రేపు నింగిలోకి పీఎస్‌ఎల్వీ సీ-51 రాకెట్‌ | PSLV C 51 Rocket Launch Tomorrow | Sakshi
Sakshi News home page

రేపు నింగిలోకి పీఎస్‌ఎల్వీ సీ-51 రాకెట్‌

Published Sat, Feb 27 2021 11:06 AM | Last Updated on Sat, Feb 27 2021 1:25 PM

PSLV C 51 Rocket Launch Tomorrow - Sakshi

పీఎస్‌ఎల్వీ సీ – 51 రాకెట్‌

అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్‌ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) వేదికగా 2021లో తొలి హిట్‌ కొట్టేందుకు ఇస్రో సిద్ధమైంది. తన నమ్మకమైన వాహకనౌక పీఎస్‌ఎల్వీ సీ – 51ను నింగిలోకి పంపేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రయోగానికి సంబంధించి శాస్త్రవేత్తలు అన్ని పరీక్షలు పూర్తి చేశారు. మొదటి ప్రయోగవేదిక నుంచి రోదసిలోకి రాకెట్‌ దూసుకుపోవడమే మిగిలింది.

సూళ్లూరుపేట: కరోనా లాక్‌డౌన్‌తో 2020 నింపిన చేదు అనుభవాలను అధిగమించి 2021లో సరికొత్త అడుగులేసేందుకు ఇస్రో ప్రణాళికలు రూపొందించింది. ఒక వైపు చంద్రయాన్‌ – 3, ఆదిత్య – ఎల్‌ 1, గగన్‌యాన్‌కు సిద్ధమవుతూనే.. వాణిజ్యపరమైన ప్రయోగాలు చేసేందుకు పక్కా ప్లాన్‌తో ముందుకెళ్తోంది. ఇందులో భాగంగా షార్‌ నుంచి ఆదివారం ఉదయం 10.24కు పీఎస్‌ఎల్వీ సీ – 51 ఉపగ్రహ వాహకనౌకకు నింగిలోకి పంపనుంది. ప్రయోగానికి 25 గంటల ముందుగా శనివారం ఉదయం 8.54కు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. ఈ ప్రయోగం ద్వారా బ్రెజిల్‌ దేశానికి చెందిన 637 కిలోల బరువు కలిగిన అమెజానియా – 01 అనే ఉపగ్రహంతో పాటు మరో 18 చిన్న తరహా ఉపగ్రహాలను రోదసిలో ప్రవేశపెట్టనున్నారు. న్యూ స్పేస్‌ ఇండియా లిమిటెడ్‌ ప్రారంభించాక పూర్తి స్థాయి వాణిజ్యపరమైన మొదటి ప్రయోగం కావడం దీని ప్రత్యేకత.

ప్రయోగ ప్రక్రియ ఇలా..
పీఎస్‌ఎల్వీ సీ – 51 రాకెట్‌ను పీఎస్‌ఎల్వీ డీఎల్‌గా పిలుస్తారు. ఈ తరహాలో ఇది మూడో ప్రయోగం కావడం విశేషం. ఉపగ్రహాల బరువు తక్కువగా ఉండడంతో దీన్ని రెండు స్ట్రాపాన్‌ బూస్టర్లతో నిర్వహించనున్నారు. ఈ ప్రయోగంలో నాలుగో దశ (పీఎస్‌ – 4)లో రెండుసార్లు మండించి 18 ఉపగ్రహాలను రెండుసార్లుగా సన్‌ సింక్రనస్‌ ఆర్బిట్‌లోకి ప్రవేశపెడతారు. రాకెట్‌లోని మొదటి దశ 1.49 నిమిషం పూర్తికాగానే, 2.42 నిమిషాలకు నాలుగో దశలో ఉపగ్రహాలను అమర్చిన హీట్‌షీల్డ్‌ విడిపోతుంది. అనంతరం రెండో దశ 4.22 నిమిషాలకు, మూడో దశ 8.15 నిమిషాలకు పూర్తయి 16.36 నిమిషాలకు నాలుగో దశ కటాఫ్‌ అవుతుంది. అనంతరం 17.23 నిమిషాలకు బ్రెజిల్‌కు చెందిన 637 కిలోల బరువు కలిగిన అమెజానియా – 01 ఉపగ్రహాన్ని భూమికి 537 కిలోమీటర్లు ఎత్తులోని సన్‌సింక్రనస్‌ ఆర్బిట్‌లోకి ప్రవేశపెడతారు.

అనంతరం 01:01:09 గంటలకు పీఎస్‌ – 4ను రీస్టార్ట్‌ చేసి 01:01:19 గంటలకు కటాఫ్‌ చేస్తారు. మళ్లీ రెండోసారి 01:49:52 గంటలకు రీస్టార్ట్‌ చేసి 01:52:00 గంటలకు కటాఫ్‌ చేస్తారు. ఆ తర్వాత 01:51:32 గంటలకు యూఎస్‌ చెందిన స్పేస్‌బీస్‌ శ్రేణిలో 12 చిన్న తరహా ఉపగ్రహాలు, సాయ్‌ – 1 నానోకాంటాక్ట్‌ – 2 అనే మరో ఉపగ్రహాన్ని కలిపి 13 ఉపగ్రహాల శ్రేణిని సన్‌సింక్రనస్‌ అర్బిట్‌లో ప్రవేశపెడతారు. మళ్లీ 01:55:07 గంటలకు భారత ప్రైవేట్‌ సంస్థలకు చెందిన ఉపగ్రహాలు సతీష్‌ ధవన్‌శాట్, సింధునేత్ర, వివిధ రకాల యూనివర్సిటీ విద్యార్థులు తయారు చేసిన యూనిటీశాట్‌లో భాగంగా ఉన్న శ్రీశక్తిశాట్, జిట్‌శాట్, జీహెచ్‌ఆర్సీ ఈశాట్‌ అనే  ఐదు ఉపగ్రహాల శ్రేణిని అంతరిక్ష కక్ష్యలోకి వదిలిపెట్టి ప్రయోగాన్ని పూర్తి చేసేలా ఇస్రో శాస్త్రవేత్తలు డిజైన్‌ చేసుకున్నారు. మొదటి ప్రయోగవేదిక నుంచి 39వ ప్రయోగం కాగా, సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి 78వది, పీఎస్‌ఎల్వీ సిరీస్‌లో 53వ ప్రయోగం కావడం విశేషం.
చదవండి:
బాబు వ్యూహం.. కేశినేనికి చెక్‌!
శభాష్‌ ఏపీ.. ప్రతికూలతలోనూ ‘సుస్థిర’పరుగు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement