు సంబంధించి 6వ తేదీన మధ్యాహ్నం 1.02 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభమవుతుంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ మొదటి ప్రయోగ వేదిక నుంచి ఈ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపిస్తారు. పీఎస్ఎల్వీ–డీఎల్ రెండో ప్రయోగమిది పీఎస్ఎల్వీ రాకెట్ సిరీస్‌లో రెండోసారి ప్రయోగిస్తున్న సరికొత్త రాకెట్ ఇది. రెండే రెండు స్ట్రాపాన్ బూస్టర్ల సాయంతో చేస్తున్న ప్రయోగం కావడంతో దీనికి పీఎస్ఎల్వీ–డీఎల్ అని నామకరణం చేశారు. ఈ తరహా రాకెట్‌ను తొలిసారి గత ఏడాది జనవరి 24న ప్రయోగించి విజయం సాధించారు. ఉపగ్రహాల బరువు చాలా తక్కువ కావడంతో ఖర్చు తగ్గించుకోవడానికి రెండు స్ట్రాపాన్ బూస్టర్లతో ప్రయోగం చేస్తున్నారు. ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ (ఈఓఎస్–01)గా పిలిచే స్వదేశీ నూతన ఉపగ్రహంతో పాటు మరో తొమ్మిది దేశాలకు చెందిన తేలికపాటి ఉపగ్రహాలను భూమికి అత్యంత చేరువలోని సూర్యానువర్తన కక్ష్యలోకి ప్రవేశపెడతారు. ప్రయోగాన్ని అత్యంత తక్కువ సమయంలోనే అంటే 13.55 నిమిషాల్లో పూర్తి చేస్తారు. -
గ‘ఘన’ విజయ వీచిక
సూళ్లూరుపేట: ఇస్రో తన విజయ విహారాన్ని కొనసాగిస్తూ శ్రీహరికోట రాకెట్ కేంద్రం నుంచి 75 ప్రయోగాలను పూర్తి చేసింది. బుధవారం ప్రయోగించిన పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ (పీఎస్ఎల్వీ) సీ–48 ప్రయోగంతో ప్లాటినం జూబ్లీ రికార్డుని నమోదు చేయగా.. మరోవైపు పీఎస్ఎల్వీ సిరీస్‌లో అర్ధ సెంచరీని పూర్తి చేసింది. బుధవారం సాయంత్రం 3.25 గంటలకు ఇస్రో తన కదనాశ్వం పీఎస్ఎల్వీ సీ–48 రాకెట్ ద్వారా 628 కిలోల రాడార్ ఇమేజింగ్ ఎర్త్ అబ్జర్వేషన్ (రీశాట్–2బీఆర్1) శాటిలైట్‌తోపాటు అమెరికాకు చెందిన మరో 6 ఉపగ్రహాలు, జపాన్, ఇటలీ, ఇజ్రాయెల్‌కు చెందిన మూడు ఉపగ్రహాలను 21.19 నిమిషాల్లో భూమికి 576 కిలో మీటర్ల ఎత్తులోని సన్ సింక్రనస్ ఆర్బిట్‌లోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది. ప్రయోగం సాగిందిలా.. - పీఎస్ఎల్వీ సీ–48 రాకెట్ ప్రయోగాన్ని నాలుగు దశల్లో 21.19 నిమిషాల్లో పూర్తి చేశారు. సాయంత్రం 3.25 గంటలకు 44.4 మీటర్ల పొడవు గల పీఎస్ఎల్వీ–సీ48 ఉపగ్రహ వాహక నౌక 628 కిలోల బరువైన 10 ఉపగ్రహాలను విజయవంతంగా రోదసీలోకి మోసుకెళ్లింది. - 44.4 మీటర్ల ఎత్తున్న పీఎస్ఎల్వీ సీ–48 రాకెట్‌ను నాలుగు స్ట్రాపాన్ బూస్టర్ల సాయంతో ప్రయోగించారు. - ప్రయోగ సమయంలో 291 టన్నుల బరువును మోసుకుంటూ రాకెట్ భూమి నుంచి నిప్పులు చిమ్ముకుంటూ నింగికి పయనమైంది. - మొదటి దశలోని నాలుగు స్ట్రాపాన్ బూస్టర్లలో 48 టన్నుల ఘన ఇంధనంతోపాటు కోర్ అలోన్ దశలో మరో 139 టన్నుల ఘన ఇందనాన్ని మండించుకుంటూ రాకెట్ భూమి నుంచి నింగి వైపు దూసుకెళ్లింది. - నాలుగో దశ నుంచి రీశాట్–2బీఆర్1 ఉపగ్రహాన్ని భూమికి 576 కిలోమీటర్ల ఎత్తులోని వృత్తాకార సూర్యానువర్తన ధ్రువ కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. - అమెరికాకు చెందిన ఆరు ఉపగ్రహాలు, 1,278 సెకన్లకు జపాన్, ఇటలీ, ఇజ్రాయెల్‌కు చెందిన మూడు ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యలో విజయవంతంగా ప్రవేశపెట్టారు. - జపాన్‌కు చెందిన క్యూపీఎస్–సార్, ఇటలీకి చెందిన టైవాక్–0092, ఇజ్రాయెల్‌కు చెందిన డచీఫాట్–3 అనే మూడు ఉపగ్రహాలను వాహక నౌక బయలుదేరిన 21.19 నిమిషాల్లో విజయవంతంగా ప్రవేశపెట్టి 75వ సారి విజయం సాధించారు. రీశాట్ ప్రత్యేకతలివీ.. సరిహద్దులో జరిగే చొరబాట్లును పసిగడుతుంది. ఇప్పటికే రెండు ఉపగ్రహాలను ప్రయోగించిన ఇస్రో మూడో ఉపగ్రహమైన రీశాట్–2బీఆర్1ను రక్షణ రంగ అమ్ముల పొదిలో చేర్చింది. ఇందులో అమర్చిన పేలోడ్స్‌ను అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించారు. తాజా ఉపగ్రహంలో అమర్చిన ఎక్స్‌బాండ్ సింథటిక్ అపార్చర్ రాడార్ భూమి మీద జరిగే మార్పులను పసిగడుతుంది. భూమి మీద 10 సెంటీమీటర్ల వ్యాసార్థంలో ఉండే ఎలాంటి చిన్న వస్తువునైనా నాణ్యమైన చిత్రాలు తీసి çపంపిస్తుంది. దేశ సరిహద్దులో అక్రమ చొరబాట్లు, పంటలు, సాగు విస్తీర్ణం, అడవులను పరిశోధించడమే కాకుండా ప్రకృతి వైపరీత్యాల సమయాల్లోనూ నాణ్యమైన ఫొటోలు తీసి పంపిస్తుంది. ఈ ఉపగ్రహంలో అమర్చిన పేలోడ్స్ భూమికి 576 కి.మీ. ఎత్తు నుంచి దేశానికి ఒక సరిహద్దు సెక్యూరిటీగా ఐదేళ్లపాటు పనిచేస్తుంది. మహానుభావుల కృషి ఫలితమిది: ఇస్రో చైర్మన్ సూళ్లూరుపేట: పీఎస్ఎల్వీ వరుస విజయాలకు నాటి మహానుభావుల కృషే కారణమని ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.శివన్ అన్నారు. పీఎస్ఎల్వీ సీ–48 ప్రయోగం సక్సెస్ కావడంతో ఆయన మిషన్ కంట్రోల్ రూమ్ నుంచి మాట్లాడారు. రాబోయే ఐదేళ్లలో 50 ప్రయోగాలు చేయనున్నామని చెప్పారు. తొలుత ‘గోల్డెన్ జూబ్లీ ఆఫ్ పీఎస్ఎల్వీ’ పుస్తకాన్ని శివన్ ఆవిష్కరించారు. గవర్నర్ అభినందనలు సాక్షి, అమరావతి: పీఎస్ఎల్వీ సీ–48 వాహక నౌక ద్వారా ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో శాస్త్రవేత్తలను రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ అభినందించారు. ఇస్రో సాధించిన ఈ ఘనతతో దేశం గర్వపడుతోందని ఆయన బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సీఎం జగన్ అభినందనలు సాక్షి,అమరావతి: పీఎస్ఎల్వీ–సీ 48 వాహక నౌక ద్వారా రీశాట్ –2బీఆర్1తోపాటు మరో తొమ్మిది వాణిజ్య ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో శాస్త్రవేత్తలకు సీఎం వైఎస్ జగన్ అభినందనలు తెలిపారు. ఈ మేరకు సీఎంవో అధికారులు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. భవిష్యత్తులోనూ ఇలాంటి విజయాలను సొంతం చేసుకోవాలని సీఎం ఆకాంక్షించారు. -
ప్లాటినం షార్, శాస్త్రవేత్తల సంబురాలు
సాక్షి, సూళ్లూరుపేట: నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ఓ అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. షార్ మొదటి ప్రయోగ వేదిక నుంచి బుధవారం సాయంత్రం 3.25 గంటలకు పీఎస్ఎల్వీ సీ-48 ఉపగ్రహ వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లింది. అయిదేళ్లపాటుసేవలు అందించనున్న ఈ వాహక నౌక విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. మరోవైపు రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంతో శాస్త్రవేత్తలు సంబురాలు జరుపుకుంటున్నారు. పీఎస్ఎల్వీ సీ–48 ద్వారా 648 కిలోల బరువు కలిగిన రీశాట్–2బీఆర్1 ఉపగ్రహంతోపాటు అమెరికాకు చెందిన 4 లీమూర్ అనే ఉపగ్రహాలు, టైవోక్–0129, ఆరు ఐహోప్‌శాట్ ఉపగ్రహాలు, జపాన్‌కు చెందిన క్యూపీఎస్–సార్, ఇటలీకి చెందిన తైవాక్–0092, ఇజ్రాయెల్‌కు చెందిన డచీఫ్యాట్–3 అనే ఉపగ్రహాలను 576 కి.మీ. ఎత్తులోని సన్ సింక్రనస్ ఆర్బిట్‌లో ప్రవేశపెట్టారు. రిశాట్-2బీఆర్1 ఉపగ్రహం.. వ్యవసాయం, అటవీ, విపత్తు నిర్వహణ వంటి రంగాల్లో ఉపయోగపడనుంది. గత మే 22న ప్రయోగించిన రిశాట్-2బీకి కొనసాగింపుగా దీన్ని ప్రయోగించారు. ఇక ఇస్రో ప్రయోగాల్లో పీఎస్ఎల్వీ రాకెట్‌కు ప్రత్యేక స్థానమున్నది. ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన రాకెట్లలో ఒకటిగా దీనికి పేరుంది. 49 ప్రయోగాల్లో కేవలం రెండు మాత్రమే విఫలమయ్యాయి. మూడో తరం లాంచ్ వెహికల్ అయిన పీఎస్ఎల్వీ.. చంద్రయాన్-1, మంగళ్యాన్ మిషన్లను విజయవంతం చేసింది. కాగా ఇప్పటివరకూ 74 రకాల రాకెట్లను నింగిలోకి పంపిన ఇస్రో... ఈ ప్రయోగంతో ప్లాటినం జూబ్లీని అందుకుంది. అంతేకాకుండా పీఎస్ఎల్వీ సిరీస్‌లో 50వ ప్రయోగానికి విజయవంతంగా పూర్తి చేసింది. చంద్రాయన్-1,2, మంగళ్యాన్-1 వంటి గ్రహాంతర ప్రయోగాలకు వేదికిగా నిలిచింది. 2020లో గగన్‌యాన్‌కు సమాయత్తమవుతోంది. భవిష్యత్‌లో ఇస్రో మరిన్ని ప్రయోగాలు ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.శివన్ మాట్లాడుతూ... ‘ ఈ రోజు చారిత్రాత్మకమైన 50వ పీఎస్ఎల్వీ రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించాం. శ్రీహరికోట నుంచి ఇది 75వ ప్రయోగం. 26 సంవత్సరాల పీఎస్ఎల్వీ రాకెట్ విజయాలలో ఎందరో శాస్త్రవేత్తల కృషి ఉంది. పీఎస్ఎల్వీని వివిధ రకాలుగా అభివృద్ధి చేశాం. భవిష్యత్‌లో ఎన్నో ప్రయోగాలకు ఇస్రో సిద్ధంగా ఉంది’ అని తెలిపారు. ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్ ఓ ప్రత్యేక పుస్తకాన్ని ఆవిష్కరించారు. పీఎస్ఎల్వీ ఆధునీకరణలో కృషి చేసిన ఇస్రో శాస్త్రవేత్తల వివరాలను ఈ పుస్తకంలో సవివరంగా ప్రచురించారు. సీఎం వైఎస్ జగన్ అభినందనలు పీఎస్ఎల్వీ సీ–48 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. భవిష్యత్‌లో ఇస్రో మరిన్ని విజయాలు అందుకోవాలని ఆయన ఆకాంక్షించారు. -
పీఎస్ఎల్వీ సీ-48 కౌంట్‌డౌన్ స్టార్ట్
-
నేడు నింగిలోకి పీఎస్ఎల్వీ సీ–48
సూళ్లూరుపేట/తిరుమల: పీఎస్ఎల్వీ సీ–48 ఉపగ్రహ వాహక నౌక బుధవారం సాయంత్రం 3.25 గంటలకు నింగిలోకి దూసుకుపోనుంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లోని(షార్) మొదటి ప్రయోగ వేదిక నుంచి రోదసీలోకి పంపేందుకు ఇస్రో ఏర్పాట్లు పూర్తిచేసింది. మంగళవారం సాయంత్రం 4.40 గంటలకు ఇస్రో చైర్మన్ కె.శివన్ సమక్షంలో కౌంట్‌డౌన్ ప్రక్రియ ప్రారంభించారు. పీఎస్ఎల్వీ సీ–48 ద్వారా 648 కిలోల బరువు కలిగిన రీశాట్–2బీఆర్1 ఉపగ్రహంతోపాటు అమెరికాకు చెందిన 4 లీమూర్ అనే ఉపగ్రహాలు, టైవోక్–0129, ఆరు ఐహోప్‌శాట్ ఉపగ్రహాలు, జపాన్‌కు చెందిన క్యూపీఎస్–సార్, ఇటలీకి చెందిన తైవాక్–0092, ఇజ్రాయెల్‌కు చెందిన డచీఫ్యాట్–3 అనే ఉపగ్రహాలను 576 కి.మీ. ఎత్తులోని సన్ సింక్రనస్ ఆర్బిట్‌లో ప్రవేశపెట్టనున్నారు. కాగా, ఇస్రో చైర్మన్ కె.శివన్ మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. పీఎస్ఎల్వీ సీ–48 రాకెట్ నమూనాను శ్రీవారి పాదాల చెంత ఉంచి పూజలు నిర్వహించారు. ఇది ఇస్రోకు చరిత్రాత్మక ప్రయోగమన్నారు. -
26 నుంచి పీఎస్ఎల్వీ సీ47 కౌంట్‌డౌన్
సూళ్లూరుపేట : శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి 27న ఉదయం 9.28 గంటలకు పీఎస్ఎల్వీ సీ47ను ప్రయోగించనున్నారు. వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్‌లో నాలుగు దశల రాకెట్ అనుసంధానం పూర్తయ్యాక అక్కడి నుంచి ప్రయోగ వేదిక మీదకు తరలించే క్రమంలో పీఎస్ఎల్వీ రాకెట్‌లోని ఎలక్ట్రానిక్స్ వ్యవస్థలో నాయిస్ రావడాన్ని గుర్తించిన శాస్త్రవేత్తలు ఈ సమస్యను శుక్రవారం సరిచేశారు. శనివారం ఉదయం పీఎస్ఎల్వీ సీ47 రాకెట్‌ను ప్రయోగ వేదిక మీదకు తీసుకెళ్లి అనుసంధానించారు. ఆదివారం లాంచ్ రిహార్సల్స్ చేపట్టనున్నారు. 25వ తేదీ తుది విడత మిషన్ సంసిద్ధతా సమావేశం (ఎంఆర్ఆర్), 26 ఉదయం 6.28 గంటలకు కౌంట్‌డౌన్ ప్రక్రియ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
