
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఈ నెల 7వ తేదీన సాయంత్రం 3.02 గంటలకు పీఎస్‌ఎల్‌వీ–సీ49 (పీఎస్‌ఎల్‌వీ–డీఎల్) ఉపగ్రహ వాహక నౌకను ప్రయోగించనుంది. ఇందుకు సంబంధించి 6వ తేదీన మధ్యాహ్నం 1.02 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభమవుతుంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ మొదటి ప్రయోగ వేదిక నుంచి ఈ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపిస్తారు.
పీఎస్‌ఎల్‌వీ–డీఎల్ రెండో ప్రయోగమిది
పీఎస్‌ఎల్‌వీ రాకెట్ సిరీస్‌లో రెండోసారి ప్రయోగిస్తున్న సరికొత్త రాకెట్ ఇది. రెండే రెండు స్ట్రాపాన్ బూస్టర్ల సాయంతో చేస్తున్న ప్రయోగం కావడంతో దీనికి పీఎస్‌ఎల్‌వీ–డీఎల్ అని నామకరణం చేశారు. ఈ తరహా రాకెట్‌ను తొలిసారి గత ఏడాది జనవరి 24న ప్రయోగించి విజయం సాధించారు. ఉపగ్రహాల బరువు చాలా తక్కువ కావడంతో ఖర్చు తగ్గించుకోవడానికి రెండు స్ట్రాపాన్ బూస్టర్లతో ప్రయోగం చేస్తున్నారు. ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ (ఈఓఎస్–01)గా పిలిచే స్వదేశీ నూతన ఉపగ్రహంతో పాటు మరో తొమ్మిది దేశాలకు చెందిన తేలికపాటి ఉపగ్రహాలను భూమికి అత్యంత చేరువలోని సూర్యానువర్తన కక్ష్యలోకి ప్రవేశపెడతారు. ప్రయోగాన్ని అత్యంత తక్కువ సమయంలోనే అంటే 13.55 నిమిషాల్లో పూర్తి చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment