
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధనాసంస్థ (ఇస్రో) సతీష్ ధవన్ స్పేస్ సెంటర్‌లోని మొదటి ప్రయోగవేదిక నుంచి శనివారం మధ్యాహ్నం 3.02 గంటలకు పీఎస్‌ఎల్‌వీ సీ49 (పీఎస్‌ఎల్‌వీ–డీఎల్) ఉపగ్రహ వాహకనౌకను నింగిలోకి పంపనున్నారు. ఇందుకు సంబంధించి శుక్రవారం మధ్యాహ్నం 1.02 గంటలకు కౌంట్‌డౌన్ ప్రక్రియ ప్రారంభమైంది.
రాకెట్‌కు తుది విడత తనిఖీలు నిర్వహించి ప్రయోగపనులను లాంచ్ ఆథరైజేషన్ బోర్టు (ల్యాబ్)వారికి అప్పగించడంతో వారు ప్రయోగానికి 26 గంటల ముందు అంటే శుక్రవారం మధ్యాహ్నం 1.02 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభించారు. ఈ ప్రయోగం ద్వారా స్వదేశానికి చెందిన ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ (ఈఓఎస్–01)తో పాటు అమెరికాకు చెందిన నాలుగు ఉపగ్రహాలు, లక్స్‌ంబర్గ్‌కు చెందిన నాలుగు ఉపగ్రహాలు, లిథువేనియాకు చెందిన ఒక చిన్న తరహా ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపనున్నారు.