ఇస్రో ప్రయోగం అద్భుతం
-
ఇస్రో ప్రయోగం అద్భుతం
ఒకేసారి 104 ఉపగ్రహాల ప్రయోగంతో దేశానికి కీర్తి ప్రతిష్టలు ♦ దేశానికి మరింత మంది శాస్త్రవేత్తలు అవసరం ♦ రికార్డు స్థాయి వ్యవసాయ ఉత్పత్తిలో రైతుల కృషి అభినందనీయం ♦ అవినీతి వ్యతిరేక పోరులో ‘డిజిటల్’ది కీలక పాత్ర ♦ ‘మన్ కీ బాత్’లో ప్రధాని నరేంద్ర మోదీ న్యూఢిల్లీ: సామాన్యులకు సాంకేతిక ప్రయోజన లబ్ధి చేరువయ్యేందుకు దేశంలో మరింతమంది శాస్త్రవేత్తల అవసరముందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ‘మన్ కీ బాత్’లో భాగంగా ఆదివారం రేడియోలో ప్రసంగిస్తూ... ఒకేసారి 104 ఉపగ్రహాల్ని ప్రయోగించి రికార్డు సృష్టించిన ఇస్రో శాస్త్రవేత్తల కృషి అభినందనీయమన్నారు. అంగా రక గ్రహంపైకి మంగళయాన్ గం తర్వాత అంతరిక్ష చరిత్రలో ఇస్రో ప్రపంచ రికార్డు లిఖించిందని కొనియాడారు. ‘పీఎస్ఎల్వీ రాకెట్ 38వ విజయవంత ప్రయోగంలో 104 ఉపగ్రహాల్ని అంతరిక్షంలో ప్రవేశపెట్టడం అభినందనీయం. ఇస్రో శాస్త్రవేత్తలు దేశానికి ఎంతో కీర్తిప్రతిష్టలు తెచ్చిపెట్టారు. ఇస్రో బృందంలో ఎంతో మంది యువ శాస్త్రవేత్తలతో పాటు మహిళలు కూడా ఉన్నారు. పీఎస్ఎల్వీ ద్వారా ప్రయోగించిన ఉపగ్రహాల్లో కార్టోశాట్ 2డీ ఒకటి... అది ఇప్పటికే పనిచేయడం మొదలుపెట్టింది. పట్టణాభివృద్ధి కోసం వనరులు, మౌలిక వసతుల్ని గుర్తించడం, ప్రణాళికలు రూపొందించేందుకు అది ఉపయోగపడుతుంది’ అని ప్రధాని పేర్కొన్నారు. యువతలో సైన్స్ పట్ల ఆసక్తి పెరగాలి బాలాసోర్ నుంచి బాలిస్టిక్ క్షిపణి నిరోధక పరీక్ష విజయవంతమవడాన్ని కూడా ప్రధాని ప్రశంసించారు. ‘ఆ క్షిపణికి భూతలం నుంచి 100 కి.మీ. ఎత్తులో శత్రువుల క్షిపణుల్ని నాశనం చేయగల సామర్థ్యముంది. ప్రపంచంలో కేవలం నాలుగైదు దేశాల వద్ద మాత్రమే అలాంటి సామర్థ్యం ఉంది’ అని పేర్కొన్నారు. యువతరంలో సైన్స్ పట్ల ఆసక్తి పెరగాలని మోదీ అభిలషించారు. సామాన్యుల అవసరాల మేరకు సైన్సు ఉపయోగపడితే అప్పుడది మానవజాతికి ఎంతో విలువైన సాధనం అవుతుందని చెప్పారు. ప్రజోపయోగ ఆవిష్కరణలు అవసరం ఇటీవల జరిగిన 14వ ప్రవాసీ భారతీయ దివస్ పోటీల్ని ప్రధాని గుర్తు చేశారు. ‘ప్రవాసీ భారతీయ దివస్‌లో ప్రజలకు ఉపయోగపడే ఆవిష్కరణల్ని ప్రదర్శించారు. మత్స్యకారులకు ఉపయోగపడేలా చేపలు ఎక్కడ ఎక్కువ ఉంటాయో తెలియచెప్పే పరికరం అందులో ఒకటి. వాతావరణ సమాచారంతో పాటు, సముద్రంలో మార్పుల సమాచారం కూడా అందిస్తుంది. పరిష్కారం కోసం సైన్సు ఎంత ముఖ్యమైందో... ఎన్నో సార్లు ఆ సమస్యలే చాటి చెప్పాయి. అందుకు 2005 ముంబై వరదలే ఉదాహరణ.. వరదల అనంతరం ప్రజల ప్రాణాలకు హాని జరగకుండా, వరద నీరు నిల్వ ఉండకుండా నివాస గృహాల నిర్మాణాల్ని చేపట్టార’ని మోదీ గుర్తుచేశారు. రికార్డు స్థాయిలో ఆహారోత్పత్తి: ఈ ఏడాది రికార్డు స్థాయిలో వ్యవసాయ ఉత్పత్తి సాధించిన రైతుల కృషిని కొనియాడారు. ‘రైతులు మన ధాన్యాగారాల్ని నింపేందుకు ఎంతో కష్టపడ్డారు. వారి శ్రమ ఫలితంగా ఆహార ధాన్యాల ఉత్పత్తిలో రికార్డు సాధన సాధ్యపడింది. ఈ ఏడాది 2,700 లక్షల టన్నుల ఆహార ధాన్యాల్ని ఉత్పత్తి చేశారు. గతేడాది రైతులు సాధించిన రికార్డు కంటే ఇది 8 శాతం అదనం. పేదల అవసరాల్ని దృష్టిలో పెట్టుకుని రైతులు వేర్వేరు రకాల పప్పు దినుసుల్ని సాగుచేశారు’ అంటూ ప్రశంసలు కురిపించారు. మహిళ ప్రాముఖ్యాన్ని వివరిస్తూ.. క్రీడలు, అంతరిక్ష విజ్ఞానం ఇలా రంగమేదైనా మహిళలు వెనకంజలో ఉండకూడదన్నారు. నగదు వాడకం తగ్గుముఖం పడుతోంది డిజిటల్ చెల్లింపుల విధానం నల్లధనానికి అడ్డుకట్ట వేస్తుందని, అవినీతి వ్యతిరేక పోరులో కీలక పాత్ర పోషిస్తుందని మోదీ పేర్కొన్నారు. ‘యువత అవినీతి వ్యతిరేక సభ్యులుగా మారాలి. అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న డిజిటల్ చెల్లింపుల పథకాలకు యువత ప్రచార కర్తలుగా మారాలి. ఈ ఉద్యమానికి నాయకత్వం వహించాలి. నల్లధనం, అవినీతికి వ్యతిరేక పోరాటంలో కీలక పాత్ర పోషించే డిజిటల్ విధానాన్ని ముందుకు తీసుకెళ్లాలి. నగదుపై ఆధారపడే మనస్తత్వాన్ని ప్రజలు క్రమంగా వదులుకుంటున్నారు. డిజిటల్ కరెన్సీ వైపు అడుగులు వేస్తున్నారు. చెల్లింపుల కోసం యువత వారి మొబైల్ ఫోన్లను కొత్త సాధనంగా వినియోగిస్తూ ఈ విధానాన్ని ముందుకు నడిపిస్తున్నారు. గత రెండు నెలల్లో 10 లక్షల మంది ప్రజలకు ప్రోత్సాహకాలు ఇచ్చాం. 50 వేల మంది వర్తకులు బహుమతులు గెలుచుకున్నారు. డిజిటల్ చెల్లింపు పథకాలు వినియోగించే వారికి ప్రోత్సాహకాలు ఏప్రిల్ 14తో ముగుస్తాయి. ప్రతి ఒక్కరూ 125 మందికి భీమ్ యాప్ డౌన్ లోడ్ చేసుకునేలా సాయం చేయాలి’ అని మోదీ కోరారు. -
‘కార్టోశాట్ –2డీ’నే కీలకం
శ్రీహరికోట (సూళ్లూరుపేట): పీఎస్ఎల్వీ రాకెట్ 104 ఉపగ్రహాల్ని భూమికి 505–524 కి.మీ.ల మధ్యలో సూర్యానువర్తన ధృవకక్ష్య(సన్ సింక్రోనస్ ఆర్బిట్)లో ప్రవేశపెడుతుంది. ఇందులో ప్రధానంగా కార్టోశాట్–2డీ ఉపగ్రహం 510 కిలోమీటర్ల ఎత్తులో పరిభ్రమిస్తూ భూమిపై మార్పుల్ని ఫొటోలు తీస్తుంది. నానో శాటిలైట్స్ (ఐఎన్ ఎస్–1ఏ, ఐఎన్ ఎస్–1బీ)లు మాత్రం 6 నెలలు మాత్రమే పనిచేస్తాయి. కార్టోశాట్–2డీ.. భౌగోళిక సమాచారం కోసం కార్టోశాట్ ఉపగ్రహాల ప్రయోగాన్ని 2005లో ప్రారంభించారు. కార్టోశాట్–1, 2, 2ఏ, 2బీ, 2సీ అనంతరం తాజాగా కార్టోశాట్–2డీ రోదసీలోకి పంపుతున్నారు. ఈ ఉపగ్రహంలో అమర్చిన ఫ్రాంక్రోమాటిక్ మల్టీ స్ప్రెక్ట్రల్ కెమెరా భూమిని నిశితంగా పరిశీలిస్తూ అత్యంత నాణ్యమైన చాయాచిత్రాల్ని పంపిస్తుంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల సమాచారంతోపాటు తీరప్రాంతపు భూములు, వ్యవసాయ, సాగునీటి పంపిణీ, రోడ్ల సమాచారాన్ని క్షుణ్నంగా అందిస్తుంది. పట్టణాభివృద్ధిలో ఈ ఉపగ్రహ చిత్రాలు కీలక భూమిక పోషించనున్నాయి. భూమిపై మార్పులను ఎప్పటికప్పుడు ఛాయా చిత్రాలు తీసి పంపుతుంది. ఇస్రో నానో శాటిలైట్స్ ఇస్రో నానో శాటిలైట్స్ (ఐఎన్ ఎస్–1ఏ, ఐఎన్ ఎస్–1బీ) ఉపగ్రహాల్ని అహ్మదాబాద్‌లో స్పేస్ అప్లికేషన్ సెంటర్ రూపొందించింది. రెండు ఉపగ్రహాల బరువు 18.1 కేజీలు మాత్రమే. 8.4 కేజీల బరువున్న ఐఎన్ ఎస్–1ఏలో 5 కేజీల పేలోడ్స్‌ను అమర్చారు. బైడెరెక్షనల్ రెఫె్లక్టెన్స్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ రేడియో మీటర్ (బీఆర్డీఎఫ్), సింగిల్ ఈవెంట్ అప్సెట్ మానిటర్ (ఎస్‌ఈయూఎం) పేలోడ్స్‌ను పొందుపర్చారు. ఐఎన్ ఎస్–1ఏ కూడా రిమోట్ సెన్సింగ్ శాటిలైటే. భూమిపై సూర్యుడి ప్రభావాన్ని తెలియచేయడంతో పాటు, రేడియేషన్ ఎనర్జీని లెక్కిస్తుంది. 9.7 కేజీలు బరువు కలిగి ఐఎన్ ఎస్–1బీ ఉపగ్రహంలో ఎర్త్ ఎక్సోస్పియర్ లేమాన్ ఆల్ఫా అనాలసిసర్(ఈఈఎల్‌ఏ), ఆర్గామీ కెమెరా పేలోడ్స్ అమర్చారు. ఇది కూడా భూమికి సంబంధించిన సమాచారం అందజేస్తుంది. విదేశీ ఉపగ్రహాలు అమెరికాకు చెందిన డవ్ ఫ్లోక్–3పీ శాటిలైట్స్‌లో 88 చిన్న ఉపగ్రహాలుంటాయి. వీటిని ఒక బాక్స్‌లో అమర్చారు. స్పేస్‌లోకి వెళ్లగానే బాక్స్‌ను అమెరికా అంతరిక్ష సంస్థ గ్రౌండ్ స్టేషన్ నుంచి తెరుస్తారు. ఈ ఉపగ్రహాలు వాణిజ్య ప్రయోజనాలు అందించడంతో పాటు వాతావరణ సమాచారం తెలియచేస్తాయి. లేమూర్ ఉపగ్రహాల వ్యవస్థలో మొత్తం 8 ఉపగ్రహాలున్నాయి. అంతరిక్షంలోకి వెళ్లాక ఇవి ఉన్న బాక్స్‌ను తెరుస్తారు. ఇవి కూడా భూమికి సంబంధించిన సమాచారాన్ని అందిస్తాయి. ఉపగ్రహం బరువు దేశం పీయాస్ 3 కేజీలు నెదర్లాండ్స్ డిడో2 4.2 కేజీలు స్విట్జర్లాండ్ బీజీయూ శాట్ 4.3 కేజీలు ఇజ్రాయెల్ ఆల్–ఫరాబి–1 1.7 కేజీలు కజకిస్తాన్ నాయిప్ 1.1 కేజీలు యూఏఈ ఈ ఉపగ్రహాల్ని కూడా సాంకేతిక ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. చిన్న చిన్న అప్లికేషన్స్ తయారీలో సాయపడతాయి.